సూపర్ స్టార్ మహేష్ బాబు – అందాల తార శృతి హాసన్.. ఈ ఇద్దరి జంట తెరపై ఎలా ఉండనుందనే విషయం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’ పోస్టర్లు, సాంగ్ ట్రైలర్ల ద్వారా ఇప్పటికే తెలిసిపోయింది. ‘జతకలిసే’, ‘చారుశీలా’ అంటూ ఇద్దరూ ఆడిపాడడం చూశాక, మహేష్-శృతిల జంట చాలా ఫ్రెష్‌గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మైత్రీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమా మరో వారం రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శృతి హాసన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) మీ ‘శ్రీమంతుడు’ సినిమా మరో వారం రోజుల్లో విడుదల కాబోతోంది. ఎలా ఉంది?
స) చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. పెద్ద సినిమా, మంచి స్టోరీ, మహేష్ లాంటి స్టార్, కొరటాల శివ లాంటి మంచి డైరెక్టర్.. ఇలా ఈ సినిమాకు అన్నీ కలిసొచ్చాయ్! కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది.
ప్రశ్న) మహేష్ సరసన హీరోయిన్‌గా నటించడం ఎలా అనిపించింది?
స) మహేష్ సినిమాలో హీరోయిన్‌గా నటించడమంటే ఎవ్వరికైనా సంతోషమే కదా! ‘ఆగడు’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మహేష్‌తో కలిసి పనిచేశా. ఆ తర్వాత వెంటనే ఈ సినిమా అవకాశం వచ్చింది. అంతపెద్ద స్టార్ అయి ఉండి కూడా ఎక్కడా ఆ స్టార్‌డమ్ చూపించరు. సెట్లో చాలా క్యాజువల్‌గా అందరినీ నవ్విస్తూ సరదాగా ఉంటారు.
ప్రశ్న) మహేష్ సినిమా అనగానే ‘శ్రీమంతుడు’ ఓకే చేసేశారా?
స) మహేష్ సినిమా అంటే ముందే ఒక పాజిటివ్ ఆలోచన వచ్చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంత పెద్ద సినిమాలో నాకంటూ ఒక మంచి గుర్తింపు దక్కే క్యారెక్టర్ దొరికినపుడు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అందుకే నా రోల్ వినగానే ఓకే చేసేశా!
ప్రశ్న) ‘శ్రీమంతుడు’లో మీ రోల్ ఎలా ఉండబోతోంది?
స) ‘శ్రీమంతుడు’లో నేను చారుశీల అనే ఓ ట్రెడిషినల్ కాలేజ్ స్టూడెంట్‌గా కనిపిస్తా. చారుశీల చూడ్డానికి సాధారణంగా కనిపించినా ఆలోచనలు, వ్యవహారశైలి మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్‌పై నా వేరే ఇతర క్యారెక్టర్ల చాయలు ఎక్కడా కనిపించవు. కొత్త కొత్త క్యారెక్టర్లు చేస్తుంటేనే మంచి గుర్తింపు దక్కడంతో పాటు, కొత్తది ట్రై చేశామన్ని తృప్తి దొరుకుతుంది.
ప్రశ్న) దర్శకుడు కొరటాల శివ గురించి చెప్పండి?
స) కొరటాల శివ గారు నా వరకూ ఒక కూల్ టీచర్. చాలా నెమ్మదిగా, ఓపికగా ఆయనకు కావాల్సినది రాబట్టుకునేందుకు కృషి చేస్తారు. ఎప్పుడూ సెట్లో కూడా సైలైంట్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ క్యారెక్టర్ ఎలా ప్రవర్తించాలన్నది ఆయనకు సరిగ్గా తెలుసు. దీంతో యాక్టింగ్ పరంగా చాలా ఈజీ అనిపించింది.
ప్రశ్న) మైత్రీ మూవీస్ బ్యానర్‌కిది మొదటి సినిమా. అందులో మీరు భాగమవ్వడం ఎలా అనిపించింది?
స) చాలా బాగుంది. నా వరకూ చిన్న బ్యానర్, పెద్ద బ్యానర్, కొత్త బ్యానర్.. ఇలాంటివి పెద్దగా పట్టించుకోను. సినిమాపై మంచి అభిమానం ఉన్నవాళ్ళు మైత్రీ మూవీస్ నిర్మాతలు. ఒక సినిమా అనుకున్న విధంగా రావడానికి వాళ్ళు పడిన కష్టమే వాళ్ళకు మంచి గుర్తింపునిస్తుంది.
ప్రశ్న) ఈ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సన్నివేశం ఏది?
స) ఇష్టమైన సన్నివేశమంటే.. ఈ సినిమాలో రెండు ఫ్యామిలీలు కలిసినప్పటి సన్నివేశం ఒకటి ఉంది. ఆ సన్నివేశంలో రెండు, మూడు తరాల స్టార్ యాక్టర్స్ ఒక్క ఫ్రేమ్‌కి వస్తారు. నా వరకూ అదే బెస్ట్ సీన్.
ప్రశ్న) ఈ సినిమాకు డబ్బింగ్ మీరే చెప్పారా?
స) లేదు. నాకు తెలుగు మాట్లాడడం పూర్తిగా వచ్చినా, ఈ సినిమాలో నేను పోషించింది ఓ పల్లెటూరికి చెందిన అమ్మాయి పాత్ర. మోడర్న్ స్టైల్ ఆ అమ్మాయిలో కనిపించినా, మాటల్లో ఉండే ఫ్లేవర్‌కు నా వాయిస్ సూట్ కాదు. అందుకే ఈ సినిమాకు నేను డబ్బింగ్ చెప్పలేదు. తెలుగులో డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే కచ్చితంగా చెప్తా.
ప్రశ్న) ప్రస్తుతం ఏమేం సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ.. ఏ భాషలో చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు?
స) ప్రస్తుతం ఒక హిందీ సినిమా, రెండు తమిళ సినిమాలు చేస్తున్నా. ఇంకా చాలా అవకాశాలే వస్తున్నా సెలెక్టడ్‌గా వెళుతున్నా. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా అన్ని భాషల నుంచీ ఆఫర్స్ వస్తున్నాయి. నా వరకూ అన్నీ నా సొంత ప్రదేశాలే! కాబట్టి ఈ పర్టిక్యులర్ భాషలో సినిమా చేయడానికి ఇష్టపడతానని ఏమీ లేదు.
CLICK HERE FOR ENGLISH INTERVIEW