విడుదల తేదీ : 8 మే 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : వంశీ కృష్ణ
నిర్మాత(తెలుగు) : మంచు లక్ష్మీ
సంగీతం : రఘు కుంచె
నటీనటులు : లక్ష్మీ మంచు, అడవి శేష్, బ్రహ్మనందం..
ఇటీవలే బుడుగు సినిమాతో అందరినీ భయపెట్టిన లక్ష్మీ మంచు అప్పుడే తన టోటల్ గెటప్ ని మార్చుకొని ఈ సారి ఆడియన్స్ ని తెగ నవ్వించాలని చేసిన సినిమా ‘దొంగాట’. లక్ష్మీ మంచు, అడవి శేష్, బ్రహ్మానందం, ప్రభాకర్, మధులు ముఖ్య పాత్రలు పోషించిన క్రైమ్ కామెడీ మూవీ ‘దొంగాట’ ఈ రోజు రిలీజ్ అయ్యింది. వంశీ కృష్ణ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ మంచు లక్ష్మీ ఈ సినిమాని నిర్మించింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ తో కచ్చితంగా హిట్ కొడతాం అని గట్టిగా నమ్ముతున్న ఈ చిత్ర టీం నమ్మకాన్ని నిజం చేసే ఫీడ్ బ్యాక్ ని ఆడియన్స్ నుంచి తెచ్చుకుందా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..
కథ :
శృతి (మంచు లక్ష్మీ) టాలీవుడ్ లో ఓ సక్సెస్ఫుల్ హీరోయిన్.. సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా సక్సెస్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన బర్త్ డే రోజున ఇండస్ట్రీలోని స్టార్స్ అందరినీ పిలిచి అందరికీ పార్టీ ఇస్తుంది. కట్ చేస్తే ఆ రాత్రి ముందే శృతి కిడ్నాప్ ని ప్లాన్ చేసుకున్న వెంకట్ (అడవి శేష్), కాటం రాజు(వేణు గోపాల్), విజ్జు(మధు)లు కలిసి కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసిన వీరు శృతి తల్లిని 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారు, డబ్బు ఇవ్వలేదంటే శృతిని చంపేస్తాం అని బెదిరిస్తారు.
కిడ్నాపర్స్ కి – శృతి తల్లికి మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ గా బ్రహ్మి – మాన్ ఆన్ ఫైర్(బ్రహ్మానందం) రంగంలోకి దిగుతాడు. బ్రహ్మి శృతిని రక్షించడం కోసం ఏం చేసాడు.? అసలు ఆ ముగ్గురు కిడ్నాపర్స్ ఎవరు.? ఎందుకోసం శృతిని కిడ్నాప్ చేసారు.? శృతిని కేవలం డబ్బుకోసమే కిడ్నాప్ చేసారా.? లేక వేరే కారణం ఏమన్నా ఉందా.? ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ బ్రహ్మి శృతి కిడ్నాప్ ని చేదించగలిగాడా.? లేదా.? అన్నది మీరు ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చెయ్యాల్సిందే..
ప్లస్ పాయింట్స్ :
ఈ మధ్య టాలీవుడ్ లో సూపర్ హిట్ ఫార్ములాగా మారిన క్రైమ్ కామెడీ జోనర్ ని ఈ సినిమా కోసం ఎంచుకోవడం..క్రైమ్ ద్వారా వచ్చే సస్పెన్స్ ని – కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించడం, ఇలా రెండింటిని సమపాళ్ళలో చూపించడమే ‘దొంగాట’కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సినిమా స్టార్టింగ్ చాలా వేగంగా ఉంటుంది.. ఆడియన్స్ ని కథలో త్వరగా ఇన్వాల్వ్ చేసారు. ఇంటర్వల్ బ్లాక్ ముందు వచ్చే ఓ 20నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఆలాగే ఇంటర్వల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. అంతే కాకుండా స్టార్స్ అందరితో చేసిన ఓ స్పెషల్ సాంగ్ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టిస్తుంది. అంతమంది హీరోస్ ఒకేసారి ఆన్ స్క్రీన్ పై కనిపించడం ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేలా చేస్తుంది.
ఈ సినిమాలో మెయిన్ రోల్స్ చేసింది నలుగురు… ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే.. ముందుగా లక్ష్మీ మంచు.. విలనిజం, అమాయకత్వం, రౌద్రం, భయం ఇలా ప్రతి సినిమాలోనూ నటిగా తనని తానూ కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తున్న లక్ష్మీ మంచు ఈ సినిమాలో కామెడీ యాంగిల్ ని ట్రై చేసారు. జస్ట్ ట్రై చెయ్యడమే కాదు, అందులో ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చిందనే చెప్పాలి. లక్ష్మీ మంచుని చేసిన కామెడీ, యాక్టింగ్, ఫైట్స్ – డాన్సులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక అడవి శేష్ ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్.. ఈ ఆరడుగుల కటౌట్ చూడటానికే కాదు, నటనలోనూ ది బెస్ట్ అనిపించుకున్న సినిమా దొంగాట. మొదటి నుంచి ఒకలా కనిపించే అడవి శేష్ ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కసారిగా షేడ్స్ మార్చి చూపిన నటన బాగుంది. అడవి శేష్ చేత చెప్పించిన డైలాగ్స్ సూపర్బ్. ఇన్ని రోజులు భయపట్టే పాత్రలే చేసిన ప్రభాకర్ ఈ సినిమాలో అటు సీరియస్, ఇటు కామెడీ కలగలిపిన రోల్ చేసి ఆడియన్స్ ని బాగా నవ్వించాడు. ఇతనిలో ఇంత కామెడీ టైమింగ్ ఉందా అని ఆశ్చర్యపోతాం. మధు కూడా తన మార్క్ డైలాగ్ డెలివరీతో బాగానే నవ్వించాడు.
ఇక ఫైనల్ గా డిటెక్టివ్ గా బ్రహ్మానందం తెగ నవ్వించాడు. అప్పటి వరకూ ఓ మోస్తారు స్పీడ్ లో వెళ్తున్న సినిమా బ్రహ్మానందం వస్తే చాలు స్పీడందుకుంటుంది. ముఖ్యంగా బ్రహ్మి – ప్రగతి – 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. ప్రగతి తన పాత్రలో మెప్పించింది. దొంగాట సినిమాకి సెకండాఫ్ చాలా పెద్ద ప్లస్ పాయింట్. అటు సస్పెన్స్, ఇటు కామెడీని సమంగా డీల్ చేసాడు. అంతే కాకుండా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్ లు ఆడియన్స్ ని థ్రిల్ చేసాయి.
మైనస్ పాయింట్స్ :
దొంగాట సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. సినిమాని వేగంగా స్టార్ట్ చేసినా అదే వేగాన్ని ఇంటర్వల్ ముందు వరకూ కొనసాగించలేకపోయాడు.ఫస్ట్ హాఫ్ మధ్యలో సినిమాని కాస్త సాగదీసాడు. ఓవరాల్ గా సినిమాలో చాలా డ్రాగింగ్ సీన్స్ ఉన్నాయి, వాటిని కాస్త ట్రిమ్ చేసి రన్ టైంని కాస్త తగ్గిస్తే సినిమాకి చాలా హెల్ప్ అయ్యుండేది. బ్రహ్మానందంతోనే కాకుండా కీ రోల్స్ పై కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది.
సెకండాఫ్ లో వచ్చే ఓ సెంటిమెంట్ సాంగ్ ని కూడా కట్ చేస్తే సెకండాఫ్ ఇంకాస్త స్పీడ్ గా సాగుతూ ఆడియన్స్ ని ఇంకా ఎక్కువగా కథకి కనెక్ట్ చేసేలా ఉండేది. కథని కొత్తగా రాసుకున్న డైరెక్టర్ కథనం విషయంలో సెకండాఫ్ మీద పెట్టిన శ్రద్ధ ఫస్ట్ హాఫ్ మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది. అలాగే సినిమాకి చాలా కీలకం అయిన కిడ్నాప్ ని అస్సలు డిజైన్ చేసుకోలేదు. అదే కిడ్నాప్ ని కాస్త ఇంటెలిజెంట్ గా ప్లాన్ చేసుకొని ఉంటే చూసే ఆడియన్స్ లో ఇంకాస్త ఆసక్తి క్రియేట్ అయ్యుండేది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో సినిమాకి ప్రాణంగా నిలబడిన వారు చాలా మందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ సామల భాస్కర్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథ కోసం ఎంచుకున్న ప్రతి లొకేషన్ ని చాలా బాగా చూపించాడు. క్రైమ్ కామెడీకి కీలకమైన నటీనటుల హావ భావాలను బాగా కాప్చ్యూర్ చేసాడు. రఘు కుంచె, సత్య మహావీర్, సాయి కార్తీక్ అందించిన సాంగ్స్ బాగున్నాయి. అలాగే సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి మరో మేజర్ ప్లస్ అయ్యింది. ఎస్అర్ శేఖర్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో ఓకే అనిపించింది, కానీ సెకండాఫ్ పరంగా మాత్రం వెరీ గుడ్ అనేలా ఉంది.
సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అదుర్స్ అండ్ హ్యాట్సాఫ్ టు హిమ్. ఇప్పటి వరకూ ఎంతో మీనింగ్ ఫుల్ డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాతో తనలోని కామెడీ యాంగిల్ ని కూడా బయటపెట్టాడు. ఎప్పటికప్పుడు తన మార్క్ డైలాగ్స్ వదులుతూనే, కామెడీ డైలాగ్స్ కూడా బాగా రాసాడు. ఇక ఈ సినిమాకి కెప్టెన్ గా నిలిచిన వంశీ కృష్ణ విషయానికి వస్తే.. కథ – సూపర్బ్ అని అనలేం కానీ రెగ్యులర్ జోనర్ కి మంచి బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. కథనం – ఫస్ట్ హాఫ్ నుంచి లైట్ గా ప్లాన్ చేసుకుని, చివరికి వచ్చే సరికి స్ట్రాంగ్ గా ప్లాన్ చేసాడు. అదే టెంపోని మొదటి నుంచి కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. డైరెక్టర్ గా మాత్రం మంచి మార్కులే కొట్టేసాడు. ఈ కుర్రాడిలో మంచి టాలెంట్ ఉంది, కథ – కథనం విషయంలో ఇంకాస్త వర్క్ అవుట్ చేస్తే బ్లాక్ బస్టర్ తీయగలడు. లక్ష్మీ మంచు నిర్మాణం అనుకున్న బడ్జెట్ లోనే ఉన్నా చూసే వారికి మాత్రం భారీ బడ్జెట్ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ ని మాత్రం కలుగజేసింది. నిర్మాణ విలువలు సింప్లీ సూపర్బ్..
తీర్పు :
మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా చేసిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘దొంగాట’. ఈ వేసవిలో వచ్చిన దొంగాట థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని నవ్వించడమే కాకుండా, చివర్లో అందరినీ థ్రిల్ చేసి ఓ హ్యాపీ ఫీల్ తో బయటకి వచ్చేలా చేస్తుంది. మంచు లక్ష్మీ, అడవి శేష్ ల పెర్ఫార్మన్స్, ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్ లో వచ్చే థ్రిల్స్ మరియు బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్. ఫస్ట్ హాఫ్ కొంత భాగం బోరింగ్ గా అనిపించడం, సెకండాఫ్ లో అక్కడక్కడా స్లో అవ్వడం, ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా చూపించపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. మంచి ఓపెనింగ్ తో రిలీజ్ అయిన ఈ సినిమాకి టాక్ బాగుండడం మరియు సమ్మర్ సీజన్ కావడం వలన ఈ సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ గా ఈ వారం బాక్స్ ఆఫీసు విజేత ‘దొంగాట’.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం