ఆడియో సమీక్ష : సరైనోడు – అంచనాల్ని అందుకున్నాడు!

ఆడియో సమీక్ష : సరైనోడు – అంచనాల్ని అందుకున్నాడు!

Published on Apr 2, 2016 12:57 PM IST

sarainodu
‘సరైనోడు’.. అల్లు అర్జున్‌ను పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేసే సినిమాగా ప్రచారం పొందుతోన్న సినిమా. మాస్ డైరెక్టర్ భోయపాటి శీను తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియో కోసం ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తుండగా నేడు ఈ ఆడియో మార్కెట్లోకి వచ్చేసింది. బన్నీ-థమన్‌ల కాంబినేషన్‌లో ఇప్పటికే రేసుగుర్రం లాంటి సూపర్ హిట్ ఆల్బమ్ రాగా, ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఆడియో ఆ స్థాయిని అందుకునేలా ఉందా? చూద్దాం..

Athiloka-Sundari1. పాట : అతిలోక సుందరి
గాయనీ గాయకులూ : విశాల్ దడ్లాని, కార్తిక్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

‘అతిలోక సుందరి.. అతిలోక సుందరీ’ అంటూ మొదలయ్యే ఈ పాటలో పాడించే విధానంలో కొత్తదనం చూపించి థమన్ ప్రయోగం చేశారు. విశాల్ దడ్లాని, కార్తిక్ ఈ పాటకు కావాల్సిన ఫీల్‍ను బాగా క్యారీ చేశారు. ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో థమన్ అక్కడక్కడా కొన్ని ప్రయోగాలు చేసినా, ఎక్కువగా తనకు బాగా అలవాటైన ఇన్స్ట్రుమెంట్స్‌నే నమ్ముకున్నాడు. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కూడా బాగుంది. గుర్తుంచుకోదగ్గ పాటగా కాకపోయినా, వినడానికి, సినిమాతో కలిపి చూడడానికి బాగానే ఉందనిపించే పాటగా దీన్ని చెప్పుకోవచ్చు.

MLA2. పాట : యూ ఆర్ మై ఎమ్‍ఎల్‍ఏ
గాయనీ గాయకులూ : ధనుంజయ్
సాహిత్యం : అనంత శ్రీరామ్

యూ ఆర్ మై ఎమ్‍ ఎమ్‍ఎల్‍ఏ అంటూ సాగే ఈ ఫన్ పాట వినగానే ఎక్కేసే ట్యూన్‍, సింగింగ్‍తో ఆకట్టుకుంటుంది. ధనుంజయ్ ఈ పాటను పాడిన విధానం పాటకు మంచి ఫన్ ఫీల్ తెచ్చిపెట్టింది. కొన్ని టీజింగ్ అంశాలను నింపుకొని అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ కూడా బాగున్నాయి. థమన్ ట్యూన్ కూడా వినగా వినగా ఎక్కేసేలా ఉంది. సినిమాలో సందర్భంతో కలిపి చూసినప్పుడు ఈ పాట స్థాయి వేరేలా ఉంటుందని ఊహించొచ్చు. మధ్య మధ్యలో ఇన్స్ట్రుమెంట్స్‍తో థమన్ చేసిన ప్రయోగం బాగుంది.

party3. పాట : ప్రైవేట్ పార్టీ
గాయనీ గాయకులూ : ఎం.సీ.విక్కీ, ఎమ్.ఎమ్.మనసి
సాహిత్యం : కృష్ణ చైతన్య

ప్రైవేట్ పార్టీ అంటూ వచ్చే ఈ పాటలో కొత్తదనమేమీ లేదు. ఇప్పటివరకూ విని ఉన్న పార్టీ సాంగ్ తరహాలోనే సాగిపోతుంది. కృష్ణ చైతన్య సాహిత్యం కూడా ఆ పార్టీ సాంగ్ అన్న మూడ్‍కి తగ్గట్టే ఫర్వాలేదనిపించేలా ఉంది. విక్కీ, మనసిల సింగింగ్‍ను ఈ పాటకు హైలైట్‍గా చెప్పుకోవచ్చు. థమన్ ఈ పాటలో పెద్దగా చేసిందేమీ లేదు. విజువల్స్ కలిపి చూసి ఎంజాయ్ చేయదగ్గ పాట ఇది. ఆల్బమ్‍లో పెద్దగా చెప్పుకోవడానికి ప్రత్యేకత ఏమీ లేని పాటగా దీన్ని చెప్పుకోవచ్చు.

telusa4. పాట : తెలుసా.. తెలుసా..
గాయనీ గాయకులూ : జుబిన్ నౌతియాల్, సమీరా భరద్వాజ్
సాహిత్యం : శ్రీమణి

తెలుసా.. తెలుసా.. అంటూ సాగే ఈ పాటను ఈ ఆల్బమ్‌లో హైలైట్‍గా చెప్పుకోవచ్చు. కూల్‌గా సాగిపోయే ట్యూన్‍కి అదేస్థాయిలో పాడిన విధానం కలుపుకొని ఈ పాటకు మంచి ఫీల్ తెచ్చిపెట్టాయి. శ్రీమణి అందించిన సాహిత్యం కూడా పాటకు తగ్గట్టుగా చాలాబాగుంది. వినగానే ఎక్కేసే ఈ పాట వినగా వినగా స్థాయి పెంచుకుంటూ బాగా దగ్గరవుతుందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడా కీ బోర్డ్, ఫ్లూట్‍తో థమన్ చేసిన ప్రయోగాలు బాగా ఆకట్టుకుంటాయి. ఇక అందమైన విజువల్స్‌తో కలుపుకొని చూస్తే ఈ పాట స్థాయి మరింత పెరిగిపోతుందని చెప్పొచ్చు.

Block buster5. పాట : బ్లాక్‌బస్టర్
గాయనీ గాయకులూ : శ్రేయా ఘోషల్, నకాశ్ అజీజ్, సింహా, శ్రీ కృష్ణ, దీపు..
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

‘బ్లాకుబష్టరూ.. బ్లాక్‌బష్టరే..’ అంటూ వచ్చే ఈ మాస్ స్పెషల్ సాంగ్ సరైనోడుకి ఊపు తెచ్చే పాటగా చెప్పుకోవచ్చు. థమన్ ఈ పాట కోసం పెద్దగా ప్రయోగాలేవీ చేయకుండా ట్యూన్ పరంగానూ కొత్తదనం ఏమీ చూపకుండా సేఫ్ గేమ్ ఆడేశారు. సిలకలూరు సింతామణి అన్న సాకీతో మొదలయ్యే ఈ పాటలో థమన్ వాడిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఓ ఫుల్ ఆన్ మాస్ పాటకు కావాల్సిన ఫీల్ కోసమే ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ఇక థమన్ బీట్స్‍కి శ్రేయా ఘోషల్, నకాశ్ అజీజ్, సింహా, శ్రీ కృష్ణ, దీపుల గానం కూడా మంచి ఊపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా శ్రేయా ఘోషల్ వాయిస్‍లో ఈ పాట వినడం బాగుంది. రామ జోగయ్యశాస్త్రి అందించిన సాహిత్యం కూడా మాస్ పాట ఫీల్‍కి తగ్గట్టుగా ఉంది. బన్నీ డ్యాన్సులతో కలిపి చూస్తే ఈ పాట స్థాయి వేరే రేంజ్‍లో ఉంటుందని ఊహించొచ్చు. ముఖ్యంగా ఆ చివరి నిమిషం బీట్ ఫ్యాన్స్‍కి పండగే!

Sarrainodu6. పాట : సరైనోడు
గాయనీ గాయకులూ : హర్ద్ కౌర్, బ్రిజేష్ శౌండిల్య, సోను కక్కర్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

సరైనోడు అంటూ సాగిపోయే ఈ పాట సినిమాలో వచ్చే మరో మాస్ పాటగా చెప్పుకోవచ్చు. థమన్ ట్యూన్, రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అన్నీ ఆ మాస్ ఫీల్‍కి తగ్గట్టే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ట్యూన్ అంతా రేసుగుర్రం సినిమాలోని సినిమా చూపిస్త మావా పాటను తలపించేలా ఉంది. థమన్ తనకు అలవాటైన ఇన్స్ట్రుమెంట్స్‍నే వాడుతూ ఈ పాట విషయంలోనూ సేఫ్ గేమ్‍నే ప్లే చేశారు. పాటగా పెద్దగా చెప్పుకునేంత స్థాయేదీ ఈ పాటలో లేకపోయినా, సినిమాలో, విజువల్స్‌తో కలిపి చూస్తే ఓకే అనిపించే పాటగా దీన్ని చూడొచ్చు.

తీర్పు :

కొద్దికాలంగా ఏ స్టార్ హీరో సినిమాకు సంబంధించిన ఆడియో చూసినా, సంగీత దర్శకులంతా సేఫ్ గేమ్‍నే ప్లే చేస్తూండడం చూస్తూనే ఉన్నాం. తాము ఎలాంటి మ్యూజిక్ ఇవ్వడంలో ప్రత్యేకత తెచ్చుకున్నారో అందుకు కొంచెం కూడా దూరం జరగకుండా అదే పంథాలో ఓ సేఫ్ ఆల్బమ్‍ను రెడీ చేసేస్తున్నారు. సరైనోడు కూడా అదే కోవలో వచ్చిన మరో సేఫ్ ఆల్బమ్. టిపికల్ థమన్ స్టైల్లో సాగిపోయే ఈ సినిమా ఆడియోలో ‘తెలుసా.. తెలుసా’, ‘బ్లాక్‍బస్టర్’, ‘యూ ఆర్ మై ఎమ్‍ఎల్‍ఏ’ పాటలను వినగానే ఎక్కేసేవిగా, ఈ ఆల్బమ్‍కి హైలైట్‍గా చెప్పుకోవచ్చు. ఇక పార్టీ సాంగ్, సరైనోడు మాస్ సాంగ్ విషయాల్లో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. అతిలోక సుందరి కూడా విజువల్స్‍తో కలిపి ఆనందించదగ్గ పాట మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ సమ్మర్‍కి రానున్న క్రేజీ సినిమాల్లో ఒకటైన ‘సరైనోడు’ ఆడియోపై మొదట్నుంచీ ఉన్న క్రేజ్‍ను అందుకునేలానే ఉన్న ఈ ఆడియో టిపికల్ థమన్ స్టైల్లో సాగిపోతూ ఒక ఫుల్ ఆన్ మాస్ సినిమాకు ఏయే పాటలైతే అవసరమో వాటన్నింటినీ నింపుకొని మనముందుకు వచ్చింది మెప్పించిందనే చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు