ఇంటర్వ్యూ : మహేష్ బాబు – ‘శ్రీమంతుడు’ కథ విన్నప్పుడే ఫిక్సయ్యా!

ఇంటర్వ్యూ : మహేష్ బాబు – ‘శ్రీమంతుడు’ కథ విన్నప్పుడే ఫిక్సయ్యా!

Published on Aug 1, 2015 7:20 PM IST

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ కోసం మహేష్ అభిమానులే కాక, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఇక సినిమా విడుదలకు ఆరు రోజులే ఉండడంతో ‘శ్రీమంతుడు’ టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. మహేష్ సైతం సోషల్ మీడియాతో పాటు, సాంప్రదాయ ప్రెస్ ఇంటర్వ్యూలతో బిజీగా గడిపేస్తున్నారు. నేడు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మహేష్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘శ్రీమంతుడు’ సినిమాను ఇంత భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకని?

స) ఎందుకు అని అంటే.. మనం ఎంతో ఇష్టపడి చేసి, అన్ని విధాలుగా అనుకున్నట్లే వచ్చిందన్న నమ్మకం బలంగా కలిగించిన సినిమాను ఎక్కువ మందికి చేర్చకపోతే అర్థం లేదు. ఈ సినిమా విషయంలో అది ఫీలయ్యాం కాబట్టి ఈ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టాం.

ప్రశ్న) ఈ సినిమాతో నిర్మాతగానూ మారారు. ఏదైనా ప్రత్యేక కారణమా?

స) ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవు. నేను ఇంతకు ముందు కూడా మా హోమ్ బ్యానర్‌లలో చాలా సినిమాలే చేశా. అయితే ఈ సారి నేరుగా నా పేరే తెరపై కనిపించనుండడంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉండొచ్చు!

ప్రశ్న) ‘శ్రీమంతుడు’ కథ విషయంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశమేంటి?

స) కొరటాల శివ ‘శ్రీమంతుడు’ స్క్రిప్ట్‌తో నన్ను కలవగానే, ఈ కథ కచ్చితంగా అందరినీ ఆకట్టుకోగలదన్న నమ్మకం కలిగింది. ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందని కూడా అప్పుడే ఫిక్స్ అయ్యా. ఇక సినిమాలో అందరికీ కనెక్ట్ అయ్యే బలమైన ఎమోషన్ ఉంది. అదేవిధంగా నా క్యారెక్టర్‌లో కూడా మంచి డెప్త్ ఉంది. ఆ అంశాలే రేపు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.

ప్రశ్న) దర్శకుడు కొరటాల శివతో పనిచేయడం ఎలా అనిపించింది?

స) శ్రీమంతుడు క్యారెక్టర్ కోసం కొత్తగా చాలా అంశాలు నేర్చుకోవాల్సి వచ్చింది. దర్శకుడు కొరటాల శివ ఇచ్చిన సలహాలతో ఈ క్యారెక్టర్‌తో ఈజీగా ట్రావెల్ చేయగలిగా. ఇలాంటి ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాను ఆయన అంత నేర్పుతో చేయడాన్ని దగ్గరుండి గమనించా. దర్శకుడు శివతో పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాననే చెప్తా.

ప్రశ్న) ఈ సినిమాలో మీ తండ్రిగా జగపతి బాబు నటించారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

స) ముందుగా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయనతో కలిసి పనిచేయడం ఓ మంచి అనుభవం. స్క్రీన్‌పై తండ్రి, కొడుకులుగా మా ఇద్దరి పెయిర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది.

ప్రశ్న) ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ మీ నిజ జీవితం నుంచి ప్రేరణ పొందారా?

స) అలాంటిదేమీ లేదు. అదలా యాధృచ్చికంగా జరిగిపోయిందంతే! నా వరకు మా బావ జయదేవ్ చెప్పిన ఆలోచన నచ్చి ఊరిని దత్తత తీసుకున్నా.

ప్రశ్న) ఈ సినిమాను తమిళంలోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. కారణం?

స) మా సినిమాటోగ్రాఫర్ మధియే తమిళంలో డబ్బింగ్ చేయాలన్న ఆలోచన గురించి చెప్పారు. ఇలాంటి కథకు అన్ని చోట్లా ఆదరణ ఉంటుందన్న నేపథ్యంలో మేమూ ఈ విషయం గురించి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నేనే స్వయంగా చెన్నైలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగం కానున్నా.

ప్రశ్న) ఫెయిల్యూర్స్‌ను ఎలా తీసుకుంటారు. ఫెయిల్యూర్ అనే ఆలోచన నుంచి బయటకు ఎలా వస్తుంటారు?

స) ఫెయిల్యూర్స్ కచ్చితంగా ఇబ్బంది పెడతాయి. ఆ ఫెయిల్యూర్స్‌కి ఏమేం కారణమయ్యాయో అన్న విషయం బాగా ఆలోచించి, ఆ తర్వాతి సినిమాలకు మళ్ళీ ఆ తప్పు చేయకుండా చూసుకుంటూ ఉంటా.

ప్రశ్న) ‘భజరంగీ భైజాన్’ లాంటి అర్థవంతమైన సినిమాలు చేసేందుకు సిద్ధమేనా?

స) నాకూ కొత్త కొత్త అటెంప్ట్స్ చేయాలనే ఉంటుంది. అయితే ‘నాని’, ‘నేనొక్కడినే’, ‘టక్కరి దొంగ’.. ఇలా నేను ఎప్పుడు ప్రయోగం చేసినా అవి వర్కవుట్ కాలేదు. నిజంగానే అలాంటి కథేదైనా వస్తే, మనం చేస్తే వర్కవుట్ అవుతుందన్న నమ్మకం కలిగితే తప్పకుండా చేస్తా.

ప్రశ్న) మీ ఫేవరైట్ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ తరహా పాత్ర చేయలని ఉందా?

స) లేదు. అసలు అలాంటి ఆలోచనే పెట్టుకోలేదు. ‘అల్లూరి సీతారామరాజు’ నాకు బైబిల్ లాంటిది. అలాంటి క్లాసిక్ సినిమాను రీమేక్ చేసే ఆలోచన ఎప్పుడూ చేయను.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు