సమీక్ష : జయసూర్య – పరవాలేధనిపించే పోలీస్ డ్రామా.!

సమీక్ష : జయసూర్య – పరవాలేధనిపించే పోలీస్ డ్రామా.!

Published on Sep 5, 2015 5:50 PM IST
jayasurya-review

విడుదల తేదీ : 04 సెప్టెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : సుశీంద్రన్

నిర్మాత : జి. నాగేశ్వర్ రెడ్డి – ఎస్. నరసింహ ప్రసాద్

సంగీతం : డి. ఇమాన్

నటీనటులు : విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, సూరి..

స్వతహాగా తెలుగువాడు కానీ పెరిగింది, మొదట హీరోగా సినిమా చేసింది తమిళంలో.. కెరీర్ మొదటి నుంచే తెలుగులోనూ తన సినిమాలను రిలీజ్ చేస్తూ వచ్చిన యాక్షన్ హీరో విశాల్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తాజాగా విశాల్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జయసూర్య’. అందాల భామ కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సుశీంద్రన్ డైరెక్టర్. ఈ సినిమా ఈ రోజు ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ఈ జయసూర్య ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ జయసూర్య కథ గుంటూర్ లో మొదలవుతుంది. అక్కడ భవాని అనే ఒక రౌడీ గ్యాంగ్ ధనవంతులైన బిజినెస్ మెన్స్ ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఈ ముఠాని పట్టుకోవాలని ట్రై చేసిన పోలీస్ ఆల్బర్ట్(హరీష్)ని చంపేస్తారు. దాంతో ఆ భవాని గ్యాంగ్ ని ఫినిష్ చెయ్యాలని సీక్రెట్ మిషన్ మీద వైజాగ్ నుంచి అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అయిన జయసూర్య(విశాల్) రంగంలోకి దిగుతాడు. ఈ మిషన్ టైంలోనే జయసూర్య సౌమ్య(కాజల్ అగర్వాల్)ని చూసి ప్రేమలో పడడం, ఇద్దరూ ప్రేమికులుగా మారడం చకచకా జరుగుతాయి. ప్రేమతో పాటుగానే జయసూర్య తను వచ్చిన పని అనాగా భవాని గ్యాంగ్ ని లేపెస్తాడు.

ఆ సమస్య అక్కడితో పరిష్కారం అయిపోయిందని అనుకుంటారు.. కానీ ఆగదు ఎందుకు అంటే భవాని లాంటి వారిని కంట్రోల్ చేస్తూ వారందరికీ పైన మరొకడు ఉంటాడు. దాంతో అదే ఏరియాకి స్పెషల్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకుంటాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి జయసూర్య పట్టుకునే సాక్ష్యాలన్నీ కనుమరుగావుతుంటాయి. అప్పుడే కథలోకి శ్రీను(సముద్రఖని) ఎంటర్ అవుతాడు. అసలు ఈ శ్రీను ఎవరు.? ఈ కథకి, జయసూర్యకి శ్రీనుకి ఉన్న సంబంధం ఏమిటి అనేదే కథలో అసలైన ట్విస్ట్.? ఆ ట్విస్ట్ ఏంటి.? దొరికిన సాక్ష్యాలన్నీ మిస్ అవుతున్నా చివరికి జయసూర్య ఎలా భవాని వెనకున్నగ్యాంగ్ ని పట్టుకొని మట్టుపెట్టాడు అన్నదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

జయసూర్య సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ అంటే డైరెక్టర్ అనుకున్న స్టొరీ లైన్. ఒకే ప్లేస్ నుంచి హీరోయిజం మరియు విలనిజంని డెవలప్ చేస్తూ, దానికి సెంటిమెంట్ అనే పాయింట్ ని మిక్స్ చేసి చెప్పడం చాలా బాగుంది. ఆ స్టొరీ లైన్ లోని స్ట్రాంగ్ నెస్ సినిమాలో చాలా సీన్స్ లో కనపడి ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక సినిమా పరంగా చెప్పాలనుకుంటే విలన్ ని రివీల్ చేసే ఇంటర్వల్ బ్లాక్ బాగుంది. ఇక సెకండాఫ్ లో హీరో – విలన్ మధ్య జరిగే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. సెకండాఫ్ లో విశాల్ వేసే ఓ పోలీస్ ప్లాన్, క్లైమాక్స్ లో సస్పెన్స్ రివీల్ చేసే సీన్స్ బాగున్నాయి.

యాక్షన్ ఎంటర్టైనర్స్ చేయడంలో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న విశాల్ మరోసారి అలాంటి పాత్రతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా మంచి నటనని కనబరిచాడు. హీరోయిన్ గా కనిపించిన కాజల్ అగర్వాల్ ఈ సినిమాకి కేవలం గ్లామర్ డాల్ మాత్రమే. ఫస్ట్ హాఫ్ లో కొన్ని లవ్ సీన్స్ మరియు సాంగ్స్ లో మాత్రమే తనని ఉపయోగించుకున్నారు. ఆ పరంగా కాజల్ కూడా న్యాయం చేసింది. విశాల్ – కాజల్ మధ్య వచ్చే ఒకటి రెండు సీన్స్ మీ పెదవులపై చిరునవ్వును తెప్పిస్తాయి. ఇకపోతే నెగటివ్ షేడ్స్ చూపడంలో సముద్రఖని సూపర్బ్ అనిపించుకున్నాడు. ఒకవైపు చాలా కూల్ గా కనిపిస్తూనే, మరోవైపు నెగటివ్ షేడ్స్ ని పర్ఫెక్ట్ గా ప్రెజంట్ చేసాడు. కమెడియన్ సూరి అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసాడు. జయప్రకాశ్,హరీష్, మురళీ శర్మ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి డైరెక్టర్ సుశీంద్రన్.. ఇతని స్పెషాలిటీ ఏమిటి అంటే ప్రతి సినిమాలోనూ ఒక చిన్న పాయింట్ ని స్టొరీగా అనుకొని దాని చుట్టూ చాలా గ్రిప్పింగ్ కథనం రాసుకొని సినిమా ఆధ్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీస్తాడు. ఈ సినిమా విషయంలో కూడా ఆటను తీసుకున్న స్టొరీ లైన్ బాగుంది, కానీ తను రాసుకున్న కథనం అట్టర్ ఫ్లాప్. సినిమాలో ఉన్న ట్విస్ట్ లను ఒక్కటి కూడా సరిగా రివీల్ చేయలేదు. ప్రతి ఒక్కటీ రాంగ్ టైం లోనే రివీల్ చేసాడు. దాంతో ఆడియన్స్ లో ఏం జరుగుతుందా అనేది ముందే తెలిసిపోతుంది. ఇక ఎక్కడ సినిమాకి కనెక్ట్ అవుతారు చెప్పండి. ఇక సినిమా విషయానికి వస్తే కథనం బాలేదు, కథనం కంటే నేరేషన్ ఇంకా స్లోగా ఉంటుంది. సినిమా చాలా స్లోగా సాగుతుంది.

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ వర్క్ అవుట్ అవ్వలేదు, రొమాంటిక్ ట్రాక్ లో కూడా ఒకటి రెండు సీన్స్ మాత్రమే బాగున్నాయి, మిగతా అన్నీ బోరింగ్. అలాగే కథ మొత్తం సెకండాఫ్ లో రన్ చేయడం వలన ఫస్ట్ పార్ట్ ఒకలా, సెకండ్ పార్ట్ వేరొకలా అనిపిస్తుంది. వీటన్నిటికీ మించి సినిమాలో పాటలు సినిమా మూడ్ ని ఇంకా చెడగొడతాయి. నిఖిత చేత చేయించిన స్పెషల్ సాంగ్ కూడా సినిమాకి హెల్ప్ అవ్వలేదు. మిగతా అన్నీ సినిమాకి పెద్ద మైనస్. ఈ సినిమా లెంగ్త్ 2 గంటల 18 నిమిషాలు ఇందులో నుంచి కనీసం 18 నిమిషాలను కట్ చేస్తే సినిమా ఇంకా బాగుండే ఛాన్స్ ఉంది. ఆకట్టుకోవాల్సిన థ్రిల్స్ లేకపోవడంతో పాటు ఎంటర్టైన్మెంట్ అనేది పూర్తిగా మిస్ అవ్వడం సినిమాకి పెద్ద మైనస్.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమాన్. తమిళ పాటలని డబ్ చేసారు కావున అవి ఏవీ క్యాచీగా లేవు. కానీ ఇమాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్. ఇమాన్ సంగీతమే సినిమాని చాలా చోట్ల హై రేంజ్ కి తీసుకెళ్తుంది. వేల్రాజ్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. నైట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే షాట్స్ ని బాగా చూపించాడు. ఆంథోనీ ఎడిటింగ్ బాలేదు. చాలా సినిమాని సరిగా ఎడిట్ చేయకుండా వదిలేసారనిపిస్తుంది. శాశాంక్ వెన్నెలకంటి డైలాగ్స్ ఓకే.

ఇక కథ – కథనం – దర్శకత్వం అనే మేజర్ డిపార్ట్ మెంట్స్ ని డీల్ చేసిన సుశీంద్రన్ విషయానికి వస్తే ఎప్పటిలానే స్టొరీ లైన్ సూపర్బ్ గా సెలక్ట్ చేసుకున్నాడు, కానీ స్టొరీ డెవలప్ మెంట్ లో మాత్రం తప్పు చేసాడు. ఆ తర్వాత కథనం విషయంలో చాలా పూర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. డైరెక్టర్ గా మాత్రం పరవాలేదనిపించుకున్నాడు. ఈ సినిమా ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం సుశీంద్రన్ కథనం బాగా దెబ్బ కొట్టడమే. ఇకపోతే జి. నాగేశ్వర్ రెడ్డి – ఎస్. నరసింహ ప్రసాద్ ల డబ్బింగ్ విలువలు జస్ట్ ఓకే.

తీర్పు :

యాక్షన్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకునే విశాల్ ఈ సారి ట్రై చేసిన కాప్ యాక్షన్ డ్రామా ‘జయసూర్య’ పరవాలేదు అనిపించుకునే రేంజ్ లో ఉందే తప్ప సూపర్ అని చెప్పుకునేంత రేంజ్ లో లేదు. దానికి ప్రధాన కారణం సినిమాకి రాసుకున్న కథనం, అలాగే ట్విస్ట్ లు సరిగా వర్క్ అవుట్ కాకపోవడం. సినిమాలో బెస్ట్ పాయింట్స్ గురించి చెప్పాల్సివస్తే స్టొరీ లైన్, విశాల్ – సముద్రఖనిల పెర్ఫార్మన్స్, సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఆసక్తికర ఎపిసోడ్స్. కథనం, స్లో నేరేషన్, నో ఎంటర్టైన్మెంట్, విసుగు తెప్పించే పాటలు, సాగాదీసిన్ రన్ టైం, బోరింగ్ ఫస్ట్ హాఫ్ చెప్పదగిన మైన పాయింట్స్. ఓవరాల్ గా విశాల్ నుంచి తెలుగు ఆడియన్స్ కోరుకునే రేంజ్ లో జయసూర్య లేదు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ పరంగా కాస్త ఓపిక పడితే సెకండాఫ్ ని కాస్త ఎంజాయ్ చేయచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు