ప్రత్యేక ఇంటర్వ్యూ : ప్రభాస్ – ‘బాహుబలి’లో హీరోయిజంతో పాటు ‘ది పవర్ ఆఫ్ విమెన్’ కూడా చూస్తారు.

ప్రత్యేక ఇంటర్వ్యూ : ప్రభాస్ – ‘బాహుబలి’లో హీరోయిజంతో పాటు ‘ది పవర్ ఆఫ్ విమెన్’ కూడా చూస్తారు.

Published on Jul 6, 2015 8:37 AM IST

prabhas
‘వర్షం’, ‘ఛత్రపతి’, ‘మున్నా’, ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’, ‘Mr పర్ఫెక్ట్’, ‘మిర్చి’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో యంగ్ రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఆరడుగుల కటౌట్ ఉన్న ప్రభాస్ ‘ఛత్రపతి’ తర్వాత మరోసారి దర్శకదిగ్గజం జక్కన్న అలియాస్ ఎస్ఎస్ రాజమౌళితో కలిసి రెండున్నరేళ్ళు ఎంతో కష్టపడి చేసిన మొట్ట మొదటి భారీ బడ్జెట్ ఇండియన్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. ప్రస్తుతం ఇండియా మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా జూలై 10న నాలుగు(తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ) భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బాహుబలితో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించి ‘బాహుబలి’ అనుభవాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) రాజమౌళి 6 ఏళ్ళ క్రితం స్టొరీ లైన్ చెప్పారు, మూడేళ్ళ క్రితం పూర్తి కథ చెప్పారు. ‘బాహుబలి’ కోసం మూడేళ్ళు టైం ఇచ్చేంతలా మిమ్మల్ని మెప్పించిన పాయింట్ ఏంటి.?

స) ప్రతి ఒక్క హీరోకి తన లైఫ్ టైంలో ఒక్కసారైనా పీరియడ్ ఫిల్మ్ చేయాలని ఉంటుంది. అదికూడా పీరియడ్ బేస్ సినిమా, అందులో ఒక భారీ యుద్ధం(వార్) ఎపిసోడ్ ఉంటే చాలు అని అనుకుంటాం. ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్స్ పిక్చర్, ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ చూడని గ్రాండ్ విజువల్స్, మునుపెన్నడూ చూడని స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇలా ఒకటికాదు ఈ సినిమాలో సర్ప్రైజ్ చేసేవి చాలానే ఉన్నాయి. ఇలాంటి అవకాశం, అనుభవం లైఫ్ టైంలో ఒక్కసారే వస్తుంది. అందుకే ఈ సినిమాకి సైన్ చేయడమే కాకుండా అంత టైం కేటాయించాం.

ప్రశ్న) రాజమౌళి ఒకటిన్నర సంవత్సరం అడిగితే ఈ సినిమాకి ఆ టైం సరిపోదు అని మీరే రెండున్నరేళ్ళు అని ఫిక్ అయ్యారు. అంత టైం కేటాయించడం రిస్క్ అని అనిపించలేదా.?

స) నాకు రిస్క్ అని ఏమీ అనిపించలేదు. ఎందుకు అంటే నాకు కథ చెప్పినప్పుడే దాని రేంజ్ ఏంటనేది అర్థమైంది. అలాగే రాజమౌళి వర్కింగ్ స్టైల్ నాకు తెలుసు అందుకే రాజమౌళికి ఇంకాస్త టైం తీసుకోమని చెప్పాను. ఇప్పుడు చెప్పాలంటే ఓవరాల్ గా మూడున్నరేళ్ళు ఈ సినిమాకోసం పనిచేస్తున్నాం. రాజమౌళి విజన్, సబు సిరిల్ ఆర్ట్ వర్క్స్, నిర్మాతల రిస్క్ ఇవన్నిటితో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వించేలా బాహుబలి లాంటి ఓ సినిమా రావాలి అంటే నా వంతుగా నేను చేయాల్సింది ఈ సినిమాకి టైం ఇవ్వడం మాత్రమే. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా అంత టైం ఇచ్చాను. అందుకే టీంలో ఎవ్వరికీ రిస్క్ తీసుకుంటున్నాం అనే ఫీలింగ్ లేదు.

ప్రశ్న) ఒక రాజ్యం, రాజులుగా ఇద్దరు అన్నదమ్ములు, వారి మధ్య వైరం, ప్రజల సంక్షేమం.. దీని ప్రకారం రెగ్యులర్ ఫార్మాట్ మూవీని పీరియడ్ సినిమాగా మార్చారా లేక రెగ్యులర్ సినిమాకి మించి ఈ కథలో ఏమన్నా ఉందా.?

స) మామూలుగా చెప్పాలి అంటే క్లాసిక్ టచ్ ఉన్న కమర్షియల్ సినిమా. కానీ ఇద్దరు అన్నదమ్ములు, వారే హీరో – విలన్ అనిసాగే సింపుల్ కథ అయితే బాహుబలి కాదు. బాహుబలిలో నేను, రానానే కాదు ఇంకా ఎన్నో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి మదర్ ఫీలయ్యే కొన్ని ఫీలింగ్స్, ప్రతి వైఫ్ ఫీలయ్యే కొన్ని ఫీలింగ్స్, ప్రతి లవర్ ఫీలయ్యే కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. చాలా ఎమోషన్స్ ఉంటాయి. అలాగే ఈ సినిమాలో కులతత్వం గురించి కూడా ఓ పాయింట్ ఉంటుంది. కులతత్వం అనే పాయింట్ ఫస్ట్ పార్ట్ లో కేవలం లైట్ గా టచ్ అవుతుంది. సెకండాఫ్ లో ఎక్కువగా ఉంటుంది.

ప్రశ్న) మీరు ఈ సినిమాలో బాహుబలి మరియు శివుడు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఆ రెండు పాత్రల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి.?

స) బాహుబలి – శివుడు రెండు పాత్రల్లో కామన్ గా ఉండే పాయింట్ ఇద్దరూ చాలా స్ట్రాంగ్. ఇక అమరేంద్ర బాహుబలి విషయానికి వస్తే పుట్టడమే ఒక ప్రిన్స్, గ్రేటెస్ట్ వారియర్, చాలా మంచి వాడు, ఆలోచనా శక్తి ఎక్కువగా ఉన్నవాడు. శివుడు పెరిగిన వాతావరం చాలా డిఫరెంట్, ఒక ఆటవిక ప్రాంతంలో పెరుగుతాడు, చాలా ఫ్రీగా ఉంటాడు, ఆ పాత్రలో కాస్త కామెడీ కూడా ఉంటుంది. శివుడు అసలు లక్ష్యం ఏంటనేది తర్వాత తెలుస్తుంది. ఇద్దరి యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

ప్రశ్న) శివుడు – బాహుబలి పాత్రల్లో మీకు నచ్చిన పాత్ర ఏంటి.? అలాగే ఫిజికల్ గా ఈ రెండు పాత్రల్లో డిఫరెన్స్ ఏంటి.?

స) దగ్గర దగ్గరగా శివుడు లాంటి టచ్ ఉన్న పాత్రని ఇంతకముందు నేను ఎక్కడన్నా చేసి ఉండచ్చు. కానీ బాహుబలి లాంటి స్ట్రాంగ్, ఇంటెన్స్, కింగ్ లాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. పాత్రలో బలం ఉండి, ఎప్పటికీ మరువలేనిదిగా గుర్తుండిపోయేది మాత్రం బాహుబలినే. అందుకే అదంటేనే కాస్త ఇష్టం. ఆడియన్స్ కి కూడా చాలా కొత్త ఫీలింగ్ ని ఇస్తుంది. ఫిజికల్ గా అంటే బాహుబలి అంటే చాలా బలంగా, స్ట్రాంగ్ మజిల్స్ తో కనపడాలి. అందుకే మునుపెన్నడూ లేనంతగా 18 ఇంచ్ బైసప్స్ పెంచాను. అలాగే ఆ పాత్ర కోసం 100 కేజీలు బరువు పెరిగాను. శివుడు పాత్ర కోసం అంత మజిల్స్ అవసరం లేదు, అందుకే 80-85కేజీలకి తగ్గి శివుడు పాత్ర చేసాను.

ప్రశ్న) రాజమౌళి విలన్ అంటే హీరో కంటే స్ట్రాంగ్ గా ఉంటాడు. మరి ఇందులో రానా పాత్ర గురించి చెప్పండి.?

స) హీరో కంటే స్ట్రాంగ్ గా విలన్ ని చూపించడం రాజమౌళి స్పెషాలిటీ. ఈ సినిమాలో కూడా రానా క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. భళ్లాలదేవ పాత్రలో ఆలోచన తక్కువ, కండబలం, రౌద్రం ఎక్కువగా ఉంటాయి. ఈ పాత్ర రానా చేసినందుకు రానాకి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. తను తప్ప ఇంకెవరూ అంత పర్ఫెక్ట్ గా ఈ పాత్రని చెయ్యలేరేమో అనేలా చేసాడు. తనకి చాలా పెద్ద పేరు తెచ్చే సినిమా బాహుబలి అవుతుంది.

ప్రశ్న) ఈ సినిమాలో మేల్ క్యారెక్టర్స్ కాకుండా లేడీ క్యారెక్టర్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ పాత్రల గురించి చెప్పండి.?

స) ఈ సినిమాలో స్ట్రాంగ్ హీరోయిజం, విలనిజంతో పాటు లేడీ పాత్రలన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ‘ది పవర్ ఆఫ్ విమెన్’ అనేది మీరు బాహుబలిలో చూస్తారు. రమ్యకృష్ణ గారు చేసిన శివగామి పాత్ర చూస్తె లేడీస్ లో ఆమె కన్నా పవర్ఫుల్ ఇంక ఎవరు లేరేమో అనిపిస్తుంది. శివగామి పాత్ర ఎంతో స్ట్రాంగ్ గా ఉండడమే కాకుండా, ఆ మదర్ పాత్రలో ఎంతో డెప్త్ ఉంటుంది. ఇక అనుష్క చేసిన పాత్ర కూడా చాలా స్ట్రాంగ్ మరియు ధైర్యం ఉన్న పాత్ర. ఇక అవంతిక విషయానికి వస్తే మీరిప్పటి వరకూ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్ ని మాత్రమే చూసారు. కానీ సినిమాలో కొత్త అవంతికని చూస్తారు. కత్తి యుద్ధం చేస్తది, స్టంట్స్ చేతుంది, మర్డర్స్ చేస్తుంది, అలాగే స్టన్నింగ్ లుక్స్ లో కనపడుతుంది. అలాగే రోహిణి గారి పాత్రలో కూడా విమెన్ పవర్ చూస్తారు.

ప్రశ్న) అందరిలోనూ బాహుబలి మునుపెన్నడూ చూడని భారీ విజువల్స్ ఇందులో ఉండడం కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఆడియన్స్ విజువల్ మాయలో పడి పాత్రలని ఎంజాయ్ చెయ్యగలరా.?

స) రాజమౌళి మొదటి నుంచీ నమ్మింది ఒకటే అదే కథ.. ఆయనకి కథ, కథలోని పాత్రల మీద నమ్మకం ఉంది. కథకి కావాల్సిన విజువల్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. అంతే కానీ విజువల్ కోసం కథలో ఒక్క షాట్ కూడా పెట్టలేదు, మీకు కనిపించదు కూడా.. ప్రతి పాత్రలో ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ద్వారానే ఆడియన్స్ విజువల్స్ కి కనెక్ట్ అవుతారు. బాహుబలి సినిమాలో స్ట్రాంగ్ కథ, ఎమోషన్స్, రాజమౌళి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్, డ్రామాలతో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉంటాయి.

ప్రశ్న) సీక్వెల్ అన్నప్పుడు ఫస్ట్ పార్ట్ ముగింపుని ఆర్ధాంతరంగా ఇచ్చేస్తే ఆడియన్స్ లో ఓ నిరుత్సాహం ఉంటుంది, మరి బాహుబలి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ ని ఎలా ప్లాన్ చేసారు.?

స) రెండు పార్ట్స్ అనుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ ఏం చెయ్యలా అని అందరూ తలలు పట్టుకున్నాం. కానీ మన జీనియస్ రాజమౌళి గారే ఓ కరెక్ట్ పాయింట్ దగ్గర ఆపారు. దానివల్ల బాహుబలి ఫస్ట్ పార్ట్ చూసాక ఒక పూర్తి సినిమా చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే అక్కడ ఇచ్చే ఓ చిన్న ట్విస్ట్ వలన సెకండ్ పార్ట్ పైన ఆసక్తి కలుగుతుంది.

ప్రశ్న) అందరికీ బాలీవుడ్ హీరో అవ్వాలని ఉంటుంది. కానీ మీరు సడన్ గా ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ వైడ్ ఫేమస్ అయిపోతున్నారు. మీరెలా ఫీలవుతున్నారు.?

స) బాహుబలి స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా షాక్ న్యూస్ లు తగులుతున్నాయి. అలానే ఇది కూడా జరిగింది.. మీరన్నట్టు ఇప్పటి వరకూ తెలుగు వారికే తెలిసిన నేను ఒక్కసారిగా ఇండియా వైడ్ అందరికీ పరిచయం కానున్నాను. వారంతా నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో, నన్ను ఆదరిస్తారా లేదా అన్నది నాకు తెలియదు. కానీ తమిళ్ లో ఎప్పటి నుంచో ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాను. కావున వాళ్ళకి నచ్చితే బాగుంటుంది అనుకుంటున్నాను. వీటన్నిటికి మించి నేను కోరుకుంటోంది ఒకటే ఈ చిత్ర నిర్మాతలు, రాజమౌళి ఎంతో రిస్క్ తీసుకొని ఈ సినిమా చేసారు. కచ్చితంగా ఆడియన్స్ అందరికీ నచ్చే ప్రోడక్ట్ మా దగ్గర ఉంది. అందరూ థియేటర్స్ కి వచ్చి ఈ సినిమా చూసి ప్రోత్సహించాలి అని కోరుకుంటున్నాను. అది చాలు నన్ను ఆదరించినా ఆదరించకపోయినా పర్లేదు.

ప్రశ్న) బాహుబలి షూటింగ్ టైంలో ఎక్కువ కష్టంగా, బాగా స్ట్రెస్ గా ఫీలయిన సీన్స్ ఏంటి.?

స) వార్ సీన్స్ మరియు ఎక్కువ టైం యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. చాలా కష్టం కూడా.. ఈ సినిమాలో 300డేస్ నేను పనిచేస్తే అందులో 250 డేస్ యాక్షన్ ఎపిసోడ్స్ చేసాను. అన్నీ పెద్దవి కాకపోవచ్చు కానీ ప్రతి సీన్ లో నేను ఏదో ఒక యాక్షన్ సీక్వెన్స్(ఎగరడం, దూకడం, కొట్టడం, కొండలు ఎక్కడం) చేస్తుంటాను.

ప్రశ్న) 380 డేస్ షూటింగ్ లో ఎక్కువ రోజులు బ్లూ మాట్ చుట్టూనే సినిమా చేసారు. ఎన్నో విషయాలను ఊహించుకొని చెయ్యాలి, అదెప్పుడు కష్టంగా అనిపించలేదా.?

స) బ్లూ మాట్ అనేది నటీనటులకి అంత పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మేము కెమెరాని చూసి రొమాన్స్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా ఎన్నో చేస్తాం. కావున నా వరకూ ఈ బ్లూ మాట్, గ్రాఫిక్స్ అనేది టెక్నికల్ టీంకి కష్టం. వాళ్ళు సెట్లో ప్రతి ఊహించుకొని మాకు చెప్పాలి, ఆలాగే దానికి తగ్గట్టుగా కెమెరా యాంగిల్ పెట్టుకోవాలి.

ప్రశ్న) దాదాపు 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత రాజమౌళితో కలిసి పనిచేసారు. అప్పటికీ ఇప్పటికీ రాజమౌళిలో మీరు గమనించిన మార్పు ఏమిటి.? అలాగే బాహుబలి షూటింగ్ టైంలో ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ అయ్యారా.?

స) రాజమౌళి గారు సినిమా సినిమాకి 1000టైమ్స్ డెవలప్ అవుతుంటారు. ఉదాహరణకి రెండు విషయాలు చెప్తా.. వర్షం రిలీజ్ కాకముందే ఛత్రపతి అనుకున్నాం.. వర్షం రిలీజ్ అయ్యాక ఇలా ఒక అమ్మాయి వెనుక అబ్బాయి పడే లవ్ స్టోరీస్ ఎలా చేస్తారు, నా వల్ల ఇలాంటివి కాదు అన్నారు, కానీ అదే ఫార్మాట్లో మగధీర, ఈగ చేసారు(నవ్వులు). అలాగే ఛత్రపతి టైంలో షార్క్ ఎపిసోడ్ గ్రాఫిక్స్ బాగా రాలేదు. ఆ విషయం సీరియస్ గా తీసుకున్నాడు. అందుకే ఇప్పుడు బాహుబలిలో ఈ రేంజ్ విజువల్స్ చూస్తున్నారు. తనకి తెలియనిది దాని గురించి తెలుసుకొని అందులో 100% ఇవ్వాలని ఆరాటపడే డైరెక్టర్ రాజమౌళి. ఇక బాహుబలి సినిమా చాలా పెద్దది కానీ ఎప్పుడూ ఆయనలో కన్ఫ్యూజన్, తడబాటు లేదు. రాసుకున్న సీన్స్ అండ్ షాట్స్ మీద ఫుల్ క్లారిటీ ఉంది అందుకే ఆయనకి ఏం కావాలో అది పర్ఫెక్ట్ గా రాబట్టుకున్నాడు.

ప్రశ్న) ఈ ‘బాహుబలి’ జర్నీలో మోస్ట్ హ్యాపీ మోమెంట్ మరియు అలాగే బాధాకరమైన సంఘటన ఏంటి.?

స) బాహుబలి షూటింగ్ మొదలైనప్పటి నుంచీ చాలా హ్యాపీ మోమెంట్స్ ఉన్నాయి. సెట్స్, విజువల్స్, కొన్ని షాట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. బాధకారమైనది అంటే షోల్డర్ సర్జరీ జరగడం వాళ్ళ మూడు నెలలు బెడ్ పై ఉండడం బాధగా అనిపించింది.

ప్రశ్న) వరుస హిట్స్ తో ఉన్నప్పుడు బాగా గ్యాప్ తీసుకున్నారు. అన్ని రోజులు గ్యాప్ ఇస్తే మీ అభిమానుల బాధపడతారని ఎప్పుడూ ఆలోచించలేదా.?

స) ఇండియన్ ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు సినిమాకి సినిమా మధ్య గ్యాప్ వచ్చిందని బాధ పడలేదు. కానీ అభిమానులు మాత్రం బాధపుతున్నారని తెలుసు. కానీ జూలై 10తో వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోతారు ఆ బాధని మరిచిపోతారని చాలా నమ్మకంగా ఉన్నాను.

ప్రశ్న) బాహుబలి పార్ట్ 2 కి మధ్యలో ఏమన్నా సినిమా చేసే అవకాశం ఉందా.? తదుపరి సినిమాల ప్లాన్ ఏంటి.?

స) బాహుబలి పార్ట్ కి మధ్య మరో సినిమా ఏదీ చెయ్యను. బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ తర్వాత నాకు కాస్త గ్యాప్ కావాలి రెస్ట్ తీసుకోవడానికి.. అలాగే సెప్టెంబర్ నుంచి సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టేస్తాం. మళ్ళీ ఆ సినిమాలో బిజీ..కావున బాహుబలి పార్ట్ 2 అయ్యాకే వేరే సినిమా చేస్తాను. బాహుబలి తర్వాత ఇంత కష్టమైనవి కాకుండా మన రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్స్, లవర్ బాయ్ సినిమాలు చేస్తాను.

అంతటితో అమరేంద్ర బాహుబలి అలియాస్ ప్రభాస్ కి సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాము..

ఇంటర్వ్యూ – రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు