ఆడియో సమీక్ష : శివమ్ – దేవిశ్రీ స్టైల్ క్యాచీ ఆల్బమ్..!

ఆడియో సమీక్ష : శివమ్ – దేవిశ్రీ స్టైల్ క్యాచీ ఆల్బమ్..!

Published on Sep 14, 2015 8:54 PM IST

Shivam
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా సినిమా ‘శివమ్’ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆల్బమ్ ఈ మధ్యే విడుదలైంది. రామ్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కావడంతో ఈ ఆడియోపై మంచి అంచనాలే కనపడ్డాయి. మరి ఆ అంచనాలను ఆడియో అందుకుందా? చూద్దాం..

11. పాట : శివమ్ శివమ్
గాయకుడు : కార్తీక్
సాహిత్యం : భాస్కర భట్ల

ఆల్బమ్‌లో వచ్చే మొదటి పాటే ‘శివమ్ శివమ్’ అంటూ సాగే టైటిల్ సాంగ్. ఈ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్ వాడిన ఇన్స్ట్రుమెంట్స్ టైటిల్ సాంగ్‌కు ఉండే ఫీల్‌ను తీసుకువచ్చాయి. ఇక హీరో క్యారెక్టరైజేషన్‌ను తెలియజేస్తూ భాస్కరభట్ల అందించిన సాహిత్యం కూడా చాలా బాగుంది. క్యాచీ పదాలను వాడుతూ ఈ పాటకు ఓ మంచి ఫీల్‌ను తేవడంలో భాస్కరభట్ల విజయం సాధించారు. కార్తీక్ వాయిస్‌లో ఈ క్యాచీ పదాలు వినడానికి బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఎంచుకున్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా రామ్ డ్యాన్స్ స్టామినాను చూపించడానికి బాగా పనికివస్తాయనే విషయం స్పష్టమవుతోంది.

2. పాట : ప్రేమ అనే పిచ్చి2
గాయకులు : నరేంద్ర
సాహిత్యం : భాస్కర భట్ల

‘ప్రేమ అనే ఒక పిచ్చి’ అంటూ సాగే ఈ పాటను ఆల్బమ్‌లో ది బెస్ట్ సాంగ్‌గా చెప్పుకోవచ్చు. ‘ప్రేమ అనే ఒక పిచ్చి’ అనే లైన్‌ను నరేంద్ర పాడిన విధానంతోనే ఈ పాటలోని అసలైన కిక్ మొదలవుతుంది. సినిమాలో ఇదో టీజింగ్ సాంగ్‌గా కనిపిస్తోంది. భాస్కర భట్ల అందించిన సాహిత్యం చాలా కొత్తగా, మంచి ఫన్‌ నింపుకొని ఉంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ కూడా విన్నవెంటనే ఎక్కేసేలా ఉంది. నరేంద్ర వాయిస్‌లో ఈ పాట వినడానికి కొత్తగా, ఎనర్జీగా ఉంది. ఈ పాట కచ్చితంగా అంతటా మారుమోగిపోతుందని చెప్పొచ్చు.

63. పాట : ఐ లవ్ యూ టూ
గాయకులు : యాజిన్ నిజార్, సమీరా
సాహిత్యం : భాస్కర్ భట్ల

‘ఐ లవ్‌ యూ టూ’ అంటూ వచ్చే ఈ పాటను ఓ యూత్‌ఫుల్ పాటగా చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ స్టైల్ ట్యూన్, రాపో లిరిక్స్, ఇన్స్ట్రుమెంట్స్‌తో ఈ పాట నడుస్తూంటుంది. ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం మంచి ఫీల్‌ను తెచ్చింది. యూత్ బాగా హమ్ చేసుకునేలా ఈ పాట ఉంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలోనే గతంలో వచ్చిన కొన్ని పాటల చాయలు కనిపిస్తుంటాయి. యాజీన్ నిజార్ మంచి ఎనర్జీ ఉన్న పాటను బాగా పాడాడు. సమీరా, నిజార్‌కు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఓవరాల్‌గా విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు ఈ పాట ఓ మంచి ఫీల్‌నిస్తుందని ఊహించవచ్చు.

4. పాట : అందమైన లోకం5
గాయకులు : సాగర్, హరిప్రియ
సాహిత్యం : భాస్కర భట్ల

అందమైన లోకం అంటూ సాగే ఈ పాట సినిమాలో వచ్చే ఫీల్ గుడ్ రొమాంటిక్ పాటగా కనబడుతోంది. దేవిశ్రీ ప్రసాద్ తనదైన స్టైల్లో వెస్ట్రన్, ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్‌ను కలిపి వాడుతూ ఈ పాటకు ఓ సరికొత్త ఫీల్ తెచ్చారు. ముఖ్యంగా దేవిశ్రీ తమ్ముడు సాగర్ వాయిస్‌లో ఈ పాట వినడానికి కూల్‌గా ఉంది. హరిప్రియ కూడా సాగర్‌కు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఈ పాట కూడా విజువల్స్‌తో చాలా అందంగా ఉంటుందని ఊహించవచ్చు. ఇక భాస్కర భట్ల అందించిన సాహిత్యం కూడా చాలా బాగుంది.

45. పాట : గుండె ఆగి పోతాందే
గాయకులు :హేమచంద్ర, ఎమ్.ఎమ్.మానసి
సాహిత్యం : భాస్కర భట్ల

శివమ్ ఆల్బమ్‌లో చివరి పాటగా ఎప్పట్లాగే తెలుగు సినిమా స్టైల్లో ఓ మాస్ పాటను పెట్టారు. ‘గుండె ఆగి పోతాందే’ అంటూ మొదలయ్యే ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలోనే వచ్చిన ‘టాప్ లేచిపోద్ది’ అనే పాటను గుర్తు చేస్తోంది. హేమ చంద్ర తనదైన వాయిస్‌తో ఈ పాటకు ఓ మంచి మాస్ ఫీల్ తీసుకొచ్చారు. ఈ పాటకు దేవిశ్రీ తాను ఎంచుకున్న బీట్స్, వాడిన ఇన్స్ట్రుమెంట్స్‌తో మాస్ పాటకు ఉండే ఊపు తేవడంతో పాటు హమ్ చేసేలా చేయడంలో మంచి విజయం సాధించారు. సాహిత్యం కూడా అంతే మాసీగా ఉండి పాటకు మంచి ఫీల్ తెచ్చింది.

తీర్పు :

హీరో రామ్ సినిమాల్లో పాటలకు, వాటి చిత్రీకరణకూ ఎప్పుడూ మంచి ప్రాధాన్యత చూపిస్తుంటారు. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడంటే మరో మంచి ఆల్బమ్ వచ్చినట్లే అని అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. ఇలాంటి కాంబినేషన్‌లో వచ్చిన ‘శివమ్’ ఆడియో కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా క్యాచీ ఆల్బమ్‌గా నిలిచిందనే చెప్పాలి. రామ్ ఎనర్జీకి తగ్గ పాటలతో పాటు, ఒక లవ్‌స్టోరీకి ఉండాల్సిన స్టైల్ పాటలన్నీ నింపుకున్న ఈ ఆడియో కచ్చితంగా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందనే చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా పాటల విషయంలో ప్రయోగాలకు పోకుండా తనదైన ఫార్మాట్‌నే నమ్ముకొని ఒక క్యాచీ ఆల్బమ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘ప్రేమ అనే పిచ్చి’, ‘శివమ్ శివమ్’, ‘ఐ లవ్ యూ టూ’ పాటలు వినగానే కిక్కిచ్చేలా ఉన్నాయి. ఇక విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు ఈ పాటలు మరింత అందంగా ఉంటాయని ఊహించుకోవచ్చు. చివరగా రామ్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో ‘శివమ్’ పేరుతో మరో హిట్ ఆల్బమ్ వచ్చిందనే చెప్పాలి.

శివమ్ ఆడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు