సమీక్ష : ఈడో రకం.. ఆడో రకం – నవ్వులు పూయించే కన్ఫ్యూజన్‌

సమీక్ష : ఈడో రకం.. ఆడో రకం – నవ్వులు పూయించే కన్ఫ్యూజన్‌

Published on Apr 16, 2016 10:22 AM IST
Eedo Rakam Aado Rakam review

విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : జి. నాగేశ్వర రెడ్డి

నిర్మాత : సుంకర రామ బ్రహ్మం

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు :మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారికా భడోరియా, హెబ్బా పటేల్


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా, నిర్మాతగా రాణిస్తోన్న మంచు విష్ణు, కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్ హిట్స్‌తో హీరోగా ఓ గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్‍ల కాంబినేషన్‌లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఈడో రకం ఆడో రకం’. కన్ఫ్యూజన్‌నే కామెడీ అంశంగా చేసుకొని తెరకెక్కిందన్న ప్రచారం పొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ కన్ఫ్యూజన్ కామెడీ ఎంతవరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

అర్జున్ (మంచు విష్ణు), అశ్విన్ (రాజ్ తరుణ్).. ఇద్దరూ అల్లరిచిల్లరగా తిరుగుతూ కాలం వెళ్ళదీసే బెస్ట్ ఫ్రెండ్స్. ఓ ఫ్రెండ్ పెళ్ళిలో అర్జున్, నీలవేణి (సోనారిక) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. నీలవేణిని ప్రేమలో పడేసేందుకు అర్జున్, ఆమెతో తాను అనాథననే అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఈ ఒక్క అబద్ధం అర్జున్, అశ్విన్‌ల కథను ఎన్నో మలుపులు తిప్పుతుంది.

ఈ కథ ఇలాంటి మలుపులు తిరుగుతున్నప్పుడే కొన్ని అనుకోని పరిస్థితుల్లో అశ్విన్, నీలవేణికి భర్తగా; అర్జున్, అశ్విన్ ప్రేమించిన అమ్మాయి సుప్రియ (హెబ్బా పటేల్)కి భర్తగా పరిచయం అవ్వాల్సి వస్తుంది. ఒకే ఇంట్లో ఉంటూ ఇలాంటి విచిత్రమైన పరిస్థితులను ఈ ఇద్దరూ ఎలా ఎదుర్కున్నారు? చివరికి వీరి కథలకు ఎలా శుభం కార్డ్ పడిందీ అన్నది సినిమా.

ప్లస్ పాయింట్స్ :

కన్ఫ్యూజన్ కామెడీని ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. లాజిక్‌తో సంబంధం లేకున్నా సరదాగా నవ్వించేలా చేసే ఈ కన్ఫ్యూజన్ కామెడీయే సినిమాను ప్రధానంగా నిలబెట్టిన అంశం. ఫస్టాఫ్‌లో మొదలయ్యే ఈ కన్ఫ్యూజన్‌కు సెకండాఫ్‌లో మరో కన్ఫ్యూజన్‌ను జతచేసి చేసిన ఈ ప్రయత్నం చాలాచోట్ల నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రయాణంలో లాయర్ నారాయణ పాత్ర ద్వారా పుట్టుకొచ్చే కామెడీ సినిమాకు హైలైట్స్‌లో ఒకటిగా చెప్పాలి. ఈ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తనదైన టైమింగ్, డైలాగ్ డెలివరీతో చాలా చోట్ల నవ్విస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది. అప్పటివరకూ అలా అలా సరదాగా సాగిపోయిన ఫస్టాఫ్‌కు ఇంటర్వెల్‌తో మంచి స్థాయి వచ్చింది.

అశ్విన్ పాత్రలో రాజ్ తరుణ్ ఎప్పట్లానే తన ఎనర్జీని చూపిస్తూ చాలా బాగా నటించాడు. డైలాగ్ డెలివరీలో రాజ్ తరుణ్ ప్రతిభ స్థాయి ఏంటన్నది ఈ సినిమా మరోసారి ఋజువుచేసింది. మంచు విష్ణు అర్జున్ పాత్రలో ఒదిగిపోయి మంచి కామెడీ టైమింగ్‌తో నటించారు. ముఖ్యంగా అక్కడక్కడా మోహన్ బాబు స్టైల్లో చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. సోనారిక, హెబ్బా పటేల్ ఇద్దరూ బాగానే నటించారు. ఈ ఇద్దరి అందాల ప్రదర్శన ఈ తరహా అంశాలను కోరుకునేవారికి బాగా నచ్చుతుంది. టైటిల్ సాంగ్, కొక్కో కోడి పాటలు వినడానికి, పిక్చరైజేషన్ పరంగానూ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఒకట్రెండు చోట్ల తప్ప కథలో బలమైన ఎమోషన్ ఎక్కడా లేకపోవడం గురించే చెప్పాలి. కథలో కన్ఫ్యూజన్‌కి, దాన్నుంచి పుట్టుకొచ్చే కామెడీతో పాటు ఎమోషన్‌కి కూడా చాలా స్కోప్ ఉన్నా ఎక్కడా ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఇక బాగా నవ్వించిన ఫస్టాఫ్‌ తర్వాత వచ్చే సెకండాఫ్‌లో అక్కడక్కడా సినిమా కాస్త పక్కదారి పట్టి బోరింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. క్లైమాక్స్ ఫైట్‌కు సినిమా అసలు కథకు సంబంధమే లేదు.

ఇక ఇలాంటి కన్ఫ్యూజన్ కామెడీతోనే వచ్చిన పాతకాలం తెలుగు సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా తేలిపోతుంది. గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళాం ఊరెళితే’, ‘హంగామా’ లాంటి సినిమాలు ఇదే అంశం ప్రధానంగా వచ్చాయి. ఆ సినిమాలను చూసిన వారికి ఈ సినిమాలో కట్టిపడేసేంత కామెడీ లేదనిపిస్తుంది. ఇక కొన్ని పూర్తిగా అక్రమ సంబంధం అన్న ఆలోచన కల్పించేలా వచ్చే సన్నివేశాలు కథ పరంగానే కాకుండా, ఫక్తు కామెడీ అంశంగా చూసినా చిరాకు తెప్పిస్తాయి. ఇలాంటి సన్నివేశాలకు పూర్తిగా అవకాశమే ఇవ్వకుండా ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గురించి ప్రస్తావించుకోవాలి. కన్ఫ్యూజన్ కామెడీనే ప్రధాన అంశంగా చేసుకొని, ఓ తెలిసిన కథతోనే ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని కామెడీ పరంగానే చూస్తే దర్శకుడిగా విజయం సాధించాడనే చెప్పుకోవచ్చు. అయితే కథలో ఎమోషన్‌కి ఎక్కడా చోటివ్వకపోవడంతో సినిమా కేవలం కామెడీ ప్రయత్నంగానే మిగిలిపోయింది. క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో దర్శకుడి ప్రతిభ బాగుంది.

సాయి కార్తీక్ సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్, కొక్కో కోడి పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఒకే ఇంట్లో జరిగే కథను సినిమాటోగ్రాఫర్ బాగానే క్యాఫ్చర్ చేశారు. అయితే సినిమాటోగ్రఫీ పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో కట్టిపడేసే సన్నివేశాలు లేవు. ఎడిటింగ్ ఫర్వాలేదనేలా మాత్రమే ఉంది. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

‘ఈడో రకం-ఆడో రకం’.. కన్ఫ్యూజన్ కామెడీయే ప్రధానాంశంగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమాను నిలబెట్టేది కూడా ఈ అంశమే! మొదట్నుంచీ చివరి వరకూ చాలాచోట్ల నవ్వించే సన్నివేశాలను కలుపుకొని సాగిపోయే ఈ కన్ఫ్యూజన్ కామెడీ, చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడంలో విజయం సాధించింది. మంచు విష్ణు, రాజ్ తరుణ్‌, రాజేంద్ర ప్రసాద్‍ల కామెడీ టైమింగ్, హీరోయిన్ల అందచందాలు, రెండు మాస్ పాటలను హైలైట్స్‌గా నింపుకున్న ఈ సినిమాకు, అసలు కథలో ఎమోషన్ అన్నది లేకపోవడం, సెకండాఫ్‌లో సినిమా కాస్త నెమ్మదించడం, క్లైమాక్స్ ఫైట్ లాంటివి ప్రతికూల అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కాసేపు అలా లాజిక్ లాంటి అంశాలను పక్కనబెట్టి, సరదాగా నవ్వుకునే కామెడీ ప్రయత్నంగా ఈ సినిమాను చూస్తే వీడూ, వాడూ ఇద్దరూ బాగా నవ్వించి ఆకట్టుకుంటారు.

123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు