ఆరేళ్ళ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమాతో సిద్ధమైన కమల్

ఆరేళ్ళ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమాతో సిద్ధమైన కమల్

Published on Nov 19, 2015 2:16 PM IST

kamal-hasan

నటనలో దేశవ్యాప్తంగా తనదైన మార్క్, బ్రాండ్‌ను చాటి చెప్పిన నటుల్లో కమల్ హాసన్‌ ఒకరు. ఎప్పుడూ ఏదో ప్రయోగంతో మనముందుకు వచ్చే కమల్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేసి చాలా కాలమే అయింది. గతంలో ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కమల్ చేసిన చివరి స్ట్రైట్ తెలుగు సినిమా ‘ఈనాడు’. 2009లో విడుదలైన ‘ఈనాడు’ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా కోసం కమల్ చాలా సార్లే ప్రయత్నించినా ఇప్పటికది ‘చీకటి రాజ్యం’ సినిమాతో నెరవేరింది.

కమల్ శిష్యుడు రాజేష్ ఎమ్. సెల్వ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ‘చీకటి రాజ్యం’ సినిమా తెరకెక్కింది. తమిళ వర్షన్ ‘తూంగవనం’ దీపావళి కానుకగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తెలుగు వర్షన్ ‘చీకటి రాజ్యం’ మాత్రం పది రోజులు ఆలస్యంగా రేపు (నవంబర్ 20న) విడుదలకు సిద్ధమైంది. ఒకే ఒక్కరోజు జరిగే సంఘటనల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఓ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రచారం పొందుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం కమల్ భారీ ప్లాన్స్ వేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు స్పెషల్ ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. మంచి అంచనాల మధ్య చాలా కాలం తర్వాత వస్తోన్న కమల్ స్ట్రైట్ తెలుగు సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్‌కు అవకాశం ఉంది. త్రిష, ప్రకాష్ రాఝ్, సంపత్ రాజ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు