సమీక్ష : యువతను ఆకట్టుకునే ఈ రోజుల్లో

సమీక్ష : యువతను ఆకట్టుకునే ఈ రోజుల్లో

Published on Mar 23, 2012 5:30 PM IST
విడుదల తేది : 23 మార్చి 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
దర్శకుడు : మారుతీ
నిర్మాత : గుడ్ సినిమా గ్రూప్
సంగిత డైరెక్టర్ : జే .బి
తారాగణం : శ్రీనివాస్ , రేష్మ

గుడ్ సినిమా గ్రూప బ్యానర్ పై మారుతీ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘ఈ రోజుల్లో’. శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జేబి సంగీతం అందించాడు. ఈ సినిమా ప్రేక్షకుల తీర్పును కోరుతూ ఈ రోజే విడుదలవగా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

శ్రీ (శ్రీనివాస్) ప్రేమ అనే మత్తులో రజిని అనే అమ్మాయికి మూడు లక్షలు ఇచ్చి ఆ అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్లి పోవడంతో తను ఆ అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయినట్లు తెలుసుకుని మళ్లీ జీవితంలో మరో అమ్మాయి మొహం చూడకూడదని నిర్ణయించుకుంటాడు. మరో వైపు శ్రేయ (రేష్మ) కార్తీక్ అనే అబ్బాయితో స్నేహం చేస్త్తుంది. శ్రేయ స్నేహాన్ని ప్రేమ అనుకున్న కార్తీక్ ఆమెని ప్రేమించమంటూ వెంట పడి వేదిస్తాడు. కార్తీక్ చర్యలకు భయపడిన శ్రేయ మళ్లీ ఏ అబ్బాయితో స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంటుంది. అనుకోకుండా ఒక సందర్భంలో శ్రీ మరియు శ్రేయ ఇద్దరు గొడవ పడతారు. మంజీరా అపార్ట్మెంట్స్ లో బ్యాచిలర్స్ కి అద్దెకు ఇవ్వరని తెలిసి తనకు పెళ్లి అయిందని అబద్ధం చెప్పి శ్రీ అక్కడే అద్దెకు దిగుతాడు. శ్రేయ కూడా అక్కడే ఉంటుంది. మొదట్లో వారిద్దరూ గొడవపడ్డ తరువాత శ్రీకి పెళ్ళయిందని నమ్మిన శ్రేయ అతనితో స్నేహం చేస్తుంది. వారి స్నేహం ప్రేమగా మారుతున్న సమయంలో కథ అనుకోని ములుపులు తిరుగుతుంది. ఆ అనుకోని మలుపులు ఏమిటి? చివరికి వారి ప్రేమ సఫలమైందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ రోజుల్లో సినిమా చూడాల్సిందే.

ప్లస్:

శ్రీ పాత్రలో నటించిన శ్రీనివాస్ కి ఇది మొదటి చిత్రమైనా బాగా అనుభవం ఉన్న నటుడిలా చేసాడు. అతనికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. శ్రేయ పాత్ర చేసిన రేష్మకి కూడా మొదటి చిత్రమైనా బాగా నటించింది. ‘ఎక్కింది లే’ పాటలో అందంగా ఉంది. అందరూ అంటున్నట్లు జూనియర్ త్రిషా అనిపించుకుంది. శ్రీ స్నేహితుడిగా సాయి బాగా నవ్వించాడు. అతను నత్తితో చెప్పే డైలాగులు యువతను బాగా నవ్విస్తాయి. ఎమ్ఎస్ నారాయణ సత్తి రాజుగా కొద్దిసేపు నవ్వించాడు. మిగతా నటీ నటులు అంత కొత్త వారు అయినప్పటికీ తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. చిత్ర మొదటి భాగం అంత అంత ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. జేబి సంగీతంలో రింగ్ ట్రిగ్, ఎక్కింది లే పాటలు చాలా బావున్నాయి. ముఖ్యంగా రింగ్ ట్రింగ్ పాటని దర్శకుడు చక్కగా సన్నివేశాలకి తగ్గట్లుగా వాడుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బావుంది. సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది.

మైనస్ పాయింట్స్:

సినిమాలో డైలాగులు యువతను ఆకట్టుకున్నప్పటికీ డబుల్ మీనింగ్ డైలాగులు బాగా ఎక్కువయ్యాయి. ఇవి ఫ్యామిలీ ఆడియెన్స్ ని కొంత ఇబ్బంది కలిగిస్తాయి. మణెమ్మమరియు అతని అసిస్టెంట్ చేసిన లాఠీ కామెడీ కూడా ఎబ్బెట్టుగా ఉంది. దర్శకుడు సినిమా రెండవ భాగం కూడా ఆసక్తిగా తీసాడు కానీ పతాక సన్నివేశాలను మాత్రం సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. సినిమా ఆఖరి 30 నిముషాలు ఇంకా బాగా తీసి ఉంటే మరోలా ఉండేది. సినిమా చూసి బైటికి వచ్చిన ప్రేక్షకుడు కొంత అసంతృప్తితో బైటికి వస్తాడు.

సాంకేతిక విభాగం:

ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక వర్గం అందరూ కొత్తవారు కావడం విశేషం. ఎడిటర్ ఉద్ధవ్ మొదటి సినిమా కావడంతో కొంత తడబడ్డాడు. చాలావరకు బాగానే చేసినప్పటికీ కొన్ని సన్నివేశాల్లో జంప్ కట్స్ పడ్డాయి. డైలాగులు యువతను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా అంతా 5డి కెమేరాతో తీసారు. సినిమాటోగ్రాఫర్ ప్రభాకర్ రెడ్డి కూడా బాగా చిత్రీకరించాడు. మ్యూజిక్ డైరెక్టర్ జేబి గురించి మొదట్లోనే చెప్పుకున్నట్లు చాలా మంచి మ్యూజిక్ అందించాడు. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ సినిమా నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా చిత్ర నిర్మాతలు కష్టపడ్డారు. దర్శకుడు మారుతీ కూడా తను చెప్పదలచుకున్న కాన్సెప్ట్ తెరకెక్కించడంలో విజయం సాధించాడు.

తీర్పు:

ఈ రోజుల్లో అనే సినిమా ఈ రోజుల్లో యువత మనోభావాలు ఎలా ఉన్నాయి ప్రేమ అనే మత్తులో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే కాన్సెప్ట్ తో దర్శకుడు మన ముందుకు వచ్చాడు. సరదాగా కాలాక్షేపం కోసం సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుడిని తప్పకుండా అలరిస్తుంది.

123తెలుగు.కాం రేటింగ్ : 3.25/5

Clicke Here For ‘Ee Rojullo’ English Review

అశోక్ రెడ్డి -ఎం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు