సమీక్ష : కేటుగాడు – పరమ రొటీన్ కిడ్నాప్ డ్రామా!

సమీక్ష : కేటుగాడు – పరమ రొటీన్ కిడ్నాప్ డ్రామా!

Published on Sep 19, 2015 11:30 AM IST
Ketugadu

విడుదల తేదీ : 18 సెప్టెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : కిట్టు నల్లూరి

నిర్మాత : వెంకటేష్ బాలసాని

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : తేజస్, చాందినీ చౌదరి, రాజీవ్ కనకాల, అజయ్..

‘ఉలవచారు బిర్యాని’తో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన తేజస్ హీరోగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కేటుగాడు’. వెంకటేష్ మూవీస్ పతాకంపై వెంకటేష్ బాలసాని ఈ సినిమాను నిర్మించారు. చాందినీ హీరోయిన్‌గా నటించారు. ఓ కిడ్నాప్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కిట్టుగాడి కిడ్నాప్ డ్రామా ఎంతమేరకు ఆకట్టుకునేలా ఉందీ? చూద్దాం..

కథ :

చందు (తేజస్).. కార్లు దొంగతనం చేసి అమ్ముకుంటూ సరదాగా జీవితాన్ని వెల్లదీసే ఓ యువకుడు. ఓ కారు దొంగతనం చేసే ప్రయత్నంలోనే చందు, ఒక పార్టీలో అకిరా(చాందినీ)ను చూసి మొదటిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత అదే అమ్మాయి కిడ్నాప్‌కు గురవ్వడం, కిడ్నాప్ అయి ఏ కారులో అయితే బంధించబడి ఉందో ఆ కారునే చందు దొంగతనం చేయడంతో సినిమా ప్రధాన కథ మొదలవుతుంది. మొదట చందుయే తనను కిడ్నాప్ చేశాడని అనుకున్న అకిరాకు ఆ తర్వాత అసలు నిజం తెలుస్తుంది.

అకిరా అన్నయ్య ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ ప్రకాష్ (రాజీవ్ కనకాల), సొంత చెల్లెలిని కిడ్నాప్ చేయడానికి వేసిన ప్లాన్ విఫలమవ్వడంతో, అకిరా చందు జీవితంలోకి వస్తుంది. ఇక చందు, అకిరాల ఈ ప్రయాణం ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీస్తుంది. ఇదిలా ఉంటే అకిరా కోసం ఓ పక్క శ్రీ ప్రకాష్‌తో పాటు అజయ్ (అజయ్) అనే మరో వ్యక్తి కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక సొంత చెల్లెలినే శ్రీ ప్రకాష్ ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటాడు? అజయ్ ఎవరు? చాందినీ కోసం అజయ్ ఎందుకు వెతుకుతుంటాడు? చందు, అకిరాల ప్రేమకథ, ఈ కిడ్నాప్ కథ చివరకు ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే ‘కేటుగాడు’.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే సెకండాఫ్‌లో వచ్చే చివరి ఇరవై నిమిషాల పార్ట్ గురించి చెప్పుకోవచ్చు. ఈ ప్రీ క్లైమాక్స్ పార్ట్‌లోని ట్విస్ట్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది. అప్పటివరకూ నడిచిన సినిమాకు ఓ అర్థాన్నిచ్చేది ఈ ప్రీ క్లైమాక్స్ అనే చెప్పాలి. ఇక సినిమాలో టాక్సీ గిరీ అంటూ సప్తగిరి చేసిన పాత్ర మొదట్నుంచీ, చివరివరకూ కొనసాగుతూ మంచి రిలీఫ్ ఇచ్చింది. సినిమా పూర్తిగా డల్ అయిపోయినప్పుడల్లా సప్తగిరి కామెడీ కొంతవరకు సినిమాను కాపాడగలిగింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. చందుగా తేజస్ మంచి ప్రతిభనే కనబరిచాడు. కొన్ని పతాక సన్నివేశాల్లో ఇంకా ఆ స్థాయి నటనను ప్రదర్శించకపోయినా, ఓవరాల్‌గా బాగా నటించాడు. ఇక మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన చాందినీ, అకిరాగా బాగా నటించింది. అందం అభినయం రెండింట్లోనూ చాందినీ మంచి మార్కులే కొట్టేసింది. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం తేలిపోయినట్లు కనిపించింది. ఇక సినిమా ఆసాంతం కొనసాగే పాత్రలో సప్తగిరి కామెడీ హైలైట్ అనే చెప్పొచ్చు. తనదైన టైమింగ్, డైలాగ్ డెలివరీతో సప్తగిరి బాగా ఆకట్టుకున్నాడు. ఇక అజయ్, రాజీవ్ కనకాల, పృథ్వీ.. ఇలా అందరూ తమ పరిధిమేర బాగానే నటించారు.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ పార్ట్, సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ పార్ట్ ఈ సినిమాకు ప్లస్‌పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా కథ, కథనాలను ప్రస్తావించాలి. కథలో కొత్తదనం ఎక్కడా లేదు. ఇలాంటి కిడ్నాప్ డ్రామాలను తెలుగులోనే ఇప్పటికి చాలా చూసి ఉండడంతో కథ విషయంలో ఎగ్జైట్ అవ్వడానికి ఏమీ లేదు. ఇక కథనంతోనైనా ఈ లోటును కప్పించే ప్రయత్నం చేస్తారనుకున్నా ఆ విషయంలోనూ విఫలమయ్యారు. సినిమాకు హైలైట్ అనుకున్న ట్విస్ట్‌ను ప్రీ క్లైమాక్స్‌లో ఉంచి అప్పటివరకూ సాదాసీదా సన్నివేశాలతో సినిమాను రొటీన్‌గా నడిపించారు. కేవలం కామెడీని మాత్రమే నమ్ముకొని ప్రీ క్లైమాక్స్ వరకూ కథను లాక్కొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.

ఇక నటీనటులంతా తమ పరిధిమేరకు బాగానే నటించినా, ఏ పాత్రకూ సరైన క్లారిటీ లేనట్లు కనిపిస్తుంది. పాటలు చూడడానికి బాగానే ఉన్నా, అవేవీ సందర్భానుసారంగా రావు. కమర్షియల్ ఫార్మాట్‌లో పాటలు ఉండాలని అక్కడక్కడా వీటిని యాడ్ చేశారా? అనే అభిప్రాయం కలుగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్‌లో మంచి ట్విస్ట్ ఉంచి ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్‌ను కూడా అదే స్థాయిలో ఊహిస్తే రొటీన్ క్లైమాక్స్‌ను ప్లాన్ చేయడం నిరాశ కలిగిస్తుంది. ఫస్టాఫ్‌ మొత్తం ఒక అజెండా లేకుండా, సన్నివేశాలతో కనెక్ట్ లేకుండా వెళ్ళిపోతుంది. దీంతో సెకండాఫ్‌తో పోల్చి చూసుకున్నపుడు ఫస్టాఫ్‌ బోరింగ్‌గా ఉందనే చెప్పాలి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందు దర్శక రచయిత కిట్టు నల్లూరి గురించి చెప్పుకుందాం. కిట్టు, ఇంతకుముందే చాలా సార్లు చూసి ఉన్న కథనే ఎంచుకొని, ఆ కథను ఏమాత్రం ఆసక్తికరంగా లేని సన్నివేశాలతో లాక్కొచ్చి రచయితగా కొత్తదనం చూపించడంలో విఫలమయ్యాడు. ఇక దర్శకుడిగా బిట్స్ బిట్స్‌గా చూసినప్పుడు దర్శకుడి పనితనం చూడొచ్చు. కొన్ని సన్నివేశాల్లో షాట్ కంపోజిషన్‌లో దర్శకుడి ప్రతిభ బాగుంది. అయితే కథ, కథనం, క్యారెక్టరైజేషన్ లాంటి విషయాల్లో మరింత క్లారిటీ కనబరిస్తే బాగుండేది.

ఇక సినిమాటోగ్రాఫర్ మలహర్‌భట్ జోషి టెక్నికల్ టీమ్‌లో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. సరైన లైటింగ్, ఫ్రేమింగ్ టెక్నిక్స్‌తో చాలాచోట్ల జోషి మెరుపులు చూడొచ్చు. సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్‌లో ఒక పాట వినడానికి బాగుంది. మిగతావన్నీ రొటీ‌న్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సాయి కార్తీక్ బాగానే ఆకట్టుకున్నాడు. ఇక పాసం వెంకటేశ్వర రావు ఎడిటింగ్ ఫర్వాలేదు. చాలాచోట్ల ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇబ్బంది పెడతాయి. కొన్ని అనవసర సన్నివేశాలను కట్ చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఎక్కడా ఒక చిన్న సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ రానివ్వలేదు.

తీర్పు :

తెలుగులో ఒక చిన్న సినిమా తనదైన ఐడెంటిటీ చూపించుకోవాలంటే కచ్చితంగా ఒక అందమైన ప్రేమకథతోనో లేదా ఓ డిఫరెంట్ జానర్‌తోనో వస్తే బాగుంటుందనేది ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కాన్సెప్ట్! ఆ నేపథ్యంలోనే గత కొద్దికాలంగా కిడ్నాప్, క్రైమ్, హర్రర్ ఈ తరహా సినిమాల హడావుడి పెరిగింది. అదే కోవలో ఓ కిడ్నాప్ డ్రామాగా మనముందుకు వచ్చిన చిత్రమే ‘కేటుగాడు’. కథలో కొత్తదనమేమీ లేకపోవడం, కథనం కూడా సాదాసీదాగా ఉండడం, క్లారిటీ లేని క్యారెక్టరైజేషన్స్.. ఇలా పలు ప్రతికూల అంశాలతో వచ్చిన ఈ సినిమాలో కామెడీ, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్, కొన్ని పాటల్లో విజువల్స్ ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయని చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏ జానర్ ద్వారా మెప్పించాలని వచ్చినా, కథలో బలం, కథనంలో స్పష్టత, ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలే సినిమాను నిలబెడతాయన్నది సినిమా నిరూపించి చూపిన సత్యం. ‘కేటుగాడు’.. అదే విషయాన్ని పక్కనపెట్టి సాదాసీదా సినిమాగా నిలిచిన ఓ ప్రయత్నం!

123తెలుగు రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు