‘అఖిల్’.. ఇప్పుడు తెలుగు సినీ అభిమానుల చర్చల్లో ఎక్కడ విన్నా ఈ పేరు బాగా పాపులర్ అయిపోయింది. అక్కినేని వంశం నుంచి మూడో తరంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు అక్కినేని అఖిల్ సిద్ధమైన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ అన్న పేరుతోనే అఖిల్ మొదటి సినిమా రూపొందడంతో ఈ పేరు క్రేజీగా మారింది. ఇక ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు (సెప్టెంబర్ 20న) అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు.
హైద్రాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున జరగనున్న ఈ ఆడియో ఆవిష్కరణ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇక ఇప్పటికే భారీ క్రేజ్ మూటగట్టుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణకు మహేష్ రానుండడంతో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌పై ఆసక్తి రెట్టింపైంది. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ ఏ సినిమా ఆడియో రిలీజ్‌నూ చేపట్టనంత గ్రాండ్‌గా ఈ ఈవెంట్‌ను చేపడుతున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమాను నిర్మిస్తోన్న హీరో నితిన్ కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అఖిల్ సరసన ఈ సినిమాలో సయేషా సైగల్ హీరోయిన్‌గా నటించారు.