విడుదల తేదీ : 19 ఫిబ్రవరి 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : వాసు వర్మ
నిర్మాత : దిల్‌రాజు
సంగీతం : దినేష్
నటీనటులు : సునీల్, నిక్కీ గల్రాని, డింపుల్ చోపాడే
కమెడియన్‌గా సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్న సునీల్, ఆ తర్వాత హీరోగానూ తనదైన మార్క్ సెట్ చేసుకుంటూ వెళుతోన్న విషయం తెలిసిందే. ‘భీమవరం బుల్లోడు’ తర్వాత రెండేళ్ళకు ఆయన తన కొత్త సినిమా ‘కృష్ణాష్టమి’తో మెప్పించేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు ‘జోష్’తో పరిచయమైన వాసువర్మ దర్శకత్వం వహించారు. మరి ఈ ‘కృష్ణాష్టమి’ ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..
కథ :
కృష్ణ వర ప్రసాద్ (సునీల్) అమెరికాలో సొంతంగా గేమింగ్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తుంటాడు. తనకెంతో ఇష్టమైన సొంత దేశం ఇండియాను చూడాలని ఎప్పుడూ కలలు గనే కృష్ణను అతడి పెదనాన్న (ముఖేష్ రుషి) మాత్రం ఇండియాకు రాకుండా చేస్తూంటాడు. ఇదే క్రమంలో తన కలను ఎలాగైనా నిజం చేసుకోవాలనుకున్న కృష్ణ, ఎవ్వరికీ చెప్పకుండా ఇండియాకు ప్రయాణమవుతాడు. ఈ ప్రయాణంలోనే అతడు పల్లవి (నిక్కీ గల్రాని) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు.
కాగా కృష్ణ ఇండియాలో దిగగానే అతడి జీవితం మొత్తం మారిపోతుంది. అనుకోకుండా అతడు చిత్తూరు జిల్లాలోని ఓ ఊర్లో ఒక ఫ్యాక్షన్ కుటుంబానికి అల్లుడిగా నటించాల్సి వస్తుంది. అసలు కృష్ణ ఇండియాకు రాకుండా అతడి పెదనాన్న ఎప్పుడూ ఎందుకు ఆపుతుంటాడు? చిత్తూరులోని ఫ్యాక్షన్ కుటుంబానికి కృష్ణకు ఉన్న సంబంధం ఏంటి? పల్లవితో కృష్ణ ప్రేమ ఎటువైపు దారి తీస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే మొదట్నుంచీ చివరివరకూ ఎక్కడా మారకుండా ఉన్న ఒక ఫ్యామిలీ ఎమోషన్ గురించి చెప్పుకోవచ్చు. కృష్ణ, తన కుటుంబంతో గడపాలని 18 సంవత్సరాలుగా ఎదురుచూస్తూండడం, అతడి పెద్దమ్మతో పాటు ఆ కుటుంబం కూడా కృష్ణను చూడాలనుకోవడం, ఈ మధ్యలో చిన్న ట్విస్ట్.. ఇలాంటి నేపథ్యంలో నడిచే ఫ్యామిలీ ఎమోషన హైలైట్‍గా చెప్పుకోవచ్చు. ఇక అక్కడక్కడా కొన్ని చోట్ల కథతో పాటే వచ్చే కొంత కామెడీ, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయి. పాటల్లో లొకేషన్స్ మంచి రిలీఫ్. సినిమా ఫ్లో పరంగా చూసుకుంటే ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఎపిసోడ్స్ మేజర్ హైలైట్స్. సెకండాఫ్‌లో క్లైమాక్స్‌లో వచ్చే ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఒక ఛేజింగ్ సీన్ మేకింగ్ పరంగా సినిమాకు హైలైట్. బ్రహ్మానందం-ఆశుతోష్ రానాల మధ్యన వచ్చే సన్నివేశమొకటి బాగా నవ్విస్తుంది. అజయ్-అతడి కుమారుడి నేపథ్యంలోని చిన్ని ఉపకథ బాగుంది.
నటీనటుల ప్రస్తావనకు వస్తే.. హీరో సునీల్ పూర్తి స్థాయి హీరోగా బాగానే చేశాడు. కొన్ని ప్రధాన సన్నివేశాల్లో కూడా కళ్ళద్దాలు పెట్టుకోవడం, క్లోజప్ షాట్స్ చాలా తక్కువ ఉండడం లాంటివి సునీల్ ఈ సినిమాలో పెద్దగా చేసిందేమీ లేదన్న ఫీలింగ్ తెప్పించాయి. కామెడీ టైమింగ్, డ్యాన్సుల్లో సునీల్ తన మార్క్ చూపెట్టాడు. నిక్కీ గల్రాని, డింపుల్ చోపాడే.. ఇద్దరూ హీరోయిన్లూ వీలైనంత అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటారు. నటన పరంగా నిక్కీ గల్రాని ఫర్వాలేదు. ఇక అశుతోష్ రానా, ముఖేష్ రుషి, తులసి, సప్తగిరి తదితరులు బాగా చేశారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే తెలుగు సినిమాల్లో చాలాకాలంగా చూస్తూ వస్తోన్న పరమ రొటీన్ ఫార్ములా కథలో చిన్న ఫ్యామిలీ ఎమోషన్, కొద్దిగా కామెడీ, కొద్దిగా రొమాన్స్ పండిస్తే సరిపోతుందన్నట్లు రాసుకున్న కథ, కథనాల గురించే చెప్పుకోవాలి. ఫార్ములాలు చాలా సార్లే ఆకట్టుకున్నా, ఈ ఫార్ములాలో అంతటా అతి ఎక్కువైంది. ఎక్కడా ఎమోషన్‌కు ఒక అర్థమంటూ లేదు. విలన్ పగ, హీరో ప్రేమ, రెండో హీరోయిన్ క్యారెక్టర్.. ఇలా సినిమాలో ప్రధానమైన అంశాలన్నీ చాలా సిల్లీగా కనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో వరుసగా పాటలు వస్తూ, పోతూ విసుగు తెప్పిస్తాయి. అమెరికా నేపథ్యంలో నడిచే మొదటి పావుగంట, యూరప్‌లో హీరో-హీరోయిన్‌ల లవ్ ట్రాక్ ఇవన్నీ మరీ ఓవర్‌గా ఉన్నాయి.
ఇక హీరో విలన్ ఇంట్లోకే వెళ్ళిపోయి, వాళ్ళతో సరదా చేస్తూ చివరకు అందర్నీ మంచి వాళ్ళుగా మార్చడమన్న కాన్సెప్ట్‌ను ఈ సినిమాలోనూ వాడారు. ఈ పార్ట్‌లో ఎక్కడైతే డ్రామా సరిగ్గా పండాలో అదే ఈ సినిమాలో జరగలేదు. సెకండాఫ్‌లో సన్నివేశాలన్నీ కథ పరంగా కాకుండా అలా అలా పేర్చుకు పోయినట్లు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కమర్షియల్ హంగులను నింపుకుంటూ నడిచే సినిమాలో ఎక్కడా లాజిక్ అన్నదే లేదు. కమర్షియల్ సినిమా అనుకొని కొన్ని చిన్న లాజిక్‌లను పక్కనబెట్టినా, సినిమాలో ప్రధానమైన ఉపకథలన్నింటినీ అసలు కథకు కలిపే విధానంలో లాజిక్ అన్నదే కరువైంది. ఇక ఇద్దరు హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ చూస్తే, హీరోయిన్ పాత్రకు కనీస వ్యాల్యూ ఇవ్వకపోవడమనే అంశమే ఆలోచనలో పడేస్తుంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ పనితనాన్ని మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఛోటా కె. నాయుడు తన మ్యాజిక్‌తో కట్టిపడేశాడు. యూరప్, అమెరికాల్లోని అందమైన లొకేషన్స్‌ను మరింత అందంగా చూపించడంతో పాటు సెకండాఫ్‌లో సినిమా ఎమోషన్‌కు తగ్గ మూడ్‌ను క్యాప్చర్ చేయడంలో ఛోటా ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. అన్నింటికీ మించి కారు ఛేజింగ్ సీక్వెన్స్‌లో ఛోటా చేసిన ప్రయోగం చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు దినేష్ అందించిన పాటల్లో రెండు వినడానికి బాగున్నాయి. మిగతావన్నీ రొటీన్‌గా, పెద్దగా ఆకట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం పరంగానూ పెద్దగా చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు.
ఇక దర్శకుడు వాసువర్మ గురించి చెప్పుకుంటే, ప్రొడక్షన్ టీమ్‌తో కలిసి ఆయన రాసుకున్న అసలు కథలోని బేసిక్ ఎమోషన్ బాగున్నా, పూర్తి కథగా అందులో ఎక్కడా విషయం లేదు. ఇక దానికి వాసువర్మ రాసుకున్న స్క్రీన్‌ప్లే కూడా సాదాసీదాగా తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్‌లో ఉంది. దర్శకుడిగా వాసు వర్మ పెద్దగా ప్రతిభ ఏమీ చూపలేదు. తెలిసిన కథనే, తెలిసిన స్క్రీన్‌ప్లేతో, సాదాసీదా మేకింగ్‌తో కలిపి దర్శకత్వం పరంగా కేవలం ఫర్వాలేదనిపిస్తాడు. ఇక ఎడిటింగ్ పరంగానూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. దిల్‌రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎప్పట్లానే చాలా బాగున్నాయి. సినిమా పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాని విధానం చాలా చోట్ల కనిపిస్తుంది.
తీర్పు :
కమెడియన్‌గా స్టార్‌డమ్ తెచ్చుకున్న సునీల్, హీరోగానూ అదే స్టార్‌డమ్ సంపాదించుకునే దిశగా కొద్దికాలం గ్యాప్ తీసుకొని మరీ ‘కృష్ణాష్టమి’ అన్న సినిమాతో వచ్చేశాడు. ఇక ఒక స్టార్ హీరో అంటే కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్.. ఇలా అన్నీ పండించాలన్న పరిస్థితుల మధ్యన స్టార్ హీరో మార్క్ కోసం సునీల్ చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘కృష్ణాష్టమి’. అయితే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో అసలు కథే రొటీన్ అవ్వడం, ఎందుకొస్తున్నాయో తెలియని పాటలు, లాజిక్ లేని సిల్లీ సన్నివేశాల్లాంటి చాలా మైనస్‌లున్నాయి. ఇక మెప్పించే అంశాలేవైనా ఉన్నాయాంటే.. అక్కడక్కడా నవ్వించే కామెడీ, సునీల్ టైమింగ్, ఫ్యామిలీ ఎమోషన్. రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ లాంటి అంశాలను ప్రస్తావించుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. స్టార్ హీరో అయ్యే ఆలోచనతో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేసే ప్రయత్నంలో సునీల్‌తో పాటు ‘కృష్ణాష్టమి’ టీమ్ మొత్తం అసలు ‘కమర్షియల్’ అనే విషయాన్ని పక్కదారి పట్టించింది. సినిమా చూసొచ్చాక ఎటూకాని ఓ ఫీలింగ్ ఉందంటే అది ఈ సినిమా తెచ్చిందే!
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం