సమీక్ష : శౌర్య – స్లో కానీ థ్రిల్ చేస్తుంది.!

సమీక్ష : శౌర్య – స్లో కానీ థ్రిల్ చేస్తుంది.!

Published on Mar 4, 2016 1:18 PM IST
Shourya review

విడుదల తేదీ : 04 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : దశరథ్

నిర్మాత : మల్కాపురం శివకుమార్

సంగీతం : కె. వేద

నటీనటులు : మంచు మనోజ్, రెజీన కసాండ్ర..


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ హీరోగా కుటుంబ కథా చిత్రాల దర్శకుడు దశరథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘శౌర్య’. ఒక ప్రేమకథకి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ని మిక్స్ చేసి చేసిన ఈ సినిమాలో రెజీన కసాండ్ర హీరోయిన్. ‘సూర్య vs సూర్య’ తర్వాత మల్కాపురం శివకుమార్ నిర్మించిన సరికొత్త థ్రిల్లర్ ఎంత వరకూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేసింది అనేది చూద్దాం..

కథ :
ఈ చిత్ర టీం ముందు నుంచి ప్రమోట్ చేస్తున్నట్టు.. ‘జరిగిన ప్రతి సంఘటన వెనుక మూడు కథలుంటాయి.. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసినవాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగేది’ అనే కాన్సెప్ట్ చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. ఇక అసలు కథలోకి వెళితే.. శౌర్య(మంచు మనోజ్) – నేత్ర(రెజీన కసాండ్ర) ప్రేమించుకుంటారు. కానీ ఎప్పటిలానే పెద్దల నుంచి సమస్య రావడంతో పారిపోవాలని డిసైడ్ అయ్యి, దేశం వదిలి వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంటారు.

ఎలాగో దేశం వదిలి వెళ్ళిపోతున్నాం కదా అని చివరి రోజు శివరాత్రి కావడం వలన శివాలయంలో జాగారం చేయడానికి వస్తారు. కట్ చేస్తే నేత్రని చంపడానికి అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ లో దాదాపు ప్రాణాలు కోల్పోయే స్టేజ్ కి వెళ్ళిన నేత్రని హాస్పిటల్ లో చేర్చి, శౌర్యని ముద్దాయిగా జైల్లో వేస్తారు. ఆ కేసు డీల్ చేయడానికి కృష్ణ ప్రసాద్(ప్రకాష్ రాజ్) రంగంలోకి దిగితాడు. అక్కడే శౌర్య ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ ఏంటి? అక్కడి నుంచి కథ ఎలా మలుపులు తిరిగింది? ప్రేమించిన శౌర్యనే నేత్రని చంపాలనుకున్నాడా? లేక ఇంకెవరన్నా చంపాలనుకున్నారా? ఫైనల్ గా నేత్ర బతికిందా లేదా అన్నదే మిగిలిన థ్రిల్ చేసే కథ.

ప్లస్ పాయింట్స్ :

ఎప్పుడు కుటుంబ కథా చిత్రాలే తీస్తాడు అనే ముద్ర ఉన్న దశరథ్ ఈ సారి ప్రేమకథకి ఒక థ్రిల్లింగ్ పాయింట్ ని జత చేసి రాసుకున్న స్టొరీ లైన్ చాలా బాగుంది. ఇక సినిమాని ఒక సస్పెన్స్ తో మొదలు పెట్టి ఆడియన్స్ లో ఆసక్తిని పెంచడం బాగుంది. మనోజ్ రివీల్ చేసే ఇంటర్వెల్ ట్విస్ట్ అందరినీ థ్రిల్ చేసి, సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్ లో చివరి గా వచ్చే 30 నిమిషాలు సినిమాకి ఆయువుపట్టు అని చెప్పాలి. ఎందుకంటే చివరి 30 నిమిషాల్లో మొదటి నుంచి దాచి పెట్టిన ట్విస్ట్ లన్నిటినీ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తుంటారు. అలా థ్రిల్స్ మీద థ్రిల్స్ ఇస్తూ సినిమాని ముగించడం మస్త్ అనిపిస్తుంది. మంచు మనోజ్ – ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే కోర్టు సీన్ మరియు అక్కడ చెప్పే పులి కథ బాగుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే..మంచు మనోజ్ చూడటానికి బాగా బొద్దుగా, అమాయకుడిగా కనిపిస్తాడు. అమాయకంగా కనిపిస్తూ, ఇంటర్వెల్ లో తనలోని ఇంకో షెడ్ ని రివీల్ చేసే సీన్ మరియు అందులో మనోజ్ పెర్ఫార్మన్స్ సూపర్బ్. మనోజ్ ఎంచుకున్న పాత్రకి పూర్తి జస్టిఫికేషన్ చేసాడు. రెజీన ఈ సినిమాలో గ్లామర్ అనేది లేకుండా, చాలా హోమ్లీ లుక్ లో కనిపిస్తుంది. అలాగే నటనకు ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర కావడంతో తన నటనతో కథకి న్యాయం చేసింది. ఇక సినిమాలో కీలక పాత్ర చేసిన ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ గా అన్ని షేడ్స్ ని పర్ఫెక్ట్ గా చేసాడు. వీరు కాకుండా సాయాజీ షిండే, నాగినీడు, సుబ్బరాజులు తమ నటనతో సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చారు. ప్రభాస్ శ్రీను ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా బాగానే నవ్వించారు.

మైనస్ పాయింట్స్ :

లవ్ స్టొరీ విత్ థ్రిల్లర్ అనేది మన తెలుగు వారికి కాస్త కొత్తదైన జానర్.. ఈ జానర్ ని డీల్ చేయడం అంత ఆశా మాషీ కాదు. కానీ దశరథ్ ట్రై చేసారు, కానీ సక్సెస్ కాలేకపోయారు అనే చెప్పాలి. ఎందుకంటే లవ్, థ్రిల్స్ రెండు మిక్స్ చేయాలనే ఆలోచనలో చివర్లో వచ్చే థ్రిల్స్ బాగా రాసుకున్నారు, కానీ మిగతా పార్ట్ ని సరిగా రాసుకోలేదు. అందుకే సినిమా చాలా వరకూ బాగా బోరింగ్ గా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్. చాలా నిదానంగా సాగుతుంది. కథ అస్సలు ముందుకెల్లదు. మెయిన్ గా ప్రతి సినిమాలోనూ ఎఫ్ఫెక్టివ్ గా లవ్ ట్రాక్ రాసుకునే దశరథ్ ఈ సినిమాలో రాసుకోలేకపోయాడు. అందుకే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్. సెకండాఫ్ స్టార్టింగ్ కూడా అదేలా బోరింగ్ గా ఉంటుంది.

ఇక ఈ సినిమాలో పాటలు సినిమాకి అస్సలు సెట్ అవ్వలేదు. మెయిన్ గా సెకండాఫ్ లో వచ్చే పాటలు సినిమా నిడివిని మరింత పెంచేస్తాయి. అందుకే సినిమా ఉన్నది రెండు గంటలే అయినా ఏదో నాలుగు గంటలు చూసిన ఫీలింగ్ వస్తుంది. మెయిన్ గా దశరథ్ సినిమాలో ఉండే ఎమోషన్స్ కూడా ఇందులో మిస్ అయ్యాయి. అలాగే రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలు లేదు. డైరెక్టర్ మనోజ్ లాంటి ఎనర్జిటిక్ హీరోని తీసుకొని ఇంత సైలెంట్ పాత్ర రాసుకోవడం, అది సరిగా జనాలకి రీచ్ కాకపోవడం మరో మైనస్.

సాంకేతిక విభాగం :

మొదట మనకు తెరపై కనిపించే విజువల్స్ నుంచి మొదలు పెడితే.. మల్హర్ భట్ జోషి అందించిన విజువల్స్ సినిమాకి తగ్గట్టుగానే డీసెంట్ గా ఉన్నాయి. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కె. వేదకి మొదటి సినిమా అయినా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు రెండు బాగుంటే, మిగతావి క్యాచీగా లేవు. నేపధ్య సంగీతంతో సినిమాకి కాసింత హెల్ప్ చేసాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి ఇచ్చిన మ్యూజిక్ బిట్స్ బాగున్నాయి. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ సినిమా ఎండ్ లో బాగుంది, కానీ మిగతా సినిమా మాత్రం చాలా బోరింగ్ గా ఉండేలా ఎడిట్ చేసారు. ఆర్ట్ వర్క్ బాగుంది. హరి – కిషోర్ గోపు డైలాగ్స్ జస్ట్ ఓకే.

శౌర్య సినిమాకి కెప్టెన్ అయిన దశరథ్ విషయానికి వస్తే… ఎందుకున్న స్టొరీ లైన్ బాగుంది, కానీ డెవలప్ చేసుకున్న కథ బాలేదు. దాంతో దానికి రచనా సహకారం అందించిన గోపి మోహన్ కూడా సినిమాని పెద్ద బెటర్ ప్రాజెక్ట్ గా మార్చలేకపోయాడు. ఇక కిషోర్ గోపు రాసిన స్క్రీన్ ప్లే అయితే మరీ బోరింగ్ అండ్ స్లో గా నత్త నడకలా ఉండడంతో సినిమా బోరింగ్ రైడ్ అయ్యింది. కథ – కథనం ఇలా ఉన్నా దశరథ్ ఆన్ స్క్రీన్ మేజిక్ చేయగలిగి ఉంటే బాగుండేది. కానీ మేజిక్ చేయలేకపోయాడు. మెయిన్ గా ఆయన బెస్ట్ గా చూపించే ఎమోషన్స్ నే పర్ఫెక్ట్ గా చూపించలేకపోయాడు, కానీ మొదటి సారైనా థ్రిల్స్ ని మాత్రం బాగానే చూపించాడు. మల్కాపురం శివకుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

మంచు మనోజ్ – దశరథ్ కాంబినేషన్ లో వచ్చిన థ్రిల్లింగ్ లవ్ స్టొరీ ‘శౌర్య’ సినిమా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని చివర్లో తన థ్రిల్స్ తో మెప్పించింది కానీ లవ్ స్టొరీ మాత్రం మెప్పించలేకపోయింది. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి అంటే దశరథ్ లవ్ స్టొరీ – థ్రిల్లర్ ని రెండూ మిక్స్ చేయాలనీ ట్రై చేసి, పూర్తిగా రెండింటిని జస్టిఫై చేయకపోవడమే. చివరి 30 నిమిషాలు చాలా థ్రిల్లింగ్ గా ఉండడం, సినిమా స్టార్టప్, మనోజ్ – రెజీనల పెర్ఫార్మన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయితే.. బోరింగ్ ఫస్ట్ హాఫ్, వీక్ స్క్రీన్ ప్లే, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం మేజర్ మైనస్ పాయింట్స్. ఎంటర్టైన్మెంట్ కాకుండా కాస్త స్లోగా నడిచే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు చూడదగిన సినిమా ‘శౌర్య’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు