సమీక్ష : ఓ మై గాడ్ – ఓ గాడ్, సినిమా నాట్ గుడ్.!

సమీక్ష : ఓ మై గాడ్ – ఓ గాడ్, సినిమా నాట్ గుడ్.!

Published on Jan 9, 2016 6:20 PM IST
Oh My GOD review

విడుదల తేదీ : 08 జనవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : శ్రీ వాత్సవ్

నిర్మాత : వేణు ముక్కుపాటి

సంగీతం : రాజ్ కిరణ్, రోషన్ సాలూరి

నటీనటులు : తనీష్, మేఘ శ్రీ, పావని..


ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం తగ్గించిన యంగ్ హీరో తనీష్ బాగా గ్యాప్ తీసుకొని చేసిన హర్రర్ కామెడీ ‘ఓ మై గాడ్’. మేఘ శ్రీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీ వాత్సవ్ డైరెక్టర్. ఈ మధ్య కాలంలో బాగా సక్సెస్ అయిన ఫార్మాట్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే విజయ్(విజయ్), చిత్ర(పావని), ఫణి(ఫణి) కలిసి తన కంపెనీ కోసం ఒక టీం లీడర్ ని సెలక్ట్ చేస్తారు. అతనే మన హీరో ఆదిత్య(తనీష్). ఈ జాబు కోసం హైదరాబాద్ స్టేషన్ లో దిగిన ఆదిత్య స్టేషన్ లో ప్రేమికుడైన రోహిత్(ఆశిష్ గాంధీ) చేతిలో మోసపోయి బాధ పడుతూ ఉన్న మాలతి(మేఘశ్రీ)ని చూసి తనతో పాటు తీసుకెళ్తాడు. ఆ తర్వాత విజయ్, చిత్ర, ఫణి లతో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు ఆదిత్య, మాలతి. కట్ చేస్తే ఆ ఇంట్లో కొన్ని భయానక సంఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని తెలుసుకొని ఆ ఇల్లు వదిలి వెళ్లిపోవాలి అనుకున్న ఆదిత్యకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది.

ఆ ట్విస్ట్ తర్వాత ఒక గ్రూప్ దెయ్యాలు అతన్ని టార్గెట్ చేసాయని తెలుసుకుంటాడు. అలా టార్గెట్ చేసే అతన్ని ఆ ఇంటికి రప్పిస్తాయి. ఇంతకీ పైన చెప్పిన వారిలో దెయ్యాలుగా మారిన వారు ఎవరు? ఎందుకు ఆదిత్యనే టార్గెట్ చేసాయి? దెయ్యాల గురించి తెలిసిన తర్వాత ఆదిత్య ఏం చేసాడు.? అలాగే మాలతిని మోసం చేసిన రోహిత్ ఎవరు? తన ద్వారా మాలతికి కలిగిన సమస్యలను ఎలా సరిదిద్దాడు అన్నదే మీరు చూసి తెలుసుకోవాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్ :

హర్రర్ కామెడీ థ్రిల్లర్ జానర్లో రాసుకున్న సినిమానే ఈ ఓ మై గాడ్.. ఆ కారణంగా డైరెక్టర్ శ్రీ వాత్సవ్ కొన్ని హర్రర్, థ్రిల్లర్ మరియు కామెడీ సీన్స్ రాసుకున్నాడు. ఈ సీన్స్ కి సినిమాతో ఎంత వరకూ కనెక్షన్ ఉంది అనేది పక్కన పెట్టేస్తే.. సినిమాలో బాగున్నాయి అనిపించే సీన్స్ గురించి చెప్పుకుందాం. హీరో-హీరోయిన్ కలుసుకునే సీన్, చూడాలని ఉంది స్టైల్ లో హీరోయిన్ తన ప్రేమకథని హీరోకి చెప్పే సీన్ ఫన్నీగా ఉంటాయి. ఇక ఆఫీసులో మరియు స్టోర్ రూంలో విజయ్, పావని, ఫణిలపై షూట్ చేసిన హర్రర్ సీన్స్ తో పాటు ఇంటర్వల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. కానీ నేను చెప్పిన సీన్స్ కథ ప్రకారమే వస్తాయని ఆశించవద్దు. ఇక సెకండాఫ్ లో థ్రిల్లర్ కోసం లింక్ చేసిన కొన్ని పాయింట్స్ బానే అనిపిస్తాయి.

తనీష్ తనకిచ్చిన పాత్రలో బాగానే చేసాడు. కొన్ని కామిక్ సీన్స్ లో తన డైలాగ్ డెలివరీ బాగుంది. ఇక మేఘశ్రీ జస్ట్ ఓకే అనిపించింది. విజయ్, ఫణి, పావనిలు కొన్ని సీన్స్ లో నవ్విస్తే, కొన్ని సీన్స్ లో భయపెట్టడంలో సక్సెస్ అయ్యారు. ఇక నెగటివ్ షేడ్స్ చేసిన ఆశిష్ గాంధీ మెప్పిస్తే, మాంత్రికుడుగా చేసినతను మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.

మైనస్ పాయింట్స్ :

ఓ మై గాడ్ సినిమా కోసం శ్రీ వాత్సవ్ కొన్ని కొన్ని సీన్స్ మరియు థ్రిల్స్ ని బాగానే రాసుకున్నాడు.. కానీ అవి సీన్స్ పరంగా బాగున్నాయి.. కానీ ఒక కథగా అల్లుకునేటప్పుడు ఆ సీన్స్ ని పర్ఫెక్ట్ గా కథలో కలిసిపోయేలా చేయలేకపోయాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో చాలా చాలా సీన్స్ ఒరిజినల్ కథకి అస్సలు సంబంధం ఉండదు. చూసే ప్రేక్షకులలో సస్పెన్స్ ని క్రియేట్ చేయడం కోసం ఈ హర్రర్ సీన్స్ రాసుకున్నాడు, కానీ వాటివల్ల కథకి ఎలాంటి ఉపయోగం లేకపోగా, ఒరిజినల్ స్టొరీ లైన్ ని పక్కదారి పట్టించినట్లు అవుతుంది. అలా కథ రాసుకున్న శ్రీవాత్సవ్ కథనం కూడా కన్ఫ్యూజింగ్ గా రాసుకొని ఆడియన్స్ ని థ్రిల్ చేయాలనుకున్నాడు. కానీ తను క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్స్ చివరికి సిల్లీగా అనిపించడం కొన్నిటికి క్లారిటీ ఇవ్వకపోవడం వలన బోరింగ్ గా అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ లో కథకి సంబంధం లేకపోయినా కొన్ని సీన్స్, ఇంటర్వల్ వలన ఓకే అనిపిస్తుంది. కానీ ఇంటర్వల్ లో ఇచ్చిన ట్విస్ట్ తర్వాత కథని పక్కదారి పట్టించేసాడు. అందుకే సెకండాఫ్ ఎక్కడా ఎంగేజింగ్ గా అనిపించదు. డైరెక్టర్ ఒకే సినిమాలో కామెడీ, హర్రర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టాలనుకొని వాటిని సరిగా డీల్ చేయలేక సినిమాని కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయాడు. సినిమా చాలా స్లోగా ఉండడం వలన 113నిమిషాల సినిమానే అయినా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ లో హీరో – హీరోయిన్ డ్యూయెట్ అవసరం లేదు. అలాగే దెయ్యాలని చూపించిన తీరు అస్సలు నమ్మశక్యంగా లేదు, అలాగే క్లైమాక్స్ లో మాంత్రికుడిని ప్రేతాత్మ ఆవహించే సీన్ లో క్లారిటీ లేదు. అందుకే క్లైమాక్స్ బాగా డల్ అయిపొయింది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ టీంలో బాగా హెల్ప్ అయిన డిపార్ట్ మెంట్ అంటే రాజు తోట సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. ఆయన చూపిన విజువల్స్ డీసెంట్ గా అనిపిస్తాయి. రాజ్ కిరణ్ అందించిన సాంగ్స్ సినిమాకి పెద్ద హెల్ప్ కాలేదు, అలాగే రోషన్ సాలూరి అందించిన నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఓవరాల్ గా హర్రర్ థ్రిల్లర్ సినిమాకి బాగా హెల్ప్ అవ్వాల్సిన మ్యూజిక్ అనేది సినిమాకి హెల్ప్ అవ్వలేదు. ఉపేంద్ర ఎడిటింగ్ జస్ట్ యావరేజ్.. సెకండాఫ్ ని, కొన్ని అనవసర సీన్స్ ని కట్ చేసి పారేయాల్సింది.

కత – కథనం – మాటలు – దర్శకత్వం లాంటి మెయిన్ డిపార్ట్ మెంట్స్ ని సింగిల్ హ్యాండ్ తో డీల్ చేసాడు శ్రీవాత్సవ్.. కథ కోసం చేసిన ఆలోచన బాగుంది.. అదే హర్రర్, కామెడీ, థ్రిల్స్ ని ఒకే కథలో చెప్పడం కానీ వాటిని మిక్స్ చేసి కథని మాత్రం సరిగా రాసుకోలేకపోయాడు.. కథనం కూడా ఆసక్తికరంగా లేదు. మలుపులు చాలానే ఉన్నా ఆడియన్స్ ని థ్రిల్ చేసే సీన్ మాత్రం ఒక్క ఇంటర్వల్ బ్లాక్ మాత్రమే.. ఇక డైలాగ్స్ చెప్పుకోదగిన రీతిలో అయితే లేవు. ఇక దర్శకుడిగా చూసుకుంటే సెపరేట్ సెపరేట్ గా సీన్స్ బాగున్నాయి అనిపించే ఫీల్ తీసుకొచ్చినా ఒక సినిమాగా చూసుకున్నప్పుడు మాత్రం దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడు. వేణు ముక్కపాటి నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు :

తనీష్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన ‘ఓ మై గాడ్’ సినిమా కొన్ని చోట్ల పార్ట్స్ పార్ట్స్ గా బాగానే అనిపించినా సినిమాగా మాత్రం మెప్పించలేకపోయింది. డైరెక్టర్ శ్రీ వాత్సవ్ కొత్తగా ఉండాలనే ఫీల్ కోసం అన్ని జానర్స్ ని మిక్స్ చేసేసాడు, కానీ ఒకదానితో ఒకటి సింక్ చేయడంలో ఫెయిల్ అవ్వడంతో అక్కడక్కడా సీన్స్ పరంగా ఆకట్టుకోగలిగినా, 2 గంటల సినిమాగా మాత్రం ఆకట్టుకోలేక పోయాడు. సినిమాలో కొన్ని హర్రర్ సీన్స్, కొన్ని థ్రిల్స్ భలే ఉన్నాయే అనిపిస్తాయి తప్ప మిగతా ఏవీ మిమ్మల్ని మెప్పించవు. కొన్ని సీన్స్ బాగున్నా సినిమా చూసి ఎంజాయ్ చేయగలం అనుకునే వారు ‘ఓ మై గాడ్’ని చూడటానికి ట్రై చేయచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు