సమీక్ష : జాదూగాడు – రొటీన్ మాస్ మసాలా.!

సమీక్ష : జాదూగాడు – రొటీన్ మాస్ మసాలా.!

Published on Jun 28, 2015 7:30 AM IST
Jadoogadu-review

విడుదల తేదీ : 26 జూన్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : యోగేష్

నిర్మాత : వివిఎన్ ప్రసాద్

సంగీతం : సాగర్ మహతి

నటీనటులు : నాగ శౌర్య, సొనారిక బదోరియా..

‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నాగ శౌర్య చేసిన మొదటి యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాదూగాడు’. బాలీవుడ్ బుల్లితెరపై మెరిసిన సొనారిక బదోరియా హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాకి ‘చింతకాయల రవి’ ఫేం యోగేష్ డైరెక్టర్. వివిఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ద్వారా మణిశర్మ తనయుడు సాగర్ మహతి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసిన నాగ శౌర్య, హిట్ కోసం గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేసిన యోగేష్ ఎంత వరకూ తెలుగు ప్రేక్షకులను మెప్పించారు అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

పాలమూరు గ్రామంలో ఆకతాయిగా తిరిగే కృష్ణ(నాగ శౌర్య), అతని ఫ్రెండ్ సత్తి(సత్య) కోటి రూపాయలు సంపాదించాకే ఆ ఊరు తిరిగి రావాలని హైదరాబాద్ బయలు దేరుతారు. హైదరాబాద్ వచ్చిన కృష్ణ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఓ బ్యాంకు వారు 2 లక్షలు కట్టి, లోన్ కట్టకుండా ఎగ్గొట్టేసిన 10 మంది నుంచి కోటి రూపాయల లోన్ రికవరీ చేసుకోవచ్చని ఆడర్ ఇస్తాడు. ఆ డీల్ నచ్చడంతో కృష్ణ కోటి కోసం ఆ కాంట్రాక్ట్ తీసుకుంటాడు. కానీ వాళ్ళందరూ రౌడీలు అవ్వడంతో ఎవ్వరూ కట్టను అంటారు. దాంతో చేసేదేమీ లేక కృష్ణ కూడా ఓ గుండా దగ్గర తను రౌడీయిజం చేసి లోన్ రికవర్ చేస్తాడు. ఆ టైంలో అక్కడే ఉన్న ఆ ఊరి రౌడీ మరియు మినిస్టర్ జగదీశ్ నాయుడు(కోట శ్రీనివాసరావు)కి రైట్ హ్యాండ్ అయిన శ్రీశైలం(జాకీర్ హుస్సేన్) కృష్ణలోని కాలిబర్ ని చూసి తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు.

అదే టైంలో కృష్ణ నర్స్ అయిన పార్వతి(సోనారిక బదోరియా)తో ప్రేమలో పడతాడు. అనుకున్నట్టే ఇద్దరూ లవర్స్ అవుతారు. కృష్ణ శ్రీశైలం దగ్గర పనిచేస్తూ, తన పేరు చెప్పుకొని ఒక్కొక్కడి దగ్గర లోన్ వసూలు చేస్తుంటాడు. ఆ టైంలోనే శ్రీశైలం కృష్ణని తనకు తెలియకుండానే ఓ ఇంటర్నేషనల్ డీల్ లో ఇరికిస్తాడు. అప్పటి నుంచి కృష్ణ జీవితంలో అనుకోని సంఘటనలు, పోలీసులు, చేజ్ లు జరగడమే కాకుండా తను లవ్ చేసిన పార్వతిని కిడ్నాప్ చేస్తారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి.? పార్వతిని ఎవరు కిడ్నాప్ చేసారు.? అసలు శ్రీశైలం కృష్ణని ఇన్వాల్వ్ చేసిన ఇంటర్నేషనల్ డీల్ ఏంటి.? వీటన్నిటి నుంచీ తప్పించుకొని తన లవర్ మరియు తనకి కావాల్సిన కోటి రూపాయల్ని సాధించాడా? లేదా? అన్నది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

హీరో పాత్ర కోసం రాసుకున్న ఓ కొత్తరకం పాత్ర, ఆ పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమాకి ‘జాదూగాడు’ అని టైటిల్ పెట్టడమే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. ఈ సినిమాలో మేజర్ హైలైట్ గా అనిపించేది హీరో పాత్రని డిజైన్ చేసిన తీరు. సినిమా ఫస్ట్ హాఫ్ ని మొదలు పెట్టిన తీరు, హీరో పాత్రని అగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్ళిన స్టైల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ వలన సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా ఉంటుంది. అలాగే క్లైమాక్స్ బ్లాక్ లో ట్విస్ట్ ని రివీల్ చేయడం బాగుంది.

ఇప్పటివరకూ లవర్ బాయ్ గా ప్రేక్షకులను మెప్పించిన నాగశౌర్య మాస్ యాంగిల్ లో కూడా చాలా వరకూ మెప్పించాడనే చెప్పాలి. ఎక్కువ భాగం మాస్ డైలాగ్ డెలివరీ, మాస్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ మాస్ అంతగా టచ్ లేకపోవడం వలన కొన్ని కీ సీన్స్ లో తేలిపోయాడు. ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. డాన్సులు, ఫైట్లు బాగా చేసాడు. సోనారిక బదోరియాకి ఇది తొలి సినిమా అయినప్పటికీ చాలా బాగా నటించింది. అలాగే చూడటానికి చాలా క్యూట్ గా ముద్దుగా బొద్దుగా ఉంది. అలాగే సినిమాలో అందాల ఆరబోత కూడా బాగానే చేసింది. సోనారికలో మంచి ఈజ్ ఉంది.తనలో ఉన్న ఎనర్జీ లెవల్స్ ని సరిగా వాడుకుంటే తన కెరీర్ కి బాగానే హెల్ప్ అవుతుంది. నాగ శౌర్య – సోనారిక కెమిస్ట్రీ మరియు లిప్ కిస్ లు ఈ సినిమాకి మరో అట్రాక్షన్.

మెయిన్ విలన్ గా చేసిన జాకీర్ హుస్సేన్ పెర్ఫార్మన్స్ బాగుంది. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన ఆశిష్ విద్యార్థి, రవి కాలే, కోట శ్రీనివాసరావు, అజయ్ లు తమ పరిధిమేర నటించారు. శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేష్, సప్తగిరి కామెడీ ట్రాక్స్ కాస్త నవ్విస్తాయి. అలాగే మణిశర్మ తనయుడు సాగర్ మహతి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ హైలైట్.

మైనస్ పాయింట్స్ :

పైన ప్లస్ పాయింట్స్ లో చెప్పినట్టు హీరో పాత్రని డిజైన్ చేసుకున్న తీరే ఈ సినిమాకి ప్లస్.. కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్న హీరో టెంపోని సెకండాఫ్ లో కంటిన్యూ చేయలేకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. కృష్ణ అనే పాత్రనే సినిమాకి హైలైట్. అనుకున్నట్టుగానే డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో హీరో పాత్రని ఆడియన్స్ కి కనెక్ట్ చేసేసాడు. దాంతో ఆడియన్స్ సెకండాఫ్ లో ఇంకాస్త ఎక్కువ అంచనాలు పెంచుకుంటారు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. డైరెక్టర్ సెకండాఫ్ లో హీరోయిజంతో కాకుండా స్క్రీన్ ప్లే మీద ఆకట్టుకోవాలని ట్రై చేసాడు. కానీ స్క్రీన్ ప్లేలో ఆశించిన ఆసక్తికర ఎలిమెంట్స్ లేకపోవడం, అనవసరమైన సీన్స్ కొన్ని జత కలవడం మరియు నెరేషన్ స్లో అయిపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్.

ఇకపోతే సినిమా క్లైమాక్స్ లో రివీల్ చేసే ట్విస్ట్ ని చాలా వరకూ అందరూ ఊహించగలరు. ఇకపోతే సినిమాలో వచ్చే రవికాలే – ఆశిష్ విద్యార్థి పోలీస్ ఎపిసోడ్ పెద్ద కిక్ ఇవ్వలేదు. అలాగే సెకండాఫ్ లో రన్ టైంని మరింత పెంచడం కోసం ఇరికించిన కామెడీ సీన్స్ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ముఖ్యంగా సప్తగిరి పాత్ర కథకి అవసరం లేదు. కానీ ఏదో కామెడీ కోసం పెట్టారు. కానీ డబుల్ మీనింగ్ కామెడీ మరీ ఎక్కువ అవ్వడంతో ఆ ఎపిసోడ్ ఎబ్బెట్టుగా ఉంటుంది. అలాగే లాజికల్ గా కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇది కమర్షియల్ సినిమా కానీ ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ సరిగా లేకపోవడం కొంతమందిని నిరాశపరుస్తుంది. ఇకపోతే ఈ సినిమాని షార్ట్ అండ్ స్వీట్ గా రెండు గానట్లో చెప్పి ఉంటే బాగుండేది. కానీ రెండున్నర గంటలు చెప్పడం సినిమాకి మరో మైనస్.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్ మెంట్ ఈ చిత్ర టీం మొత్తం ముందుగా థాంక్స్ చెప్పాల్సిన మొదటి వ్యక్తి ఒకరు.. అతనే ఈ సినిమాతో పరిచయం అయిన మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ మహతి(మణిశర్మ తనయుడు). సాగర్ అందించిన పాటలు బాగున్నాయి. అంతకంటే మించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాలో ప్రతి సీన్ కి సూపర్బ్ రీ రికార్డింగ్ ఇచ్చాడు. హీరో ఎలివేషన్ సీన్స్. రొమాంటిక్ సీన్స్ లో సూపర్బ్ గా మ్యూజిక్ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సిన వ్యక్తి సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరాం. అతని విజువల్స్ చాలా కలర్ఫుల్ అండ్ గ్రాండ్ గా ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ ని చాలా బాగా షూట్ చేసాడు. పాటల్లో పిక్చరైజేషన్ చాలా క్లాస్ గా ఉంది. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ ఇంకాస్త షార్ట్ గా ఉండాల్సింది. కొన్ని అనవసర సీన్స్ ఉన్నాయని డైరెక్టర్ కి చెప్పి కట్ చేసి సినిమా రన్ టైం తగ్గించి ఉంటే ఇంకాస్త హెల్ప్ అయ్యేది. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ బాగుంది. వెంకట్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

జాదూగాడు సినిమాకి కథ – మాటలు అందించింది మధు సూధన్. కథ – ఈ కథకోసం మంచి పాత్రని డిజైన్ చేసుకున్నాడు, కానీ ఆ పాత్ర చుట్టూ ఆధ్యంతం ఆకట్టుకునే కథని రాసుకోలేకపోయాడు. డైలాగ్స్ – చాలా బాగున్నాయి. ముఖ్యంగా లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకునే వాడు ఎలా ఆలోచించాలి అనే నేపధ్యంలో రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఇక స్క్రీన్ ప్లే – దర్శకత్వ బాధ్యతలు యోగేష్ తీసుకున్నాడు. స్క్రీన్ ప్లే – ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న రేసింగ్ స్క్రీన్ ప్లే సెకండాఫ్ లో కూడా ఉంది ఉంటే బాగుండేది. అలాగే సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ ని ఇంకాస్త ఆసక్తికరంగా చెప్పాల్సింది. డైరెక్టర్ గా మాత్రం చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇంకాస్త కథ – స్క్రీన్ ప్లే మీద వర్కౌట్ చేస్తే మంచి కమర్షియల్ సినిమా తీయగలడు. వివిఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నాగ శౌర్య నుంచి వచ్చిన మొదటి మాస్ ఎంటర్టైనర్ ‘జాదూగాడు’ సినిమా ప్రేక్షకుల చేత జస్ట్ ఓకే అనిపించుకుంది. డైరెక్టర్ అనుకున్న హీరో క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా ప్రెజంట్ చేయలేకపోవడం వలనే ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించుకోవాల్సి వచ్చింది. మధు సూధన్ – యోగేష్ కలిసి ఓ మంచి మాస్ పాత్రని డిజైన్ చేసారు కానీ ఆన్ స్క్రీన్ కి వచ్చేసరికి ఆ పాత్రకి పూర్తి న్యాయం చేయలేకపోవడంతో సెకండాఫ్ లో ఆడియన్స్ ఆ పాత్ర నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు. నాగ శౌర్య – సోనారికల పెర్ఫార్మన్స్, కెమిస్ట్రీ, ఫస్ట్ హాఫ్, కొన్ని మాస్ ఎలిమెంట్స్ సినిమాకి ప్లస్ అయితే ఆకట్టుకోలేకపోయిన సెకండాఫ్, హీరో పాత్ర సెకండాఫ్ లో సరిగా ఎలివేట్ కాకపోవడం, లెస్ ఎంటర్టైన్మెంట్, ఎక్కువైన రన్ టైం మైనస్ పాయింట్స్. కొత్తగా స్టార్ట్ చేసినా చివరికి పరమ రొటీన్ గా ముగించే కమర్షియల్ సినిమాలు కోరుకునే వారు మాత్రం ఈ సినిమాని చూడచ్చు. మిగతా వారు మాత్రం సెకండాఫ్ విషయంలో నిరుత్సాహపడతాడు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు