విడుదల తేదీ : 22 అక్టోబర్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : రమేష్ సామల
నిర్మాత : అశ్వినీ కుమార్ సహదేవ్
సంగీతం : జితిన్
నటీనటులు : సుమంత్ అశ్విన్, శీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి..
‘అంతకుముందు ఆ తరువాత’, ‘లవర్స్’, ‘కేరింత’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న హీరో సుమంత్ అశ్విన్ తాజాగా ‘కొలంబస్’ అనే మరో లవ్‌స్టోరీతో మనముందుకు వచ్చారు. ఆర్. సామలను దర్శకుడిగా పరిచయం చేస్తూ అశ్వినీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ ట్రయాంగిల్ లవ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్‌ను రీచ్ అవుతుందా? కొలంబస్ తన నిజమైన ప్రేమను కనిపెట్టాడా? చూద్దాం..
కథ :
ప్రేమ కోసం జైలుకు వెళ్ళిన హీరో అశ్విన్ (సుమంత్ అశ్విన్), జైలు నుంచి బయటకొచ్చాక మళ్ళీ తన ప్రేమను తిరిగి దక్కించుకునేందుకు చేసే ప్రయాణమే ‘కొలంబస్’. కాలేజీ రోజుల్లో ఇందు (మిస్తీ చక్రవర్తి)ని గాఢంగా ప్రేమించిన అశ్విన్, ఆమే జీవితం అనుకొని బతికేస్తుంటాడు. కాగా కొన్నాళ్ళకు ఇందు మాత్రం కెరీర్‌పై ఎటువంటి ఆసక్తీ లేని అశ్విన్‌ను కావాలనే దూరం చేస్తుంది. ఈ క్రమంలోనే పై చదువులకు ఢిల్లీ వెళ్ళిన ఇందును కలవడానికి అశ్విన్ కూడా ఓ సందర్భంలో ఢిల్లీ వెళతాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఓ మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కొని జైల్ పాలవుతాడు.
జైలు నుంచి తిరిగొచ్చాక మళ్ళీ ఇందును వెతకడం, ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేపట్టడం కోసం ఒక ప్రయాణం మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో తనకు పరిచయమైన నీరజ (శీరత్ కపూర్) అన్ని విధాలా అతడి ప్రయత్నాల్లో సహాయం చేస్తూంటూంది. ఈ ప్రయాణంలో అనుకోకుండానే అశ్విన్, నీరజ దగ్గరవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్ ప్రయాణం ఎటువైపు సాగింది? అతడి నిజమైన ప్రేమను ఎలా కనుక్కున్నాడు? ఇందు, నీరజ ఇద్దరిలో చివరకు అశ్విన్ ఎవరికి దగ్గరవుతాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే ‘కొలంబస్’.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే సుమంత్ అశ్విన్, శీరత్ కపూర్ల సమాంతర కథను వీలైనంత ఫ్రెష్‌గా చూపడం గురించి చెప్పుకోవచ్చు. ఈ సన్నివేశాలన్నీ కొంత ఫన్నీగా, ఆసక్తికరంగా ఉండడంతో చాలా బాగా ఆకట్టుకుంటాయి. ట్రయాంగిల్ కథల్లో ఈ పాయింట్ కొత్తదనే చెప్పొచ్చు. హీరో తన ప్రేమ కోసం వెతకడం, అందుకు మరో అమ్మాయి సహాయం చేయడం, ఈ ప్రయాణంలో వీరిద్దరూ దగ్గరవ్వడం తరహా కథలు ఇదివరకే కొన్ని వచ్చి ఉన్నా, ఈ సినిమాలో మాత్రం ఈ పాయింట్‌ను ఫ్రెష్‌గా డీల్ చేశారు. ఇక స్క్రీన్‌ప్లే పరంగా రెండు సమాంతర కథలను ప్రధాన కథ, ఉపకథలుగా నడుపుతూ చివర్లో ఈ రెండింటీనీ రివర్స్ చేయడం సినిమాకు మంచి పాజిటివ్ పాయింట్.
అశ్విన్‌గా సుమంత్ అశ్విన్ బాగా నటించాడు. డైలాగ్ డెలివరీలో, కామెడీ టైమింగ్‌లో సుమంత్ పరిణతి సాధించాడు. ఇక శీరత్ కపూర్ నీరూ పాత్రలో చాలా బాగా నటించింది. కొన్ని చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ వదిలేస్తే ఓవరాల్‌గా మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. మిస్తీ చక్రవర్తి తనకిచ్చిన పాత్రకు వీలైనంత మేర న్యాయం చేసింది. ఇక సప్తగిరి కొన్నిచోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. అశ్విన్ తల్లిగా నటించిన రోహిణి ఉన్నంతలో ఆ పాత్రకు ఓ అర్థాన్ని తెచ్చిపెట్టింది.
సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌ను ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లో వదిలేసిన సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నింటినీ సెకండాఫ్‌లో ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ పోవడం, ప్రీ క్లైమాక్స్‌లో అసలైన ప్రేమను కనుక్కోవడం వంటి అంశాలతో సెకండాఫ్ బాగుందనిపిస్తుంది. ఇక పాటలను సెపరేట్‌గా కాకుండా కథలో భాగంగా వచ్చే సన్నివేశాలతో కలిపేయడం ఈ సినిమాకు గొప్ప ప్లస్‌పాయింట్.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే.. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో రెండు మేజర్ క్యారెక్టర్స్‌కు బలమైన క్యారెక్టరైజేషన్ లేకపోవడమనే చెప్పాలి. శీరత్ కపూర్ క్యారెక్టర్‌ను పక్కనపెడితే, మిస్తీ, సుమంత్‌ల క్యారెక్టర్స్‌కు సరైన క్యారెక్టరైజేషన్ లేదు. చివర్లో సుమంత్ క్యారెక్టర్‌కు ఓ జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగినా అది కృత్రిమంగా కనిపిస్తుంది. ఇక సుమంత్ – మిస్తీల లవ్‌స్టోరీ చాలా సాదాసీదాగా ఉంది. హీరో క్యారెక్టర్ తన ప్రేమ కోసం ఎంతదూరమైన వెళ్ళినపుడు ఆ ప్రేమలో నిజాయితీ, ఫీల్ ఉండాలి. ఇక్కడ క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని చూసినపుడు అవి మిస్ అయినట్టు కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో ట్రయాంగిల్ స్టోరీకి ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, ఒకదశలో సినిమా మొత్తం ఒకే ఒక్క సింగిల్ పాయింట్‌తో నడుస్తూ వచ్చిన సన్నివేశాలే వస్తూన్నాయా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. సప్తగిరి కామెడీ ట్రాక్ నవ్వించే ప్రయత్నం చేసినా, ఆ ట్రాక్ కథకు సరిగ్గా కుదరలేదు. ఫస్టాఫ్‌లో చాలా చోట్ల సినిమాకు కథా గమనం అంటూ ఒకటి లేకుండా సినిమా అలా అలా ఎయింలెస్గా సాగిపోతుంది. ఇక రొమాంటిక్ కామెడీల్లో ఉండే అసలైన ఫన్ ఈ సినిమాలో చాలా చోట్ల మిస్ అయింది. అశ్విన్-ఇందులను కలిపేందుకు నీరూ వేసే కొన్ని ప్లాన్స్ మరీ సినిమాటిక్‌గా ఉన్నాయి. నటుడు పృథ్వీ, నాగినీడు తదితరులు కేవలం అతిథి పాత్రలకే పరిమితం అయ్యారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా దర్శకుడు రమేష్ సామల గురించి చెప్పుకోవాలి. ఒక ట్రయాంగిల్ లవ్స్టోరీలోని కొత్త పాయింట్‌ను దర్శకుడిగా బాగానే డీల్ చేశాడు. ఎమ్మెస్ రాజు అందించిన కథను సినిమాగా చెప్పే ప్రయత్నంలో దర్శకుడిగా చాలావరకు సక్సెస్ అయ్యాడు. అయితే క్యారెక్టరైజేషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని కథను ఆ కోణంలో నడిపించి ఉంటే ఈ సినిమాకు బాలీవుడ్ రొమాన్స్ జానర్ సినిమాల్లో కనిపిస్తోన్న కొత్తదనం తోడయి సినిమాను మరో ఎత్తులో నిలబెట్టేది. ప్రీ క్లైమాక్స్‌లో దర్శకుడి పనితనం బాగా ఆకట్టుకుంటుంది.
ఇక సినిమాటోగ్రాఫర్ భాస్కర్ సామల పనితనం చాలా బాగుంది. ఒక మోస్తారు బడ్జెట్ సినిమా అయినా కూడా ఎక్కడా ఆ ఫీల్ రాకుండా చూడడంలో సినిమాటోగ్రాఫర్ పనితనం చూడొచ్చు. ఎడిటర్ కె.వి.కృష్ణారెడ్డి పనితనం పర్వాలేదు. కొన్నిచోట్ల సన్నివేశానికి, సన్నివేశానికి మధ్య తీసుకున్న ఎఫెక్ట్ కట్స్ ఇబ్బంది కలిగిస్తాయి. జితిన్ అందించిన మ్యూజిక్ బాగుంది. పాటలన్నీ సినిమాలో కలిసిపోయేవే కావడం కూడా కలిసివచ్చింది. ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
మంచి ఫీల్ ఉన్న ప్రేమకథలు ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటాయ్! ప్రతిసారీ ఈ కథల్లో ఏదో కొత్త అంశం కట్టిపడేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ జానర్లో వచ్చే సినిమాలకు కొదవ లేదు. అయితే ఈ సినిమాలన్నింటిలో ఆ ఫీల్ ఉన్న సినిమాలు ఎన్ని ఉంటున్నాయ్? అన్నదే ప్రశ్న! తాజాగా ఈ జానర్లో నిజమైన ప్రేమను కనిపెడతానంటూ బయలుదేరిన ‘కొలంబస్’ నేడు ప్రేక్షకుల ముందు వాలిపోయాడు. ప్రేమను వెతికి పెట్టేందుకు మొదలైన ప్రయాణంలో అనుకోకుండా కనిపించే మరో కొత్త ప్రేమకథ, కొత్త ఎమోషన్, ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో కొత్తదైన కాన్సెప్ట్ లాంటి పాజిటివ్ పాయింట్స్‌తో వచ్చిన కొలంబస్, ఒకే సింగిల్ పాయింట్‌తో సాదాసీదాగా చివరివరకూ నడవడం, క్యారెక్టరైజేషన్లో సరైన క్లారిటీ లేకపోవడం, ఇంతకుముందే చూసినట్టనిపించే కథ వంటి మైనస్ పాయింట్స్‌తో ప్రేమను కనిపెట్టే ప్రయత్నంలో చివరిదాకా వచ్చి సక్సెస్ సాధించినా మధ్యలో చాలాసార్లు తడపడ్డాడు. ఆ తడపాటు సాధారణమే అనుకొని ఈ ప్రయాణాన్ని చూస్తే ఈ కొలంబస్ ఫర్వాలేదనిపిస్తాడు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం