సమీక్ష : చెంబు చిన సత్యం – అతీగతీ లేని బోరింగ్ ప్రయత్నం!

సమీక్ష : చెంబు చిన సత్యం – అతీగతీ లేని బోరింగ్ ప్రయత్నం!

Published on Sep 26, 2015 2:55 PM IST
Chembu Chinna Satyam review

విడుదల తేదీ : 25 సెప్టెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

దర్శకత్వం : నామాల రవీంద్రసూరి

నిర్మాత : ఆలూరి సాంబశివరావు

సంగీతం : విజయ్ కురాకుల

నటీనటులు : సుమన్‌శెట్టి, ప్రమోదిని


కమెడియన్‌గా పలు విజయవంతమైన సినిమాల్లో చక్కటి పాత్రలు పోషించిన సుమన్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘చెంబు చిన సత్యం’. హర్రర్ కామెడీ జానర్ పేరుతో రూపొందిన ఈ సినిమాను ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మించారు. నామాల రవీంద్రసూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘నిద్రలో కనేది కల, నిద్ర లేపేది కళ’ అన్న ప్రచారంతో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హర్రర్ కామెడీ ప్రయత్నం ఎంతమేరకు ఫలించింది? చూద్దాం..

కథ :

చెంబు చిన సత్యం (సుమన్ శెట్టి).. ఎల్.ఐ.సీ ఏజెంట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే ఓ సాధారణ మధ్య తరగతి వ్యక్తి. ఎప్పటికైనా ఓ పెద్ద ఇల్లు కొనాలనే లక్ష్యంతో సత్యం బతుకుతూంటాడు. డబ్బులు లేకున్నా ఎలాగోలా ఇల్లు నెట్టుకొచ్చే చిన సత్యంకు నిద్రలో ఏ కల వచ్చినా అది నిజమై తీరుతుంది. అప్పటికే నిద్రలో కొన్ని అనుకోని కలలు రావడంతో ఇబ్బందులు పడ్డ సత్యం, మళ్ళీ ఎలాంటి చెడు కల వచ్చినా అది నిజమవుతుందేమో అన్న భయంతో జీవితాన్ని ఇబ్బందుల్లో పడేసుకుంటూ ఉంటాడు.

ఈ క్రమంలోనే చిన సత్యంకు తన కళ్ళ ముందే కుటుంబ సభ్యులంతా చనిపోయినట్లు ఓ కల వస్తుంది. అది నిజమవుతుందేమో అన్న భయంలో తన వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. ఇదిలా జరుగుతూండగా, సత్యం తన కలకు సంబంధించిన నిజం ఒకటి తెలుసుకుంటాడు. సత్యం తెలుసుకున్న ఆ నిజం ఏంటి? సత్యం కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఎదురయ్యాయా? తనను భయపెట్టిన విషయమే కాక సత్యం జీవితాన్ని అయోమయానికి గురిచేసిన సంఘటన ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానమే ‘చెంబు చిన సత్యం’.

ప్లస్‌ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే.. చివరి ఇరవై నిమిషాల్లో నవ్వించడానికి చేసిన ప్రయత్నం గురించి చెప్పుకోవాలి. హర్రర్ కామెడీ అన్న పేరు చెప్పుకొని వచ్చిన సినిమాలో, ఆ పార్ట్ ఎక్కడైనా కనిపించిందా అంటే అది ఈ చివరి ఇరవై నిమిషాలనే చెప్పాలి. ఈ సమయంలో వచ్చే రెండు ట్విస్టులు, కామెడీ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. ఇక సినిమా పరంగా చూసుకుంటే ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లను ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు.

నటీనటుల పరంగా సుమన్ శెట్టి ఒక పూర్తి స్థాయి పాత్రలో బాగానే అలరించాడు. ఫస్టాఫ్‌లో ఒక గమనమంటూ లేని కథకు ఏదైనా రిలీఫ్ ఉందంటే అది సుమన్ శెట్టి డైలాగ్ డెలివరీ అని చెప్పొచ్చు. అయితే సినిమాకు పూర్తిగా ఒక మంచి కామెడీ టచ్ ఇచ్చి నడిపించడంలో మాత్రం సుమన్ శెట్టి అక్కడక్కడా విఫలమయ్యారు. ఇక సుమన్ శెట్టి కుటుంబ సభ్యులుగా నటించినా వారంతా ఫర్వాలేదనిపిస్తారు. ప్రీ క్లైమాక్స్ పార్ట్‌లో ఎంట్రీ ఇచ్చే ‘అమృతం’ వాసు, ఈ సినిమాను తనదైన టైమింగ్‌తో చివరివరకూ నడిపించారు. సినిమాకు ప్లస్ పాయింట్‌గా చెప్పుకుంటున్న ప్రీ క్లైమాక్స్‌లో వాసునే చాలా వరకు సినిమాను నిలబెట్టాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే.. చెప్పాలనుకున్న కాన్సెప్ట్, కథ, సినిమా నేపథ్యం ఇలా ఏ విషయమ్మీదా క్లారిటీ లేకుండా సినిమాను నడిపించిన విధానం గురించి చెప్పుకోవాలి. కాన్సెప్ట్ వరకూ బాగానే కనిపించే విషయాన్ని, సినిమాగా ఎలా మార్చాలో తెలియక.. ఫ్యామిలీ, డ్రామా, కామెడీ, హర్రర్ ఇలా ఒక్కో నేపథ్యం చుట్టూ కొంత కథను నడిపి చివరకు సినిమాను ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగించారు. ఇలా జానర్స్ మిక్స్ చేసి సినిమా చేయడం తప్పని ఎవ్వరూ అనరు. కానీ, అందుకు ఓ సరైన కారణం, పకడ్బందీ కథనం ఉందా? లేదా? అన్నది ప్రధానాంశం. ఈ సినిమా విఫలమైంది కూడా ఇక్కడే!

ఫస్టాఫ్‌లో సుమన్ శెట్టితో పాటు అతడి కుటుంబాన్ని పరిచయం చేయడంతో అతి సాధారణంగా మొదలయ్యే సినిమా రాను రానూ బోర్ కొట్టిస్తూ సాగిపోతూ సరిగ్గా ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుందనే ఆలోచన రావడం మొదలవ్వగానే, సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ వరకూ బోర్ కొట్టించారు. ఫస్టాఫ్‌లో క్రియేట్ చేసిన సస్పెన్స్ ఎలిమెంట్‌ను ఎలా నడపాలో తెలియక సెకండాఫ్‌లో దర్శకుడు ఎంచుకున్న సన్నివేశాలు కొత్తదనం లేక, ఆసక్తికరంగానూ లేక అలా సాగుతూంటాయంతే.

ఇక ఉన్నంతలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫర్వాలేదనుకున్నా క్లైమాక్స్‌లో హర్రర్ పార్ట్‌కు ఎంచుకున్న ఎలిమెంట్ కూడా తేలిపోయింది. ఇక లాజిక్స్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అదే విధంగా హీరో పాత్రను రూపొందించిన విధానం కూడా పెద్దగా ఆకట్టుకోదు. ముఖ్యంగా ఆడవాళ్ళ ఆలోచనలు, విధానాల పట్ల హీరో పాత్ర ప్రవర్తన కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చెప్పుకుంటే.. ముందు దర్శక, రచయిత నామాల రవీంద్రసూరి గురించి చెప్పుకోవాలి. చెప్పాలనుకున్న కాన్సెప్ట్ బాగున్నా, దాన్ని కథగా, సినిమాగా ఎలా చెప్పాలనే విషయంలో రచయితగా పూర్తిగా విఫలమయ్యాడు. ఇదే కాన్సెప్ట్‌ను ఒక పకడ్బందీ కథతో రూపొందించి ఉంటే వేరేలా ఉండేదేమో! స్క్రీన్‌ప్లే విషయంలో రవీంద్ర ఎక్కడా సరైన మార్కులు వేయించుకోలేకపోయాడు. సినిమాలో రెండు ట్విస్ట్‌లు, ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఉంచుకొని కూడా వాటిచుట్టూ ఏ కథ అల్లాలో తెలియక, రొటీన్ కథనైనా సినిమాగా ఎలా చెప్పాలో తెలియక తేలిపోయాడు. అయితే డైలాగ్స్ విషయంలో మాత్రం కొన్నిచోట్ల బాగా ఆకట్టుకుంటాడు. ఇక దర్శకత్వం పరంగానూ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చివర్లో కామెడీని డీల్ చేసిన విధానం ఓకే అనిపిస్తుంది.

మిగతా సాంకేతిక నిపుణుల పనితీరుకొస్తే విజయ్ అందించిన సంగీతంలో రెండు పాటలు ఫర్వాలేదనేలా ఉన్నాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చెప్పుకునేంతగా లేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా సాదాసీదాగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సక్సెస్ అయింది అనిపించుకున్న సన్నివేశాలు సినిమా మొత్తం మీద నాలుగైదుకు మించి లేవు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సాధారణంగా ఉన్నాయి. బడ్జెట్ పరిమితులు స్పష్టంగా కనిపిస్తూ, కొన్నిచోట్ల సినిమా రేంజ్‌ను తగ్గినట్లు తయారైంది.

తీర్పు :

ఏ భాషా సినీ పరిశ్రమైనా శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల కళతో వెలిగిపోతూ ఉంటుంది. కొన్ని సినిమాలు స్ట్రాంగ్‌గా వచ్చి అంతే స్ట్రాంగ్‌గా నిలబడతాయ్. కొన్ని సినిమాలు వచ్చి తమ ఉనికిని అలా చెప్పుకొని, ఇలా వెళ్ళిపోతుంటాయ్. ఇక ఏ ఉనికీ లేకుండా వచ్చి, అదే విధంగా ఏ ఉనికీ చూపకుండా వెళ్ళిపోయే జాబితా ఒకటి ఉంది. ఆ జాబితాలో చేరిపోయే సినిమా ‘చెంబుచిన సత్యం’. కాన్సెప్ట్ బాగున్నట్టు కనిపించినా, దాన్ని కథగా, సినిమాగా చెప్పడంలో పూర్తిగా విఫలమవ్వడం, ఒక స్పష్టమైన అవగాహన లేకుండా సినిమాను రకరకాలం అంశాలను మేళవిస్తూ ఎటూకాని ఒక రూట్‌లో నడపడం, బోరింగ్ అనిపించే సన్నివేశాలు.. ఇలా ఎన్నో మైనస్ పాయింట్స్‌ను వెనకేసుకొని వచ్చిన ఈ సినిమాను చూడాలని ఫిక్స్ అయితే కనుక చివరి ఇరవై నిమిషాల కామెడీ కోసం మాత్రం చూడొచ్చు. అంతకుమించి ఈ సినిమా నుంచి ఏం కోరి వెళ్ళినా నిరాశే!

123తెలుగు రేటింగ్ : 1.75/5
123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు