సమీక్ష : బొమ్మల రామారం – దారితప్పిన క్రైమ్ డ్రామా!

సమీక్ష : బొమ్మల రామారం – దారితప్పిన క్రైమ్ డ్రామా!

Published on Aug 12, 2016 11:40 PM IST
'Bommala Ramaram review

విడుదల తేదీ : ఆగష్టు 12, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : నిషాంత్‌ పుదారి

నిర్మాత : పుదారి అరుణ

సంగీతం : కార్తీక్‌ కొడకండ్

నటీనటులు : సూరి, రూపా రెడ్డి, ప్రియ దర్


నిశాంత్ పుదారి దర్శకుడిగా పరిచయవుతూ తెరకెక్కించిన సినిమా బొమ్మల రామారం. ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే క్రైమ్ డ్రామా కథతో నిశాంత్ చేసిన ఈ ప్రయత్నంలో సూరి, రూపా రెడ్డి, ప్రియ దర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

రామన్న (ప్రియదర్శి).. బొమ్మల రామారం అనే ఊరికి చిన్న దొర. తండ్రి చనిపోయాక ఆస్తి కోసం రెండు రోజులు శవాన్ని ఇంట్లోనే పెట్టుకునేంత దుర్మార్గ మనస్థత్వం ఉన్న అతడు, తరాలుగా వస్తోన్న ఆస్తిని, పదవులను అనుభవించాలనుకుంటాడు. తండ్రి తర్వాత తానే ఆ ఏరియాకి ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. అందుకు రామన్న, అదే ఊర్లో ఉండే సూరి (సూరి) సహకారం కూడా తీసుకుంటాడు. చిన్న చిన్న సెటిల్‌మెంట్స్ చేస్తూ బతికే సూరికి, దుబాయ్ వెళ్ళాలన్నది కల. అందుకోసం రామన్న చెప్పిందల్లా చేస్తూంటాడు. అంతా తనకు నచ్చినట్లే జరుగుతుందనుకున్న సమయంలో రామన్నకు కొందరు ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురువుతాయి. వాటి పరిణామాల వల్ల సూరి ఓ హత్య కేసులో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. తనకిష్టమైన వాళ్ళంతా సూరి చేసే పనులు నచ్చక అతడికి దూరమవుతూంటారు. ఇలాంటి విచిత్ర మలుపులు తీసుకున్న కథ చివరకు ఎక్కడకు చేరిందీ? క్రైమ్‌ను తమచుట్టూనే చేర్చుకున్న ఈ జీవితాలు చివరకు ఎక్కడ ముగుస్తాయ్? అన్నది సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ అంటే గ్రామీణ నేపథ్యంలో, అక్కడి రాజకీయాలూ, దొరతనం నుంచి పుట్టే క్రైమ్ చుట్టూ ఓ సినిమా చేయాలన్న దర్శకుడి ఆలోచనను చెప్పుకోవాలి. బొమ్మల రామారం అన్న గ్రామ నేపథ్యం, దొర చనిపోతే ఆయన పేరునంతా తీసుకొని, దర్జాగా బతకాలనుకునే ఓ యువకుడి ఆలోచనా విధానం, తనకిష్టం వచ్చినట్లు అల్లరిచిల్లరగా తిరిగే ఓ పేదింటి యువకుడు.. ఇలా వీరి జీవితాలతో ఆ కథ చెప్పాలనుకోవడం మంచి ఆలోచనే. అందుకోసం దర్శకుడు రాసుకున్న పూర్తి స్థాయిలో క్లారిటీ లేని పాత్రలు కూడా బాగున్నాయి.

సినిమా పరంగా ఫస్టాఫ్‌లో హీరో, అతడి ఫ్రెండ్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో క్రైమ్ కథలన్నీ చివరకు ఎక్కడ ముగుస్తాయో తెలిపేలా వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. సూరి, ప్రియా రెడ్డి తమ తమ పాత్రల్లో బాగా నటించారు. సంకీర్తన బాగానే నటించింది. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో పరిచయమైన ప్రియదర్శి విలన్ పాత్రలో బాగున్నాడు. ఆ పాత్ర స్థాయికి అందుకునేలా ఆహార్యం, గొంతు లేకున్నా, ఉన్నంతలో ప్రియదర్శి విలన్‌గా బాగా చేశాడు.

మైనస్ పాయింట్స్ :

చెప్పాలనుకున్న అంశం, నేపథ్యం తప్ప సినిమాలో బలమైన పూర్తి స్థాయి కథ లేకపోవడం అతిపెద్ద మైనస్‌గా తయారైంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా కొన్ని సన్నివేశాలను అర్థం లేకుండా అతికించినట్లు కనిపించింది. ఈ సన్నివేశాలు కొన్ని బాగున్నా, అన్నీ అతికించినట్లు ఉండడంతో తేలిపోయాయి. ఇంటర్వెల్, దానికి ముందు వచ్చే సన్నివేశాలన్నీ కూడా ఇలాగే తయారయ్యాయి. ఉమాదేవి అనే పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు అనవసరం అనిపించింది. ఒక మంచి నేపథ్యాన్నే ఎంచుకొని, దానికి తగ్గ స్థాయిలో మంచి కథను చెప్పడంలో ఈ సినిమా విఫలమైందనే చెప్పాలి.

సెకండాఫ్‌లో అనవసరమైన పాటలు వచ్చి సినిమాకు ఉన్న మూడ్‌ను దెబ్బతీశాయి. ఇక ప్రీ క్లైమాక్స్ వరకూ కథ అక్కడక్కడే తిరగడం కూడా బోరింగ్‌గా అనిపించింది. రామాయణం నాటకం వేసే సన్నివేశాలు బాగోలేదు. పైన ప్లస్ పాయింట్స్‌లో చెప్పుకున్న పాత్రలు మినహాయిస్తే మిగతా పాత్రలన్నింటికీ క్లారిటీ లేదు. ఇక రెగ్యులర్ కమర్షియల్ అంశాలనే కోరుకునే వారికి ఈ సినిమాలో అలాంటి అంశాలు పెద్దగా లేవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు సినిమాటోగ్రఫీకి ఇవ్వొచ్చు. సినిమాటోగ్రాఫర్ బి.వి.అమర్‌నాథ్‌ రెడ్డి సినిమా అవసరానికి తగ్గ మూడ్‌ను సరిగ్గా క్యారీ చేశారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో సినిమాటోగ్రాఫర్ పూర్తి స్థాయి ప్రతిభను గమనించొచ్చు. కృష్ణ మాయ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. కార్తీక్ కొడగండ్ల అందించిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగోలేదు. ఎడిటింగ్ ఈ సినిమాకు అతిపెద్ద మైనస్‌లలో ఒకటిగా చెప్పాలి. ఎడిటింగ్ సినిమాకు ఉన్న స్థాయిని కూడా తగ్గించింది.

దర్శకుడు నిశాంత్ పుదారి విషయానికి వస్తే, మంచి నేపథ్యాన్ని ఎంచుకున్న దర్శకుడు దానికి సరిపడా స్క్రీన్‌ప్లే రాసుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఎంచుకున్న కథాంశం చూస్తే ఏదో చెప్పాలని ప్రయత్నించినట్లు కనిపించినా, దానికి రైటర్‌గా అస్సలు న్యాయం చేయలేకపోయాడు. మేకింగ్ పరంగా మాత్రం దర్శకుడి ప్రతిభను చాలాచోట్ల గమనించొచ్చు. మేకింగ్‌పై మంచి పట్టు ఉన్నట్లు కనిపిస్తోన్న ఈ దర్శకుడు, ఇదే స్థాయి మేకింగ్‌తో మంచి స్క్రీన్‌ప్లే రాసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది.

తీర్పు :

క్రైమ్ డ్రామా అన్నది ఓ సవాల్ లాంటి జానర్. చెప్పాలనుకున్న కథ మీద పూర్తి స్థాయి పట్టు, ఒక్కో పాత్ర మీద తిరుగులేని క్లారిటీ ఉంటే తప్ప అనుకున్నట్లుగా ఓ క్రైమ్ డ్రామా సినిమా చెప్పడం కుదరదు. దర్శకుడు నిశాంత్ మొదటి సినిమాకే ఈ సాహసం చేసి, ఓ మంచి నేపథ్యాన్నే ఎంచుకొని వచ్చాడు. అయితే కథ మీద పట్టు లేకపోవడం, చెప్తోన్న అంశంపై పూర్తి స్థాయి క్లారిటీ లేకపోవడం లాంటి విషయాలతో ఈ సినిమాను ఎటూకాని సినిమాగానే మిగిల్చగలిగాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘బొమ్మల రామారం’, కళ తప్పిన వ్యవహారంలానే మిగిలిపోయింది!

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు