సమీక్ష : కృష్ణగాడి వీర ప్రేమ గాథ – ప్రేమ ఉంది, వీరత్వమూ ఉంది!

సమీక్ష : కృష్ణగాడి వీర ప్రేమ గాథ – ప్రేమ ఉంది, వీరత్వమూ ఉంది!

Published on Feb 13, 2016 8:20 PM IST
Kvpg review

విడుదల తేదీ : 12 ఫిబ్రవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం : హను రాఘవపూడి

నిర్మాత : రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

నటీనటులు : నాని, మెహ్రీన్..

న్యాచురల్ స్టార్ నాని, ‘అందాల రాక్షసి’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు హను రాఘవపూడిల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’. విడుదలకు ముందునుంచే అంతటా పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 14 రీల్స్ సంస్థ చేపట్టిన ప్రమోషన్స్, ట్రైలర్, ఆడియోతో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉందా? చూద్దాం..

కథ :

కృష్ణ (నాని)ది ఓ విచిత్రమైన ప్రేమకథ. చిన్నప్పట్నుంచే మహాలక్ష్మి (మెహ్రీన్)ని ప్రాణంగా భావించే కృష్ణ, ఆమెతో ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరికీ తప్ప ప్రపంచానికి ఆ ప్రేమ విషయాన్ని చెప్పలేని పరిస్థితుల్లో బతుకుతుంటాడు. ఇక ఇదిలా ఉంటే పగ, ప్రతీకారాలే తమ జీవిత ధ్యేయంగా బతికే అప్పిరెడ్డి, రాజన్నల మధ్య జరిగే ఫ్యాక్షన్ గొడవలు కృష్ణగాడి ప్రేమకథను తాకి అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి.

అసలు ఫ్యాక్షన్ గొడవలకు కృష్ణ ప్రేమకథకు సంబంధం ఏంటి? ఈ ఫ్యాక్షన్ గొడవలోకి మాఫియా డాన్ డేవిడ్ భాయ్ (మురళీ శర్మ) ఎందుకు వచ్చాడు? ఏసీపీ శ్రీకాంత్ (సంపత్ రాజ్) పిల్లల కిడ్నాప్ కథేంటి? ఆ పిల్లలను కాపాడేందుకు కృష్ణ ఏం చేశాడు? ఇన్ని అవాంతరాలను ఎదుర్కొని కృష్ణ తన ప్రేమను దక్కించుకోగలిగాడా? ఇన్ని వర్గాల మధ్యన జరిగే గొడవలో అతడి ప్రయాణం ఏయే మలుపులు తిరిగిందీ అన్నదే ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఒక లవ్‌స్టోరీని వీలైనంత కొత్తగా, కమర్షియల్ టచ్ ఇస్తూ చెప్పిన విధానం గురించి చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లో కృష్ణ, మహాలక్ష్మిల మధ్యన వచ్చే లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉంది. ప్రేమకథలో ఇలాంటి ఒక కొత్త యాంగిల్‌ను పరిచయం చేయడంతో పాటు, అందులో ఉన్న ఫన్‌ను సరిగ్గా పండించారు. ఇక ఒక ఊర్లో రెండు కుటుంబాల మధ్యన జరిగే ఫ్యాక్షన్ గొడవలు, ఈ గొడవకు పిల్లల కిడ్నాప్, మాఫియా కనెక్షన్, దానిచుట్టూ తిరిగే ఓ ప్రేమకథ.. ఇలా ఇన్ని అంశాలను మేళవిస్తూ ఒక కథ చెప్పిన విధానంలో పుట్టుకొచ్చే సహజత్వంగా సాగిపోయే ఫన్, అద్భుతమైన ఎమోషన్ లాంటివి ఫస్టాఫ్‌కు ఒక అందాన్ని, అర్థాన్ని తెచ్చిపెట్టాయి. సెకండాఫ్‌లో ముగ్గురు పిల్లలతో కలిసి హీరో పాత్ర చేసే ఓ ఎమోషనల్ జర్నీ బాగుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ అన్న టైటిల్ సినిమాకు మంచి అర్థాన్నిచ్చింది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ పార్ట్‌లో కమర్షియల్ అంశాలతో కథను నడిపిస్తూనే, చెప్పాలనుకున్న సెన్సిబుల్ పాయింట్‌ను దర్శకుడు సరిగ్గా చెప్పగలిగాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఎప్పట్లానే నాని తనదైన బ్రాండ్ యాక్టింగ్‌తో కట్టిపడేశాడు. ఎలాంటి డైలాగునైనా ఒక సెపరైట్ స్టైల్‌లో చెప్పడంలో దిట్ట అనిపించుకున్న నాని, యాక్టింగ్ పరంగా మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. కావాల్సినంత ఎంటర్‌టైనింగ్‌గా సాగుతూనే ఉండే అతడి క్యారెక్టర్‌లో ఉన్న ఎమోషన్‌ను కూడా అద్భుతంగా పండించాడు. ఇక ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన మెహ్రీన్.. అందం పరంగా, అభినయం పరంగా బాగా నటించింది. ముఖ్యంగా కొన్ని చోట్ల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ పలికించడంలో మెహ్రీన్ ప్రతిభను మెచ్చుకోవచ్చు. వీరిద్దరిదీ ఒక ఎత్తైతే కీలక పాత్రల్లో నటించిన ముగ్గురు చిన్నారులు బేబి నయన, మాస్టర్ ప్రదమ్, బేబి మోక్షలు కట్టిపడేశారు. నాని-సత్యం రాజేష్‌ల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పృథ్వీ రాజ్, మురళీ శర్మ.. ఇలా ప్రధాన పాత్రలంతా సినిమాకు మరింత బలాన్ని తెచ్చారు. క్యాస్టింగ్ పరంగా ఈ సినిమాకు వంక పెట్టలేం.

ఇక సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతూ బాగా ఆకట్టుకుంటుంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ట్విస్ట్‌లు చాలా బాగున్నాయి. సెకండాఫ్‌లో పిల్లలతో కలిసి నాని చేసే జర్నీ, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లలో ఎమోషన్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా అసలు కథనంతా ఫస్టాఫ్‌లోనే చెప్పేయడాన్ని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. అసలు కథంతా తెలిసిపోవడంతో సెకండాఫ్‌లో సినిమా మొత్తం, ముందే తెలిసిన ఒక సింగిల్ పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఈ పార్ట్‌లో ఆసక్తికరమైన కొన్ని సన్నివేశాలు సినిమాను బాగానే నడిపిస్తున్నాయనుకున్నా, కథ పరంగా చూస్తే, సినిమా ప్రీ క్లైమాక్స్ వరకూ అక్కడే తిరుగుతున్నట్లనిపించింది. ఇక ఫస్టాఫ్‌లో లెంగ్త్ చాలా ఎక్కువ అయిపోయింది. నిజానికి ప్రీ ఇంటర్వెల్‌కి ముందున్న ట్విస్ట్‌నే ఇంటర్వెల్‌గా మార్చేస్తే సినిమా ఎక్కడో ఉండేదనడంలో ఆశ్చర్యం లేదు. ఈ చిన్న విషయంలో శ్రద్ధ పెడితే బాగుండేది.

ఇక సెకండాఫ్‌లో వచ్చే రెండు పాటలూ అసందర్భంగా ఉండడమే కాక, సినిమా ఎమోషన్‌ను కూడా పక్కదారి పట్టించాయి. కొన్నిచోట్ల లాజిక్‌లకు అందకుండా కథ నడుస్తూ ఉండడాన్ని మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఒక సెన్సిబుల్ పాయింట్‌కు కమర్షియల్ టచ్ ఇచ్చే క్రమంలో కొన్ని చోట్ల అనవసరమైన సన్నివేశాలు ఎక్కువయ్యాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందు దర్శకుడు హను రాఘవపూడి గురించి చెప్పుకోవాలి. మొదటి సినిమా ‘అందాల రాక్షసి’తోనే దర్శకుడిగా తన సెన్సిబిలిటీ ఏంటనేది పరిచయం చేసిన హను, రెండో సినిమాకు వచ్చేసరికి ఆ సెన్సిబిలిటీని ప్రేక్షకుడికి సరిగ్గా చేర్చేందుకు ఏయే అంశాలు అవసరమో శ్రద్ధగా పేర్చుకున్నట్లు కనిపిస్తుంది. ఒక వినూత్నమైన ప్రేమకథకు చాలా అంశాలను, చిన్న చిన్న ఉపకథలను జోడించి ఒక ఫుల్ లెంగ్త్ కథగా మార్చడంలో రచయితగా బాగా సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఇలాంటి ఒక సెన్సిబుల్ పాయింట్‌ను ఇంత ఎంటర్‌టైనింగ్‌గా చెప్పొచ్చా అనేలా రచయితగా విజయం సాధించాడు. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకొంత జాగ్రత్త పడి, సెకండాఫ్‌పై శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది. దర్శకుడిగా హను రాఘవపూడి చాలాచోట్ల ప్రయోగాలు చేశాడు. ‘నువ్వంటే నా నవ్వు’ అనే పాటలో చేసిన ప్రయోగం దర్శకుడిగా హను ప్రతిభను చాటిచెప్పే ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ కేవలం ఆడియోగా వింటే, ఫర్వాలేదనిపిస్తే, సినిమాతో కలిపి చూసినప్పుడు ఫస్టాఫ్‌లోని పాటలన్నీ బాగున్నట్టు తోచాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చేసిన ప్రయోగం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీకి ఎక్కడా వంక పెట్టలేం. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఆర్ట్ డైరెక్షన్, పాటల్లో సాహిత్యం.. ఇలా టెక్నికల్‌గా అందరూ తమ వంతు న్యాయం చేశారు. ఎడిటింగ్ పరంగా మాత్రం మరింత జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. 14 రీల్స్ నిర్మాణ విలువలను అభినందించకుండా ఉండలేం.

తీర్పు :

‘భలే భలే మగాడివోయ్’ లాంటి ఊహించని స్థాయి హిట్ తర్వాత హీరోగా నాని ఇమేజ్ అమాంతం పెరిగింది. ఆ స్థాయి హిట్ తర్వాత నానికి కొత్తగా వచ్చిన స్టార్ స్టేటస్, వినూత్న ప్రమోషన్స్, మొదట్నుంచే పాజిటివ్ వైబ్రేషన్ ఉండడం, ట్రైలర్, ఆడియోలకు మంచి రెస్పాన్స్ రావడం.. ఇలాంటివన్నీ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు విపరీతమైన అంచనాలను తెచ్చిపెట్టాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండానే ఉన్న ఈ సినిమా నాని కెరీర్‌లో మరో ఎంటర్‌టైనింగ్ సినిమాగా నిలిచిందనే చెప్పొచ్చు. నాని అద్భుతమైన యాక్టింగ్, మూడు నాలుగు ఉపకథలతో కమర్షియల్ టచ్ ఇస్తూ చెప్పిన సెన్సిబుల్ ప్రేమకథ, ఎంటర్‌టైనింగ్ ఫస్టాఫ్, ప్రేమకథలో కొత్త యాంగిల్ లాంటివన్నీ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. ఇకపోతే ఫస్టాఫ్‌లో లెంగ్త్ ఎక్కువైపోవడం, సెకండాఫ్‌లో చిన్న ట్విస్ట్ కూడా లేకుండా అసలు కథంతా ఫస్టాఫ్‌లోనే చెప్పేయడం లాంటివి మైనస్‌లుగా చెప్పొచ్చు. ఇక ఈ రెండు మైనస్‌లను పక్కబెడితే.. కృష్ణగాడు, చెప్పినట్టే తన ప్రేమ గాథతో మంత్రముగ్ధుల్ని చేసేంతలా కాకపోయినా, ఆ స్థాయికి తగ్గరీతిలో మెప్పించడంలో మాత్రం సక్సెస్ సాధించాడనే చెప్పొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు