విడుదల తేదీ : ఆగష్టు 12, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : మారుతి
నిర్మాత : నాగ వంశీ, పి.డి.వి. ప్రసాద్
సంగీతం : ఘిబ్రాన్
నటీనటులు : వెంకటేష్, నయనతార
విక్టరీ వెంకటేష్, ‘భలే భలే మగాడివోయ్’తో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతిల కాంబినేషన్లో తెరకెక్కిన ‘బాబు బంగారం’ అనే సినిమా కొద్దికాలంగా తెలుగులో భారీ క్రేజ్ తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైంది. వెంకీ కామెడీ ఈజ్ బ్యాక్ అన్న ప్రచారంతో మన ముందుకొచ్చిన ఈ సినిమా నిజంగానే ఆ స్థాయిని అందుకుందా? చూద్దాం..
కథ :
కృష్ణ (వెంకటేష్) తన తాత మాదిరిగానే అందరిపై జాలి చూపిస్తూ ఉంటాడు. ఓ పెద్ద పోలీసాఫీసర్ అయినా కూడా దొంగలను కూడా జాలిగానే చూసే మనస్థత్వం అతడిది. అలాంటి వ్యక్తికి శైలజ (నయనతార) అనే అమ్మాయి పరిచయమవుతుంది. కొద్దికాలంలోనే కృష్ణ ఆమెకు దగ్గరై ప్రేమలో పడతాడు. అయితే శైలజ కుటుంబానికి మాత్రం ఎమ్మెల్యే పుచ్చప్ప (పోసాని కృష్ణమురళీ), మల్లేష్ యాదవ్ (సంపత్ రాజ్)ల నుంచి ఓ ఆపద ఉంటుంది. శైలజ కుటుంబానికి ఉన్న ఆపద ఏంటి? కృష్ణ, శైలజకు దగ్గర కావడానికి ఏవైనా కారణాలున్నాయా? శైలజ కుటుంబాన్ని కష్టాల బారి నుంచి తప్పించి పుచ్చప్ప, మల్లేష్‌ల ఆగడాలను కృష్ణ ఎలా ఆటపట్టించాడు? అన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది ‘వెంకటేష్’ గురించి. చాలా గ్యాప్ తరువాత వెంకటేష్ తన ట్రేడ్ మార్క్ ఫన్నీ రోల్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ACP కృష్ణ పాత్రలో ఆయన నటన బాగా నవ్వించింది. సెకండ్ హాఫ్, క్లైమాక్స్ సన్నివేశాల్లో వెంకటేష్ తన నటనలో చూపించిన వేరియేషన్ చాలా బాగుంది.
నయనతార నటన కన్నా ఆమె లుక్ చాలా బాగుంది. వెంకటేష్ తో ఆమె కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. పాటలు కూడా బాగున్నాయి. సినిమా మొదటి భాగం మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగుతూ ఉల్లాసభరితంగా ఉంది. 30 ఇయర్స్ పృథ్వీ ‘బత్తాయి బాబ్జీ’ పాత్రలో చాలా బాగా నవ్వించాడు. అతని కోసం మారుతి రాసుకున్న క్యారెక్టర్ బాగా వర్కవుటైంది. వెన్నెల కిశోర్, బ్రహ్మానందం లు అక్కడక్కడా నవ్వులు పండించారు. పోసాని సినిమా మొత్తం తన పాత్రలో బాగానే నటించాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ అంటే రొటీన్ కథ. ఒక్క జాలి అన్న కాన్సెప్ట్ మినహాయిస్తే ఈ సినిమా అంతా కమర్షియల్ సినిమా ఫార్ములాలో సాగిపోతూ ఉంటుంది. వెంకటేష్ స్టార్‌డమ్‌ను, దాంతో పాటు వచ్చే కామెడీపైనే దృష్టిపెట్టిన దర్శకుడు కథను రొటీన్ చేసి సేఫ్ గేమ్ ఆడినట్లు అనిపించింది.
ఇక ఫస్టాఫ్ అంతా మంచి కామెడీ సన్నివేశాలతో నడిస్తే, సెకండాఫ్‌కి వచ్చేసరికి కథంతా సీరియస్‌గా మారిపోతుంది. కాగా ఇక్కడ కూడా కామెడీ ఉండాలన్న ఆలోచనతో చేసిన ప్రయత్నం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. కథలో ట్విస్ట్‌లు కూడా ముందే అర్థమయ్యేలా ఉన్నాయి. ఇక లాజిక్ అన్న అంశం సినిమాలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు.
సాంకేతిక విభాగం :
ఘిబ్రాన్ అందించిన సంగీతం బాగుంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వెంకీ హ్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేసేలా ఉంది. ఆ సంగీతానికి తగ్గట్టు దర్శకుడు మారుతి పాటలను చిత్రీకరించిన తీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. వెంకటేష్ స్టార్ డమ్ ను ఉపయోగించుకుంటూ మామూలు కథను కూడా ఎంటర్టైనింగ్ గా మారుతి చెప్పిన తీరు మెప్పించింది. వెంకటేష్, పృథ్వీ ల పాత్రలకు రాసిన డైలాగులు బాగున్నాయి.
కెమెరా వర్క్ చాలా బాగుంది. దర్శకుడు మారుతి వెంకటేష్ నుండి రెండు వేరియేషన్లలో నటనను రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి పార్ట్ ను చాలా ఎంటర్టైనింగ్ గా తీసినా సెంకడ్ హాఫ్ మాత్రం సీరియస్ గా సాగింది. సెకండ్ హాఫ్ పెద్దగా కథేమీ లేకపోయినప్పటికీ మంచి కామెడీ డోస్ తో సినిమాని ముగించిన మారుతి పాత వెంకటేష్ ను మళ్ళీ చూపించారు.
తీర్పు :
వెంకటేష్‌ని ఆయన ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్‌తో చూడాలని ఎదురుచూస్తోన్న వారందరినీ సంతృప్తి పరిచే సినిమాగా ప్రచారం పొందిన ‘బాబు బంగారం’, ఆ ప్రచారానికి తగ్గట్టే వెంకీ కామెడీతో సినిమా మెప్పించింది. జాలి అంటూ మారుతి ప్రవేశపెట్టిన కాన్సెప్ట్‌తో ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతూ ఆకట్టుకుంది. ఎక్కువగా కామెడీనే నమ్ముకున్న ఈ సినిమా, ఆ కామెడీతో బాగా నవ్వించింది. అయితే కథ రొటీన్ కావడం, సెకండాఫ్ కాస్త సీరియస్‌గా మారిపోవడం లాంటివి ఈ సినిమా ప్రతికూలాంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే, రొటీన్ కథే అయినా సరదాగా కాసేపు నవ్వుకోవడానికి వెళితే, ‘బాబు బంగారం’ బాగానే మెప్పిస్తాడు.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team