మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రూస్ లీ’ అనే సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను నిన్న సాయంత్రం విడుదల చేశారు. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన బ్రూస్ లీ ఆడియోపై అభిమానులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో, థమన్ ఆ అంచనాలను ఏ మేరకు అందుకున్నాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
1. పాట : రన్
గాయకుడు : సాయి శరణ్, నివాజ్
సాహిత్యం : శ్రీమణి
‘రన్.. రన్ రన్’ అంటూ సాగే ఈ పాట ఓ స్టార్ హీరో ఇంట్రో సాంగ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉందని చెప్పొచ్చు. శ్రీమణి అందించిన సాహిత్యం అర్థవంతంగా ఉండడంతో పాటు హీరో పాత్ర, యువత ఆలోచనలను కూడా చెప్పేలా ఉంది. ఇక థమన్ అందించిన మ్యూజిక్‌తో పాటకు మంచి ఊపు వచ్చింది. ముఖ్యంగా పాట మొదలవ్వడానికంటే ముందు వచ్చే బీట్ చాలా బాగుంది. సాయి శరణ్, నివాజ్‌ల వాయిస్ పాట మూడ్‌కు సరిగ్గా సరిపోయింది. ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో థమన్ పెద్దగా ప్రయోగాలేవీ చేయలేదన్న విషయం స్పష్టమవుతోంది. అయితే తనదైన లౌడ్ మ్యూజిక్‌కు కొత్త వెస్ట్రన్ టచ్ ఇచ్చి థమన్ రూపొందించిన ట్యూన్ బాగా ఆకట్టుకుంటుంది. విజువల్స్‌తో కలిపిచూస్తే ఈ పాట మంచి ఫీల్ ఇస్తుందని చెప్పొచ్చు. బ్రూస్ లీ ఆడియోలో ఇన్స్‌టంట్‌గా ఎక్కే పాటల్లో ఇదొకటి.
2. పాట : రియా
గాయకుడు : రాబిట్ మాక్, దీపక్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
‘రియా రియా రియా’ అనే ఈ పాటను థమన్ స్టైల్లో సాగే మరో మంచి ఫాస్ట్ బీట్ సాంగ్‌గా చెప్పుకోవచ్చు. థమన్ ఈ పాటలోనూ పెద్దగా ప్రయోగాలేవీ చేయకున్నా వెస్ట్రన్ స్టైల్ ట్యూన్‌కు ఇంగ్లీష్ లిరిక్స్‌తో కలిపి చేసిన ప్రయత్నం శ్రోతల్ని బాగా ఆకట్టుకునే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక పాట మధ్యలో వచ్చే స్పెషల్ ఫ్లూట్ మ్యూజిక్ ఈ పాటకు మంచి అందాన్ని తెచ్చిపెట్టింది. రాబిట్ మాక్, దీపక్‌లు తమ స్టైల్లో ఈ పాటకు మంచి ఫీల్ తెచ్చారు. రామ జోగయ్య శాస్త్రి తెలుగు-ఇంగ్లీష్ పదాలను కలిపి సాహిత్యం అందించే పాటల స్పెషలిస్ట్ అన్న విషయాన్ని ఈ పాట మరోసారి ఋజువుచేసింది. ఆయన అందించిన సాహిత్యం కూడా చాలా బాగుంది. రియా రియా రిథమ్ పాటకు హైలైట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.
3. పాట : కుంగ్‌ఫూ కుమారి
గాయకుడు : రమ్య బెహరా, దీపక్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
‘మెగా మెగా మెగా మీటర్’ అంటూ సాగే ఈ పాట మెగా అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. థమన్ తనదైన స్టైల్ బీట్, ఇన్స్ట్రుమెంట్స్‌ను కలిపి రూపొందించే ఊపున్న పాటల జాబితాలో దీన్ని చేర్చవచ్చు. కుంగ్ ఫూ కుమారి అనే రిథమ్ కూడా చాలా బాగుంది. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఈ పాటకు బాగా ఉపయోగపడింది. దీపక్ వాయిస్‌లో ఈ పాట వినడానికి బాగుంది. ఇక రమ్య వాయిస్‌లో పాటలో కిక్కిచ్చే రిథమ్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఈ పాటలో అక్కడక్కడా థమన్ దర్శకత్వంలోనే గతంలో వచ్చిన కొన్ని పాటల చాయలు కనిపిస్తాయి. అయితే వాటన్నింటినీ కప్పిపెట్టేలా కొన్నిచోట్ల ఇన్స్ట్రుమెంట్స్‌తో ప్రయోగాలు చేశాడు.
4. పాట : లే చలో
గాయకుడు : థమన్, మేఘ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
బ్రూస్ లీ ఆల్బమ్‌లో వినిపించే ఓ మంచి రొమాంటిక్ పాటగా ‘లే చలో’ను చెప్పుకోవచ్చు. ఈ ఆల్బమ్‌లో ఇదే బెస్ట్ సాంగ్‌గా కూడా కనిపిస్తోంది. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం రొమాంటిక్ ఫీల్‌ను చాలా బాగా క్యారీ చేసింది. అదే విధంగా ఈ పాట కోసం థమన్ ఎంచుకున్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా మంచి ఫీల్ తెచ్చాయి. ప్రతి ఇంటర్వెల్‌కు ఒక్కో కొత్త ఇన్స్ట్రుమెంట్‌ను ప్రవేశపెడుతూ థమన్ ఈ పాటకు ఓ అందాన్ని తెచ్చాడు. ఇక థమన్ స్వయంగా పాడటం కూడా ఈ పాటకు బాగా కలిసి వచ్చింది. మేఘ కూడా థమన్‌కు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇద్దరి వాయిస్ మధ్యన కనెక్షన్ బాగుంది. ఇప్పటికే పాపులర్ అయిన ఈ పాట సినిమా రిలీజ్ తర్వాత మరింత పాపులర్ అవుతుందనడంలో సందేహం లేదు.
5. పాట : బ్రూస్ లీ
గాయకుడు : సమీరా భరద్వాజ్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
ఇక ఎప్పట్లానే తెలుగు సినిమా ఫార్మాట్లో చివర్లో ఒక మాస్ నెంబర్‌గా బ్రూస్ లీ అంటూ సాగే ఈ పాటను చెప్పుకోవచ్చు. అల్లి అల్లి అన్న రిథంతో మొదలయ్యే ఈ పాటలో థమన్ ఎక్కడా ప్రయోగం చేయకుండా తనకు బాగా అలవాటైన ఫార్మాట్లో ఈ పాటను అందించాడు. ఒక మాస్ నెంబర్‌కు ఎలాంటి బీట్స్ అయితే అవసరమో అవన్నీ సరిగ్గా వాడుకుంటూ మాస్ ఫీల్ తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కూడా బాగుంది. సమీరా, సింహల వాయిస్ కూడ ఈ పాటకు సరిగ్గా సరిపోయింది. ఇక మాస్‌ని మెప్పించడమే ప్రధాన ఎజెండాగా రూపొందిన ఈ పాట టార్గెట్ శ్రోతలకు బాగా ఆకట్టుకునే పాటగా నిలుస్తుందని ఈజీగా చెప్పేయొచ్చు.
తీర్పు :
తెలుగులో ఏ పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్‌కు దగ్గరపడుతున్నా, ముందు హంగామా చేసేది ఆడియోనే! ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే సంగీత దర్శకులు అందరినీ మెప్పించే ప్రయత్నం చేయడానికే ఎక్కువగా కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో చాలాసార్లు ప్రయోగాలకు చోటివ్వకుండా ముందే బాగా అలవాటైన ఫార్మాట్‌లో ఆల్బమ్ రూపొందిస్తుంటారు. రామ్ చరణ్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రానున్న బ్రూస్ లీ సినిమా ఆడియో కూడా ఈ ఫార్మాట్‌నే బలంగా నమ్ముకొని వచ్చిన ఆల్బమ్‌గా చెప్పుకోవచ్చు. థమన్ తనదైన మార్క్‌ను అన్ని రకాల శ్రోతలకు కనెక్ట్ అయ్యేలా రూపొందించి మంచి విజయం సాధించారనే చెప్పొచ్చు. ఎక్కడా ప్రయోగం చేయకున్నా, థమన్ తనకు తెలిసిన ఫార్మాట్‌నే చాలా బాగా అందిపుచ్చుకొని మంచి ఆల్బమ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రన్, లే చలో, కుంగ్‌ఫూ కుమారి ఇన్స్‌టంట్‌గా ఎక్కే పాటలుగా చెప్పుకోవచ్చు. రియా పాట కూడా ఫర్వాలేదనే ఉంది. ఇక ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘ఒక పెద్ద హీరో సినిమా ఆడియో అంటే ఇలా ఉండాలీ!’ అన్న పరిధులున్న నేపథ్యంలో థమన్ ఆ పరిధికి లోబడి బ్రూస్ లీతో ఓ రాకింగ్ ఆల్బమ్ ఇచ్చాడనే చెప్పాలి.
బ్రూస్ లీ ఆడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి