విలక్షణ నటనతో, కామెడీ టైమింగ్‌తో తెలుగు సినీ పరిమశ్రమలో గొప్ప గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు, ఈతరంలో తనదైన కామెడితో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి నవ్వించే కామెడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్‌ల కాంబినేషన్‌లో ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. కామెడీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాతో 50సినిమాలు పూర్తి చేసుకుంటున్న నరేష్, సినిమా విశేషాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఆ విశేషాలు..
ప్రశ్న) కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి నటించడం ఎలా అనిపించింది? ఆయనతో నటించడానికి ఏమైనా భయపడ్డారా?
స) మోహన్ బాబు గారితో కలిసి నటించడం ఓ మంచి అనుభూతి. డైలాగ్ డెలివరీలో ఆయన స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు పనిచేయడం ద్వారా ఆ విషయంలో కొన్ని కిటుకులు నేర్చుకున్నా. ఇక ఆయన స్ట్రిక్ట్ అని, కొడతారని కొందరన్నారు. నేనైతే ఆయనతో వెంటనే కలిసిపోయా. అంతే కాకుండా మొదటిరోజే ‘అంకుల్.. మీకు గౌరవమిస్తాను కానీ భయపడను. అలా అయితేనే నేను ఫ్రీగా నటించగలను’ అని చెప్పా. ఆశ్చర్యంగా ఆయన ఇంత సరదాగా ఉంటారా అన్నది ఆ తర్వాత తెలిసింది.
ప్రశ్న) ఇది మీకు 50వ సినిమా కదా.. ఎలా ఫీలవుతున్నారు?
స) 50 అన్న విషయాన్ని హైలైట్ చేసి సినిమాకు అంచనాలు తెప్పించదల్చుకోలేదు. సినిమాకు అంచనాలు పెరిగితే, మళ్ళీ అది ఒకరకంగా మైనస్ కూడా! నిజానికి నేను నా 51వ సినిమాగా ‘మామ మంచు అల్లుడు కంచు’ అన్న సినిమా చేయాలి. 50వ సినిమా కోసం చాలా విధాలుగా ఆలోచించా. ఎలాంటి సినిమా చేయాలీ? ఏ జానర్ చేయాలీ?.. ఇలా. అయితే మోహన్ బాబు గారు పట్టుబట్టి ఈ సినిమాను లైన్లో పెట్టేశారు. అలా అనుకోకుండా ఇదే 50వ సినిమా అయిపోయింది.
ప్రశ్న) దర్శకుడు శ్రీనివాస్ రెడ్డితో మరోసారి పనిచేయడం గురించి చెప్పండి?
స) శ్రీనివాస్ రెడ్డి గారు మంచి టైమింగ్ ఉన్న దర్శకుడు. ఈ సినిమాలో ఇంతమంది పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని అందరికీ ప్రాధాన్యం కల్పిస్తూ ఓ పకడ్బందీ సినిమాను సిద్ధ చేయడమంటే చాలా ఓపిక ఉండాలి. దర్శకుడిగా ఆయన ఈ సినిమాను అన్నివిధాలా జాగ్రత్తగా నడిపించారు. ఇప్పుడు ఆయన ఎఫర్ట్ అంతా సినిమా ఫైనల్ ఔట్‌పుట్‌లో కనిపిస్తోంది.
ప్రశ్న) ‘అల్లరి మొగుడు’ సినిమాకు ఇది సీక్వెలా?
స) కాదండీ. ఈ సినిమా ఓ మరాఠీ సినిమాకు రీమేక్. కామెడీకి ఎక్కడైనా ఎమోషన్ ఒక్కటే! అది కనెక్ట్ అవుతుందన్న నమ్మకంతోనే ఈ సినిమాను ఓకే చేశాం. ఇకపోతే, అల్లరి మొగుడు సినిమాలో మోహన్ బాబు గారికి ఇద్దరు భార్యలు ఉంటారు. ఆ పాత్రల్లో నటించిన రమ్య కృష్ణ, మీనా గార్లనే ఈ సినిమాకూ ఎంపిక చేశారు. ‘అల్లరి మొగుడు’ సినిమా వీరికి పిల్లలు పుట్టడంతో ముగుస్తుంది. అక్కణ్ణుంచి ఓ కథ మొదలైతే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ సినిమా చేశారు.
ప్రశ్న) ‘మామ మంచు అల్లుడు కంచు’ హైలైట్స్ ఏంటి?
స) ఇదో ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా. మామ, అల్లుళ్ళకు మధ్య జరిగే పలు ఆసక్తికర సన్నివేశాలతో హిలేరియస్‌గా సాగిపోయే సినిమా. ఫ్యామిలీ అంతా సరదాగా చూసి హాయిగా నవ్వుకునే సినిమా. మోహన్ బాబు గారిది, నాది.. మా ఇద్దరి కాంబినేషన్ ఈ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.
ప్రశ్న) ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించారు. ఎందుకని?
స) తగ్గించాలని అనుకొని చేసిందేమీ కాదు. సినిమాలు ఫెయిలైతే కొంచెం ఆలోచించుకొని చేయాలి కదా, అలా కొంత లేటైంది. అంతే. జేమ్స్‌బాండ్ తర్వాత మళ్ళీ వేగం పెంచా.
ప్రశ్న) మీ తదుపరి సినిమాలేంటి? సొంత బ్యానర్‌లో మళ్ళీ సినిమా ఎప్పుడు?
స) ప్రస్తుతం ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత మరో రెండు సినిమాలు డిస్కషన్‌లో ఉన్నాయి. ఇక మా సొంత బ్యానర్‌లో సినిమా చేయాలనే ఉంది. ‘బందిపోటు’తో మా బ్యానర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే సినిమాకు భిన్నమైన సినిమా ఇచ్చాం. అది ఫెయిలైంది. సో, మళ్ళీ మా బ్యానర్‌కు సరిపడే సినిమా ఇదీ అనిపిస్తే ఆ సినిమాను నిర్మించేస్తాం.