సమీక్ష : జేమ్స్ బాండ్ – నవ్వించే కామెడీ బాండ్

సమీక్ష : జేమ్స్ బాండ్ – నవ్వించే కామెడీ బాండ్

Published on Jul 25, 2015 6:40 PM IST
Jamesbond-review

విడుదల తేదీ : 24 జూలై 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : సాయికిషోర్ మచ్చ

నిర్మాత : రామబ్రహ్మం సుంకర

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : అల్లరి నరేష్, సాక్షి చౌదరి..

ఈ యంగ్ జెనరేషన్ లో థియేటర్ కి వెళితే కడుపుబ్బా నవ్విస్తాడు అన్న ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో అల్లరి నరేష్. ఈ కామెడీ కింగ్ చేసిన లేటెస్ట్ మూవీ ‘జేమ్స్ బాండ్’. ఈ టైటిల్ చూసి ఇదేదో హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకునేరు.. ఇది పక్కా అల్లరోడి మార్క్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమాలో కూడా జేమ్స్ బాండ్ లాంటి ఓ పాత్ర ఉంది. కానీ అది మన అల్లరోడు కాదు, అల్లరోడికి భార్యగా చేసిన సాక్షి చౌదరి పాత్ర. ఒక మాఫియా లేడీ డాన్ ని పెళ్లి చేసుకోవడం వల్ల అల్లరోడు పడ్డ ఇబ్బందులను చూపించే ప్రయత్నం చేసిన డైరెక్టర్ సాయి కిషోర్. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్ కి ఈ జేమ్స్ బాండ్ సక్సెస్ ని ఇచ్చిందా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ జేమ్స్ బాండ్ సీరియస్ కథ కాదు.. ఆడియన్స్ ని నవ్వించడానికి చేసిన ఓ కామెడీ కథ.. మరి కథలోకి వెళితే.. స్వతహాగా భయస్తుడు మరియు గొడవలకి దూరంగా ఉండే మనస్తత్వం కలవాడు నాని అలియాస్ లక్ష్మీ ప్రసాద్(అల్లరి నరేష్). నాని ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మన హీరో హీరోయిన్ బుల్లెట్ అలియాస్ పూజ (సాక్షి చౌదరి)ని దుబాయ్ లో పెద్ద డాన్. కానీ తను డాన్ అని ఇండియాలో ఉండే తన మదర్ కి తెలియదు. ఓ రోజు తన మదర్ కి కాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉందని, తనని చివరి రోజుల్లో సంతోషంగా చూసుకోవాలని తన మాఫియా అడ్డాని హైదరబాద్ కి షిఫ్ట్ చేసి, తన మదర్ కి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది. కానీ ఓ రోజు తన తల్లి పెళ్లి చేసుకోమని కోరడంతో ఒక దూప్ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. కానీ ఓ రోజు పూజని చూసిన నాని ప్రేమలో పడతాడు. అంతే తన బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటాడు.

పెళ్ళైన కొద్ది రోజులకి ఓ షాక్.. ఆ షాక్ ఏంటంటే.. నాని అనుకున్నట్టు పూజ కత్తి లాంటి ఫిగర్ మాత్రమే కాదు, కత్తులను, గన్స్ ని చకచకా వాడేసి అవతలి వాడి ప్రాణాలు పైకి పంపేయగల సత్తా ఉన్న లేడీ మాఫియా డాన్ అని తెలుస్తుంది. అక్కడి నుంచి రోజూ నాని పూజ ఇంటి నుంచి తప్పించుకొని పారిపోవాలని తెగ ట్రై చేస్తుంటాడు. కానీ ప్రతి సారి ఫెయిల్ అవుతుంటాడు. అదే టైంలో పూజపై పగ తీర్చుకోవాలని దుబాయ్ మరో డాన్ బడా(ఆశిష్ విద్యార్ధి) ట్రై చేస్తుంటాడు. ఆ టైంలో లేడీ మాఫియా డాన్ పూజ చేతి నుంచి తప్పించుకునేందుకు నాని వేసిన ప్లాన్ ఏంటి.? ఆ ప్లాన్ ఎలా, ఎవరెవరి వల్ల అమలైంది.? ఫైనల్ రిజల్ట్ ఏంటి.? అసలు మాఫియా డాన్ అయిన పూజ నాని ప్లాన్ గురించి తెలుకోగలిగిందా.? లేదా.? అలాగే బడా తన పగ తీర్చుకున్నాడా.? లేదా.? అన్నది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ ‘జేమ్స్ బాండ్’ సినిమా అల్లరి నరేష్ మార్క్ మూవీ. అల్లరోడు అనగానే ఆడియన్స్ ఆశించేది బాగా నవ్వుకునే కామెడీ మరియు అదిరిపోయే పంచ్ డైలాగ్స్. కావున కామెడీ ఎలా ఉండనే దగ్గర నుంచి స్టార్ చేస్తా.. ఈ సినిమా స్టార్టింగ్ చాలా బాగుంది. పాత్రలని పరిచయం చేసిన విధానం, కథలోకి వేగంగా వెళ్ళిన విధానం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత చాలా చోట్ల అల్లరి నరేష్ మార్క్ కామెడీని ఈ సినిమాలో చూస్తాం. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా 30 ఇయర్స్ పృథ్వి చేత చేయించిన బాలయ్య స్పూఫ్ బాగుంది. సెకండాఫ్ లో అల్లరి నరేష్ చేసే ప్లాన్స్ ఫెయిల్ అయ్యే సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. ముఖ్యంగా లేడీ డాన్ కి అల్లరి నరేష్ ఫ్యామిలీకి మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఆడియన్స్ కి కితకితలు పెడతాయి.

ఇక అల్లరి నరేష్ విషయానికి వస్తే.. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ తనే, తన కామెడీ టైమింగ్ తో సినిమాను చాలా బాగా నడిపించాడు. హీరోయిన్ సాక్షి చౌదరి సినిమా అంతా ఉన్నా తను చేసింది సీరియర్ రోల్ కావడం వలన కామెడీ బాధ్యత అంతా నరేష్ తీసుకొని చాలా బాగా నవ్వించాడు. లేడీ డాన్ చేతిలో బలిపసువుగా మారిన భర్త పాత్రలో అల్లరోడి పెర్ఫార్మన్స్ సూపర్బ్. సాక్షి చౌదరి ఈ సినిమాలో బాగా కష్టపడి రిస్కీ స్టంట్స్ చేసింది. సాక్షి కూడా తనకి ఇచ్చిన పాత్రని బాగా చేయడం వలన చాలా చోట్ల సిచ్యువేషనల్ కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. ఇక పాటల్లో, సినిమాలో అల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ అందచందాలతో కూడా ఆకట్టుకుంది. అల్లరి నరేష్ తో మొదటి నుంచి ట్రావెల్ అవుతూ వచ్చిన ప్రవీణ్ చాలా బాగా నవ్వించాడు. అల్లరి నరేష్ – ప్రవీణ్ సీన్స్ బాగున్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీ ఎండిగా, పోసాని కృష్ణమురళి కాసేపు నవ్వించాడు. ముఖ్యంగా తెలుగు టీవీ సీరియల్స్ లో పాత్రలని పోలుస్తూ ప్రతి సందర్భాన్ని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. విలన్ గా ఆశిష్ విద్యార్ధి బాగా చేసాడు.

ఓవరాల్ సినిమా పరంగా చూసుకుంటే చాలా ఎపిసోడ్స్ ఆన్ స్క్రీన్ బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. అల్లరి నరేష్ – ప్రవీణ్ కాంబినేషన్ సీన్స్, పోసాని, పృథ్విరాజ్, సప్తగిరి, కృష్ణభగవాన్ ఎపిసోడ్స్ బాగా నవ్విస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఎంచుకున్న స్టొరీ లైన్ వినడానికి తెలుగు వారికి కొత్తగానే ఉన్నా, దాన్ని డెవలప్ చేసిన విధానం మాత్రం బాగా రొటీన్ అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ ని ఎన్నో సూపర్ హిట్ సినిమాల రొటీన్ ఫార్మాట్ లోకి తీసుకువచ్చేసాడు. దాంతో కథ అంతా ఊహాజనితంగా సాగుతుంది, దానివల్ల కథలో వచ్చే చాలా మేజర్ ట్విస్ట్ లను మనం ఊహించేయవచ్చు. సాయి కిషోర్ శ్రీను వైట్ల డైరెక్టర్ కావడం వలన సెకండాఫ్ ని శ్రీను వైట్ల చాలా సూపర్ హిట్ సినిమాల ఫార్మాట్ లోనే డీల్ చేసాడు. అందుకే చాలా రెగ్యులర్ గా అనిపిస్తుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ పరంగా ఫస్ట్ హాఫ్ బెటర్ గానూ సెకండాఫ్ కాస్త తక్కువగానూ అనిపిస్తుంది.

‘మై వైఫ్ ఈజ్ గ్యాంగ్ స్టర్’ అనే సినిమా నుంచి స్టొరీ లైన్ ని స్పూర్తిగా తీసుకోవడమే కాకుండా సీన్స్ కూడా స్పూర్తిగా తీసుకున్నారు. కానీ ఇక్కడ ఆ సినిమాల టైట్ స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయారు. దానివల్ల అక్కడక్కడా కాస్త బోరింగ్ గా ఉంటుంది. అలాగే పాటలు కూడా సందర్భానుసారంగా కాకుండా సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి. జయప్రకాశ్ రెడ్డి – రఘుబాబులతో క్రియేట్ చేసిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కామెడీ సినిమాలో పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. వారి ఎపిసోడ్స్ ని ఇంకాస్త ఫన్ అండ్ క్లారిటీ ఉండేలా రాసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం :

జేమ్స్ బాండ్ సినిమా స్టొరీ లైన్ పరంగా వినడానికి బాగానే అనిపించినా అనుకున్న స్థాయిలో పూర్తి కథని డెవలప్ చేయలేదు. అందుకే ప్రేక్షకులకి చూడదగిన ఎంటర్ టైనర్ అనే ఫీలింగ్ వస్తుంది. అదే కథా విస్తరణ దానికి సాయి కిషోర్ నుంచి బెస్ట్ స్క్రీన్ ప్లే తోడై ఉంటే సినిమా సూపర్బ్ అని అనేవారు. సాయి కిషోర్ నేరేషన్ మరియు స్క్రీన్ ప్లే పై ఇంకాస్త వర్క్ అవుట్ చెయ్యాల్సింది. కానీ డైరెక్టర్ గా మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. అందరి నుంచీ మంచి నటనని రాబట్టుకోవడమే కాకుండా చాలా ఫన్నీ ఎపిసోడ్స్ ని బాగా తీసాడు.

సాయి కార్తీక్ అందించిన పాటల్లో ఒక రెండు బాగుంటే మిగతావి అన్నీ సోసోగా ఉన్నాయి. పాటలను పక్కన పెడితే రీ రికార్డింగ్ మాత్రం కామెడీ మూవీకి బాగానే సూట్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ కి ఇచ్చే కొన్ని బిల్డప్ షాట్స్ లో మ్యూజిక్ బాగుంది. దాము నర్రావు సినిమాటోగ్రఫీ చాలా ప్లెజంట్ అండ్ కలర్ఫుల్ గా ఉంది. తనకి ఇచ్చిన ప్రతి లొకేషన్ ని చాలా బాగా చూపించాడు. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ ఓకే, కానీ చెప్పాలంటే దీనికన్నా బాగా కూడా ఎడిట్ చేయచ్చు. కొన్ని లాగ్ అనిపించిన సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది. శ్రీధర్ సీపాన డైలాగ్స్ లో పంచ్ లు ఎక్కువ అయిపోయాయి, అందుకే సగం పర్ఫెక్ట్ గా పేలితే సగం పర్ఫెక్ట్ గా పేలలేదు. విజయ్ యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని చోట్ల బాగా ఎక్కువ అనిపిస్తాయి, కొన్ని చోట్ల ఓకే డీసెంట్ అనే ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఓ బిగ్ బడ్జెట్ స్టార్ హీరో సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ వస్తుంది.

తీర్పు :

అల్లరి నరేష్ తెలుగు ఆడియన్స్ ని నవ్వించడం కోసం ‘జేమ్స్ బాండ్ – నేను కాదు నా పెళ్ళాం’ అంటూ ఈ రోజు బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేసాడు. అల్లరి నరేష్ నుంచి ఎలాంటి సినిమా కోరుకుంటారో అలాంటి కమర్షియల్ కామెడీ ఎలిమెంట్స్ తో వచ్చిన సినిమానే ‘జేమ్స్ బాండ్’. ఈ సినిమా అక్కడక్కడా బోర్ అండ్ రెగ్యులర్ అనిపించినా ఓవరాల్ గా ఎక్కువ శాతం మాత్రం ఆడియన్స్ ని నవ్విస్తుంది. గత కొంతకాలంగా కామెడీ ఎంటర్టైనర్స్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయవచ్చు. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్, సాక్షి చౌదరి గ్లామరస్ పెర్ఫార్మన్స్, ప్రవీణ్, సప్తగిరి, పోసాని, పృథ్విరాజ్ కామెడీ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ అయితే కథా విస్తరణ, స్క్రీన్ ప్లే, కొన్ని బోరింగ్ ఎలిమెంట్స్, ఇంకా బెటర్ గా ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా అల్లరి నరేష్ నుంచి రెగ్యులర్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్స్ కోరుకునే వారికి నచ్చే సినిమా ‘జేమ్స్ బాండ్’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

 

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు