సమీక్ష : రాక్షసుడు – రివెంజ్ డ్రామా విత్ గుడ్ థ్రిల్స్

సమీక్ష : రాక్షసుడు – రివెంజ్ డ్రామా విత్ గుడ్ థ్రిల్స్

Published on May 31, 2015 2:00 PM IST
rakshasudu-review

విడుదల తేదీ : 29 మే 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : వెంకట్ ప్రభు

నిర్మాత : జ్ఞానవేల్ రాజా – మిర్యాల రాజ బాబు – ఎం.ఎస్.ఆర్

సంగీతం : యువన్ శంకర్ రాజా

నటీనటులు : సూర్య, నయనతార, ప్రణిత..

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్, మంచి మార్కెట్ ఉన్న హీరో సూర్య. ‘సికందర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచిన సూర్య, ఈసారి ప్రేక్షకులను మెప్పించడానికి ‘రాక్షసుడు’గా వచ్చాడు. స్క్రీన్ ప్లేతో మేజిక్ చేసే వెంకట్ ప్రభు సరికొత్త థ్రిల్లర్ కథాంశంతో తీసిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. మెగాస్టార్ చిరంజీవి అలనాటి ‘రాక్షసుడు’ టైటిల్ తో సూర్య చేసిన సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ఈ రాక్షసుడు ఎంతవరకూ ప్రేక్షకులను థ్రిల్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

మధుసూదన్ అలియాస్ మాస్(సూర్య), అతని చిన్ననాటి ఫ్రెండ్ జెట్టు(ప్రేంజీ అమరెన్) కలిసి చిన్న చిన్న మోసాలు, దొంగతనాలు చేసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వీరికి ఓ రోజు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తప్పించుకుంటూ ఉండగా మాస్ వెహికల్ కి యాక్సిడెంట్ అవ్వడంతో మాస్ ఓ రెండు సెకన్లు చచ్చి బతుకుతాడు. హాస్పిటల్ నుంచి కోలుకున్న తర్వాత మాస్ కి ఆత్మలు కనిపించడం మొదలవుతాయి. ఆ ఆత్మలు తమ కోరికలను తీర్చమని కోరతాయి. మాస్ మాత్రం వాటి కోరికలు తీర్చాలంటే తనకి హెల్ప్ చెయ్యాలని చెప్పి ఆ దెయ్యాలను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదిస్తాడు. ఈ గ్యాప్ లో మాస్ – మాలిని(నయనతార) కలుసుకోవడం, ప్రేమలో పడడం అన్నీ జరిగిపోతాయి.

అలా హ్యాపీగా సాగిపోతున్న మాస్ లైఫ్ లోకి సడన్ గా శివ కుమార్(సూర్య) ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి మాస్ లైఫ్ మొత్తం మారిపోతుంది. తెలియకుండానే మాస్ పలు మర్డర్ కేసుల్లో, ఒక రాబరీ కేసులో ఇరుక్కుంటాడు. దాంతో పోలీసులు కూడా వెతుకుతుంటారు. అసలు ఈ శివ ఎవరు.? మనిషా.. దెయ్యమా.? అసలు మాస్ కి ఎందుకు ఇన్ని ఇబ్బందులు క్రియేట్ చేసాడు.? మాస్ కి శివకి ఉన్న సంబంధం ఉందా.? ఉంటే ఏంటా సంబంధం.? చివరికి ఈ సమస్యల నుంచి మాస్ ఎలా బయటపడ్డాడు.? అనేది తెలియాలంటే మీరు వెండితెరపై ఈ రాక్షసుడు సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

సూర్య నుంచి వచ్చిన ఈ రాక్షసుడు సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మొదటి 30 నిమిషాలు. ఆ 30 నిమిషాలు పాత్రలను పరిచయం చేసిన విధానం, వచ్చిన సన్నివేశాలు అందరినీ బాగా ఆకట్టుకోవడమే కాకుండా, ఆడియన్స్ ని కథలోకి తీసుకెల్తాయి. ఆ తర్వాత ఇంటర్వెల్ బాంగ్ లో శివ పాత్రని పరిచయం చేసే విధానం, అక్కడ వచ్చే థ్రిల్స్ బాగున్నాయి.సెకండాఫ్ లో డైరెక్టర్ రివీల్ చేసిన రెండు, మూడు థ్రిల్స్ బాగానే పేలాయి. ముఖ్యంగా మాస్ – శివ పాత్రల మధ్య ఉన్న రిలేషన్ ని రివీల్ చేయడం ఆడియన్స్ ఊహించకపోవడంతో థ్రిల్ ఫీలవుతారు. ఓవరాల్ గా సెకండాఫ్ లో కొన్ని ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. సూర్య ఈ సినిమాలో రెండు డిఫరెంట్ రోల్స్ చేసాడు.. మాస్ పాత్రలో పూర్తి మాస్ లుక్ లోకనిపిస్తూ, దొంగ అయిన తన పాత్ర స్వభావాన్ని కళ్ళలో బాగా పలికించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా చేసాడు. సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్ లో తను చూపిన పెర్ఫార్మన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇకపోతే శివగా సీరియస్ రోల్లో మెప్పించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో శివ చాలా స్టైలిష్ గా కనిపించాడు. నయనతార పాత్ర సినిమాకి పెద్ద హెల్ప్ కాదు. నయనతార లుక్స్ పరంగా మాత్రం చాలా బాగుంది. ప్రణీత చేసింది చాలా చిన్న పాత్ర అయిన ఆ పాత్ర సినిమాకి ముఖ్యం. ఉన్నంతలో మంచి నటనని కనబరిచింది. ఇక సినిమాలో మేజర్ రోల్ చేసిన ప్రేంజీ అమరెన్ సినిమా అంతా మాస్ పాత్రతో ట్రావెల్ అవుతూ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మాస్ – ప్రేంజీ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కొన్ని ఫన్నీగా ఉంటాయి.

సెకండాఫ్ లో పొలీస ఆఫీసర్ గా వచ్చే ప్రతిబన్ క్యారెక్టర్ ఉండేది 10 నిమిషాలే అయినా ఆ పాత్రలో అటు సీరియస్ ని, ఇటు కామెడీని అందులో బాగా మిక్స్ చేసారు. ఇకపోతే విలన్స్ గా చేసిన సముద్ర ఖని – శరత్ నటన బాగుంది. సినిమాలో ఆత్మలు గా నటించిన పలువురు నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సినిమాలో ఐదు నిమిషాలు వచ్చే బ్రహ్మానందం ఎపిసోడ్ బాగా నవ్విస్తుంది. ఓవరాల్ గా మాస్ సినిమాలో ఆడియన్స్‌ని మెప్పించదగిన కొన్ని కామెడీ ఎలిమెంట్స్, కొన్ని ట్విస్ట్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

రాక్షసుడు సినిమాలో చెప్పడానికి మైనస్ పాయింట్స్ బాగానే ఉన్నాయి. ముందుగా సినిమా పరంగా చూసుకుంటే సినిమా మొదటి 30 నిమిషాల తర్వాత బాగా బోరింగ్ గా తయారవుతుంది. ఇంటర్వల్ బ్లాక్ వరకూ ఆడియన్స్ కి బాగా బోర్ కొడుతుంది. సెకండాఫ్ లో కూడా అక్కడక్కడా కొన్ని కొన్ని ఎలిమెంట్స్ ఆకట్టుకుంటూ ఉంటాయి తప్ప ఆద్యంతం ఆసక్తికరంగా ఉండదు. ఇక మిగిలిన విషయాలకు వస్తే.. మొదటి మైనస్ కథ. ఇదొక రెగ్యులర్ రివెంజ్ డ్రామా. దానికి ఆత్మలు అనే పాయింట్ ని కలిపి చెప్పాలనుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. చెప్పాలంటే ఈ సినిమా ఓవరాల్ స్టొరీ లైన్ ఇటీవలే వచ్చిన ‘వారధి’ సినిమాని పోలి ఉంటుంది. అదేమో లవ్ స్టొరీ, ఇదేమో రివెంజ్ స్టొరీ అంతే తేడా..

డైరెక్టర్ సింపుల్ స్టొరీలైన్ ని పెట్టుకొని స్క్రీన్ ప్లే తో మేజిక్ చెయ్యాలనునుకున్నాడు. కానీ కుదరలేదు. కొన్ని ట్విస్ట్ లను బాగానే రివీల్ చేసినా ఆద్యంతం ఆడియన్స్ ని సీట్లో కూర్చోబెట్టలేకపోయాడు. సినిమాకి చాలా కీలకమైన ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ చాలా సింపుల్ గా ఉండడం వలన కథ తేలిపోతుంది. అంత సేపు చూసిన ఆడియన్స్ అప్పటి నుంచీ దాచిపెట్టిన క్లైమాక్స్ ఇంతేనా అని ఫీలవుతారు. ఇకపోతే నయనతార పాత్రకి సినిమాలో అస్సలు ప్రాముఖ్యత లేదు. దానికి తోడు సూర్య – నయనతార రొమాంటిక్ ట్రాక్ ని కూడా సరిగా చూపించలేదు. సినిమాలో రెగ్యులర్ ఆడియన్స్ కోరుకుంటే ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ చాలా తక్కువ. బి,సి ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ వాల్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇకపోతే సినిమాలో బయపెట్టడానికి వాడిన గ్రాఫిక్స్ చాలా నాశిరకంగా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో పర్వాలేధనిపించిన అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో ముందుగా యువన్ శంకర్ రాజా మ్యూజిక్.. యువన్ అందించిన పాటలు తెలుగులో పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ఇక రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇచ్చిన ప్రతి లొకేషన్ ని కథకి తగ్గట్టు బాగా చూపించాడు. నటీనటుల్ని కూడా బాగా ప్రెజెంట్ చేసాడు. పాటల్ని బాగా రిచ్ గా గ్రాండ్ విజువల్స్ తో షూట్ చేసాడు. ఎడిటర్ ప్రవీణ్ ఇంకాస్త కేర్ తీసుకొని ఫస్ట్ హాఫ్ లో చాలా వరకూ కట్ చేసి ఉండొచ్చు. రెండున్నర గంటల సినిమాగా కాకుండా, 2 గంటల 10 నిమిషాలలో కంప్లీట్ చేయగలిగి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది. శశాంక్ వెన్నలకంటి డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. సెల్వ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి.

రాక్షసుడు సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వ బాధ్యతలు వెంకట్ ప్రభు తీసుకున్నాడు. కథ – చాలా సింపుల్ అండ్ హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి తీసుకున్నారు. స్క్రీన్ ప్లే – సింపుల్ లైన్ తో స్క్రీన్ ప్లే ద్వారా ఏదో చేసేద్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు. స్క్రీన్ ప్లే అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాకపోవడం వలన ఈ వెంకట్ ప్రభు సిక్సర్ అనుకున్న స్థాయిలో మేజిక్ క్రియేట్ చేయలేకపోయింది. దానికి తోడు ఆడియన్స్ బోరింగ్ ఫీల్ అయ్యేలా చేసింది. ఇక డైరెక్టర్ గా పెర్ఫార్మన్స్ అయితే రాబట్టుకున్నాడు కానీ ఆడియన్స్ కి 100% ఎంటర్ టైన్మెంట్ ఉన్న సినిమాని అందించలేకపోయాడు. జ్ఞానవేల్ రాజా – మిర్యాల రాజ బాబు – ఎం.ఎస్.ఆర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

భారీ అంచనాల నడుమ సూర్య హీరోగా వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘రాక్షసుడు’ సినిమా ఈ సమ్మర్లో వచ్చిన డీసెంట్ థ్రిల్లర్ గా మిగిలిపోయింది. ఆడియన్స్ ని 100% మెప్పించలేకపోయింది, అలాగని నిరుత్సాహపరచదు. అక్కడక్కడా వచ్చే కొన్ని బోరింగ్ ఎలిమెంట్స్ ని కాస్త పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా సినిమా చాలా డీసెంట్ గా ఉండడమే కాకుండా మిమ్మల్ని థ్రిల్ చేసే అంశాలు కూడా ఉంటాయి. రెగ్యులర్ రివెంజ్ డ్రామాని డిఫరెంట్ నేపధ్యంలో చెప్పాలని డైరెక్టర్ వెంకట్ ప్రభు ట్రై చేసాడు. కానీ తన స్క్రీన్ ప్లే మేజిక్ ని అనుకున్నస్థాయిలో వర్క్ అవుట్ చేయలేకపోవడం వలన 60_70% మాత్రమే ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యగలిగాడు. సూర్య పెర్ఫార్మన్స్, ఫస్ట్ 30 నిమిషాలు, ఇంటర్వెల్ బ్లాక్, ఓవరాల్ గా మెప్పించే కొన్ని థ్రిల్స్ ఈ సినిమాకి సేవింగ్ పాయింట్స్ అయితే, ఇంకాస్త బెటర్ గా రాసుకోవాల్సిన స్క్రీన్ ప్లే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరియ సింపుల్ స్టొరీ లైన్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా రాక్షసుడు సినిమాపైన భారీ అంచనాలు పెట్టుకోకుండా సినిమాకి వెళితే మీరు నిరుత్సాహపడకుండా బయటకి వస్తారు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు