విడుదల తేదీ : 06 నవంబర్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : చంద్ర మహేష్
నిర్మాత : పివి శ్రీరాం రెడ్డి
సంగీతం : రవివర్మ
నటీనటులు : మహాదేవ్, అంజన మీనన్, సుమన్ ..
‘ప్రేయసి రావే’ సినిమాతో మెప్పించి ఆ తర్వాత ‘హనుమంతు’, ‘అయోధ్య రామయ్య’, ‘ఆలస్యం అమృతం’ తదితర సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు చంద్ర మహేష్, తాజాగా ‘రెడ్ అలర్ట్’ పేరుతో నేడు మనముందుకు వచ్చారు. పి.వి.శ్రీరామ్ రెడ్డి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో కెకె మహదేవ్ హీరోగా నటించగా సుమన్, అంజన మీనన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఓ టెర్రరిస్ట్ ప్లాన్‌కు, కొందరు యువకుల ప్రయాణానికి మధ్యన ప్యార్లల్గా నడిచే కథలో చెప్పిన అంశమేంటి? రెడ్ అలర్ట్ టైమ్‌లో జరిగిందేంటి? చూద్దాం..
కథ :
పూణేలో టెర్రరిస్టుల ఘాతుకానికి పది మంది బలయ్యారన్న వార్తతో సినిమా అసలు కథ మొదలవుతుంది. అదే టెర్రరిస్ట్ గ్యాంగ్ హైద్రాబాద్‌లో గణేష్ నిమజ్జన వేడుకల్లో విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేసుకుంటుంది. కాగా ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ సిటీలో రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది. ఇక ఇదే సమయానికి హైద్రాబాద్‌లో జరిగే నిమజ్జన వేడుకలను చూడడానికి మహదేవ్ (మహదేవ్), కృష్ణ, అమర్, సాయితేజ్లు తమ స్నేహితుడు శ్రీరామ్ ఇంటికి వస్తారు. ఓ న్యూస్ చానల్లో క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేసే శ్రీరామ్ అనుకోని పరిస్థితుల్లో పూణే వెళ్ళాల్సి వస్తుంది.
ఇక స్నేహితుడు అందుబాటులో లేకపోవడంతో ఈ నలుగురు స్నేహితులూ ఒక హోటల్లో ఉంటూ హైద్రాబాద్ మొత్తాన్నీ చుట్టేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక శవం ఉన్న సంచిని అనుకోకుండా తమతో పాటు తీసుకొస్తారు. రెడ్ అలర్ట్ పరిస్థితుల్లో ఆ శవాన్ని పోలీసుల కంటపడకుండా వీరంతా ఏం చేశారు? ఆ శవం ఎవరిది? డీసీపీ భువనేశ్వరి (అంజన మీనన్)కి ఆ శవం గురించి తెలిసిన విషయాలేంటి? టెర్రరిస్ట్ గ్యాంగ్ ప్లాన్‌కు, ఈ నలుగురు ఫ్రెండ్స్‌కు లింక్ ఎలా కుదిరింది? చివరకు ఈ ప్రశ్నలన్నింటికీ వచ్చిన సమాధానమేంటి? అన్నదే రెడ్ అలర్ట్ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
రెడ్ అలర్ట్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఒకే అంశాన్ని రెండు, మూడు విభిన్న ఉపకథలకు కనెక్ట్ చేస్తూ ఒక సినిమాగా చెప్పాలని చేసిన ప్రయత్నం గురించి చెప్పుకోవచ్చు. ఇక విపరీతంగా ఆకట్టుకునేలా కాకపోయినా ఉన్నంతలో రెండు సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను క్యారీ చేసిన విధానం బాగుందని చెప్పొచ్చు. ఇక పోసాని కృష్ణ మురళీ, అతడి గ్యాంగ్ జోగీ బ్రదర్స్ నేపథ్యంలో వచ్చే కామెడీ కొన్నిచోట్ల నవ్వులు పూయించింది. క్లైమాక్స్‌లో శంకర్ మహదేవన్ పాడిన పాట, ఆ పరిస్థితుల్లో చకచకా సాగిపోయే క్లైమాక్స్‌కు సరిగ్గా కుదిరి క్లైమాక్స్‌ను ఫర్వాలేదనిపించేలా చేసింది.
మేజర్ లీడ్ రోల్లో నటించిన మహదేవ్ బాగానే నటించాడు. డ్యాన్సులు, డైలాగ్స్ విషయంలో ఫర్వాలేదు. అయితే క్లోజప్ షాట్స్‌లో మాత్రం కొన్నిచోట్ల తేలిపోయాడు. ఇక అంజనా మీనన్ పోలీస్ ఆఫీసర్‌గా బాగానే నటించింది. పోసాని, జోగీ బ్రదర్స్, అలీ తదితరుల నేపథ్యంలో వచ్చే కామెడీ ట్రాక్స్ రిలీఫ్ ఇస్తాయి. ఆ ట్రాక్స్‌ని సినిమా కథకు కూడా బాగానే లింక్ చేశారు. ఇక సినిమా పరంగా చూసుకుంటే.. సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నీ రివీల్ అయ్యే ప్రీ క్లైమాక్స్ పార్ట్‌ను ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే రెండు, మూడు సమాంతర ఉప కథలతో ఒక పూర్తి సినిమాను చెప్పడానికి కావాల్సిన బలమైన కథ, కథనాలను అల్లుకోకపోవడమనే చెప్పాలి. ఒకే పాయింట్ చుట్టూ నడిచే సినిమాలో ఉపకథలన్నింటినీ కలపడానికి మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్నే పట్టుకున్నా, అవేవీ ఆసక్తికరంగా లేకపోవడం, ఆ కథలన్నీ బోరింగ్‌గా ఉండడంతో సినిమా అలా అలా సాగిపోతుందంతే! క్లైమాక్స్ ఏదో ముందే తెలిసిపోయే ఇలాంటి సినిమాల్లో అంతకు ముందు జరిగే సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా అల్లుకోకపోవడం కూడా సినిమా గమనాన్ని ఎటూ కాకుండా చేసింది.
ఇక ఏ ఒక్క క్యారెక్టర్‌కూ ఓ అర్థాన్నిచ్చేలా బలమైన సన్నివేశాలు సినిమాలో లేవు. కామెడీ ప్రధాన ప్లస్ పాయింట్‌గా చెప్పబడుతున్న ఈ సినిమాలో అదికూడా కొన్నిచోట్ల పాత తెలుగు సినిమా ఫార్మాట్‌ను అందుకోవడం బోర్ కొట్టిస్తుంది. అలీ, అతడి భార్య మధ్యన వచ్చే సన్నివేశాలు మరీ ఓవర్‌గా, బోరింగ్‌గా ఉన్నాయి. ఇక టెర్రరిస్ట్ గ్యాంగ్‌ల మధ్యన నడిచే ఉపకథ ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. చాలా చోట్ల సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా మారిపోయి ఓవర్ అనిపించేలా ఉన్నాయి.
ఇక కొన్నిసార్లు సినిమాలో ఒకే సన్నివేశాన్ని తిప్పి తిప్పి చూపుతున్నారా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సుమన్ పాత్రకు చివర్లో యాడ్ చేసిన సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఓవర్‌గా ఉంది. అదేవిధంగా లాజిక్ అన్న దానికి సినిమా చాలాచోట్ల విలువివ్వలేదు. ఇంట్రో సాంగ్, ఐటమ్ సాంగ్ లేకున్నా పోయేదేమి లేదు అనే విషయం స్పష్టం కనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసేది సినిమాటోగ్రాఫర్ కళ్యాణ్ సమి అనే చెప్పాలి. ఒక చిన్న సినిమా అనే ఫీల్ రాకుండా మూడ్, లైటింగ్ విషయంలో ఉన్నంతలో మంచి ప్రతిభే కనబరిచాడు. ‘పీ పీ డుం డుం’ అనే పాటలో కళ్యాణ్ పనితనం బాగుంది. ఇక సంగీత దర్శకుడు రవివర్మ అందించిన సంగీతం ఫర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా బాగానే ఉంది. కొన్నిచోట్ల రొటీన్ సౌండ్స్ ఇబ్బంది కలిగిస్తాయ్! గౌతం రాజు ఎడిటింగ్ ఫర్వాలేదు. కొన్ని సన్నివేశాలకు అనవసర ప్రాధాన్యత ఇవ్వకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ఇక దర్శకుడు చంద్ర మహేష్ ఒక సినిమా చేయడానికి సరిపోయే స్టొరీ లైన్ ని ఎంచుకున్నప్పటికీ పూర్తి కథా విస్తరణలో మాత్రం ఫెయిల్ అవ్వడం వలన ఈ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. శ్రీరామ్ అందించిన సాదాసీదా కథకు, చంద్ర మహేష్ చేసుకొచ్చిన కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఇక దర్శకుడిగా మాత్రం కొన్ని చోట్ల చంద్ర మహేష్ మంచి ప్రతిభే కనబరిచాడు. ఓవరాల్‌గా మాత్రం చంద్ర మహేష్ నిరాశ పరచాడనే చెప్పొచ్చు.
తీర్పు :
పార్లల్ సబ్‌ప్లాట్స్ అన్నింటినీ ఒకే ఒక్క అంశం చుట్టూ నడిపిస్తూ వాటన్నింటినీ ఒక దగ్గర కనెక్ట్ చేసి చెప్పే సినిమాల్లో ఉండే కొత్తదనం ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. సరిగ్గా ఇలాంటి నెరేషన్‌తోనే ఆకట్టుకుంటానంటూ మనముందుకు వచ్చిన సినిమా ‘రెడ్ అలర్ట్’. ఇక పైన చెప్పిన తరహాలోనే నెరేషన్‌తో సినిమాను నడిపించాలనే ప్రయత్నంతో వచ్చిన ఈ సినిమా ప్రయత్నం దగ్గరే విఫలమైంది. కథ, కథనాల్లో ఆసక్తికర అంశాలేవీ లేకపోవడం, క్యారెక్టరైజేషన్స్‌లో స్పష్టత లేకపోవడం, రొటీన్ తెలుగు సినిమా స్టైల్ డైలాగ్స్, సన్నివేశాలు కలిసి ‘రెడ్ అలర్ట్’ అతి సాదాసీదా సినిమాగా నిలిపింది. అయితే పోసాని కామెడీ ట్రాక్, సీరియస్ విషయాన్ని కామెడీ అంశాలతో జతచేసి సినిమాగా చెప్పాలన్న ఓ ప్రయత్నం కోసం మినహాయిస్తే ఈ సినిమాను చూడాలన్న ఆలోచనను బలపరచడానికి పెద్దగా ఇతర కారణాలు లేవు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25 /5
123తెలుగు టీం