విడుదల తేదీ : ఆగష్టు 19, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : జి. నాగేశ్వర్ రెడ్డి
నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, ఏ. నాగ సుశీల
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : సుశాంత్, సోనమ్ భజ్వా..
సుశాంత్.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి ‘కరెంట్’, ‘అడ్డా’ సినిమాలతో లవర్ బాయ్‌గా మెప్పించిన హీరో. తాజాగా ఆయన జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ‘ఆటాడుకుందాం రా’ అంటూ ఓ కామెడీ ఎంటర్టైనర్తో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రమోషన్స్‌తో మంచి అంచనాలనే రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం..
కథ :
విజయరామ్ (మురళి శర్మ), ఆనంద్ ప్రసాద్ (ఆనంద్) మంచి స్నేహితులు. ఆనంద్ ఇచ్చే సలహాలతో వ్యాపారంలో విజయరామ్ కోట్లు గడిస్తాడు. అయితే విజయరామ్‌కు శత్రువైన శాంతారామ్ అతడి సక్సెస్‌ను చూసి తట్టుకోలేక దొంగ దెబ్బతీస్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో శాంతారామ్ చేసే మోసం ఆనంద్‌పై పడుతుంది. దీంతో విజయరామ్, ఆనంద్ ఇద్దరూ విడిపోతారు. ఇరవై సంవత్సరాల తర్వాత కూడా కష్టాల్లో ఉన్న విజయరామ్ కుటుంబాన్ని శాంతారామ్ ఏదోరకంగా హింసిస్తూనే ఉంటాడు.
ఈ సమయంలోనే విజయరామ్‌కి అల్లుడైన కార్తీక్ (సుశాంత్) అమెరికా నుంచి ఓ పనిమీద ఇండియా వస్తాడు. విజయరామ్‌కి అతడి చెల్లెలన్నా, ఆ కుటుంబం అన్నా నచ్చదు. అలాంటి మనిషికి కార్తీక్ ఎలా దగ్గరయ్యాడు? కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకున్నాడూ? అతడు నిజంగానే విజయరామ్‌కి మేనల్లుడా? కేవలం మేనల్లుడిగా నటించడానికి వచ్చాడా? ఆనంద్ ప్రసాద్ ఏమైపోయాడూ? ఈ కథలో సుశాంత్ ప్రియురాలు శృతి (సోనమ్ భజ్వా) ఎవరూ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ఉన్నంతలో మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఫస్టాఫ్‌లో పృథ్వీ, సుశాంత్‌ల మధ్యన వచ్చే కామెడీ అని చెప్పుకోవాలి. ఇక కథతో ఏమాత్రం సంబంధం లేకున్నా టైమ్ మెషీన్ నేపథ్యంలో వచ్చే కామెడీ అక్కడక్కడా నవ్వించింది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావుకి చెల్లెల్ని అంటూ వచ్చే ఝాన్సీ కామెడీ ఆకట్టుకుంది. పోసాని కృష్ణమురళి కామెడీ ఫర్వాలేదనేలా ఉంది. నాగ చైతన్య స్పెషల్ ఎంట్రీ కథకు కనెక్ట్ అయ్యేది కావడం కూడా బాగానే ఉంది.
హీరో సుశాంత్ జస్ట్ చిల్ అంటూ సరదాగా సాగిపోయే పాత్రలో బాగానే నటించాడు. కమర్షియల్ హీరో చేసే డ్యాన్సులు, ఫైట్స్.. అన్నీ చేయగలనని సుశాంత్ ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక సోనమ్ భజ్వా నటన పరంగా ఫర్వాలేదనిపించినా, పాటల్లో అందాల ప్రదర్శన చేసింది. ఈ అంశాలను కోరేవారికి ఇది ప్లస్పాయింట్గానే చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ అంటే తెలుగు సినిమాలో ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన పక్కా ఫార్ములా కథను ఎంచుకోవడమనే చెప్పాలి. దానికితోడు ఆ ఫార్ములా కథనైనా సరిగ్గా చెప్పేలా కథనం లేకపోవడం నిరుత్సాహపరచే అంశం. ఫస్టాఫ్‌లో కొంత మేర కథ కనిపించినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి ఎక్కడా కథే లేదు. ఇక కథేమీ లేకపోవడంతో క్లైమాక్స్ వరకూ టైమ్ మెషీన్ అంటూ, చీటింగ్ అంటూ, వందల కోట్ల మనీ ట్రాన్స్ఫర్ అంటూ అర్థం లేని సన్నివేశాలతో నడిపించుకుంటూ వచ్చారు. ఈ సమయంలో వచ్చే సన్నివేశాలన్నీ కొన్నిచోట్ల మాత్రమే నవ్వించగా, ఇంకెక్కడా కనీస స్థాయిలో కూడా మెప్పించలేకపోయాయి.
ఇక కథ విషయం ఇలా ఉంటే క్యారెక్టరైజేషన్స్ కూడా ఎక్కడా ఆకట్టుకునేలా లేవు. విలన్ క్యారెక్టర్ ఎందుకెలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. బ్రహ్మానందంకి ఓ పాత్రను సృష్టించి ఆ పాత్రతో కథ మొత్తాన్నీ మార్చేలా ఎన్నో సినిమాలు వచ్చినా, ఈ సినిమాలో అదే అంశం సిల్లీగా కనపడింది. లాజిక్ అన్న అంశానికి ఎక్కడా చోటేలేదు. ఇక సన్నివేశాల్లో బలమైన ఎమోషన్ కూడా లేదు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందు దర్శకుడు జీ. నాగేశ్వర్ రెడ్డి గురించి చెప్పుకుంటే, ఒక కామెడీ సినిమా నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అవేవీ లేకుండా ఒక నీరసమైన కథ, కథనాలతో సినిమా తీయడం దగ్గరే విఫలమయ్యాడు. అలాంటి నీరసమైన కథతోనే అక్కడక్కడా నవ్వించినా, ఓవరాల్‌గా మాత్రం నిరాశపరచాడనే చెప్పాలి.
అనూప్ రూబెన్స్ అందించిన పాటలు సాదాసీదాగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఎడిటింగ్ ఆకట్టుకునేలా లేదు. విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాగోలేదు. సినిమా అంతా రిచ్‌గా కనిపించేలా చేయడంలో ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో పాటు సినిమాటోగ్రఫీ పనితనం కూడా బాగానే ఉపయోగపడిందని చెప్పొచ్చు.
తీర్పు :
ముందే తెలిసిన ఒక కథతో, ఎలా ఉంటుందో ముందే ఊహించేయగల సన్నివేశాలతో ఓ కామెడీ సినిమా వస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమాయే ‘ఆటాడుకుందాం రా’. అంతకుమించిన మైనస్ ఏంటంటే ఈ సన్నివేశాల మధ్యన వచ్చే ఆ కామెడీ కూడా ఎక్కడా పూర్తి స్థాయిలో నవ్వించేదిగా లేకపోవడం. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా నవ్వించే సుశాంత్-పృథ్వీ కామెడీ, సెకండాఫ్‌లో టైమ్ మెషీన్ నేపథ్యంలో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు మినహాయిస్తే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్థాయి అంశాలేవీ లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫార్ములా కథ, కథనాలతో ఆడిన బలవంతపు ఆటే ఈ ‘ఆటాడుకుందాం రా’..!
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team