విడుదల తేదీ : ఆగష్టు 26, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : సురేష్ కెవి
నిర్మాత : విజయ్ జె, పులి శ్రీకాంత్, సందీప్ మరియు స్నేహితులు
సంగీతం : సాయి కార్తిక్
నటీనటులు : లోకేష్, రాజేష్, శశాంక్, గీతాంజలి, సురేష్ కెవి
హర్రర్, థ్రిల్లర్ జానర్లో వచ్చే సినిమాలు ఖచ్చితంగా ఆ జానర్ కు న్యాయం చేసే విధంగా ఉంటే ఎప్పుడైనా సరే ఆ సినిమాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. అందుకే తన తొలి సినిమాకు అలాంటి జానర్ నే ఎంచుకుని నూతన దర్శకుడు సురేష్ కెవి ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే ఈ ‘అవసరానికో అబద్దం’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరుపుకుని మంచి క్రేజ్ సొంతం చేసుకుని ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
చదువు పూర్తైన నలుగురు స్నేహితులు రామ్ (లోకేష్), కళ్యాణ్ (రాజేష్), శ్రీనివాస్ (శశాంక్), శ్వేత (గీతాంజలి) లు కొన్ని రోజులు సరదాగా గడపాలని దగ్గర్లోని దొనకొండ అడవికి ట్రెక్కింగ్ కు వెళతారు. దెయ్యాలకు సంబందించిన నైపథ్యం ఉన్న ఆ అడవికి వెళ్లిన ఆ నలుగురు స్నేహితులు తమ ప్రయాణంలో దెయ్యం మూలంగా కొన్ని భయంకర అనుభవాలను ఎదుర్కొని, ఆ అడవిలో ఉన్న ఓ నిజాన్ని తెలుసుకుంటారు. అసలు ఆ నలుగురు స్నేహితులు ఎదుర్కున్న అనుభవాలేమిటి ? ఆ అడవి నుండి ఎలా బయటపడతారు ? అక్కడ వాళ్ళు తెలుసుకున్న నిజమేమిటి ? టైటిల్ లో చెప్పినట్టు ఎవరి అవసరం కోసం ఎవరు ఎవరితో ఎలాంటి అబద్ధం ఆడారు ? అన్నదే ఈ సినిమా కథ…
ప్లస్ పాయింట్స్ :
ప్లస్ పాయింట్స్ లో మొదటగా చెప్పుకోవాల్సింది దర్శకుడు సురేష్ కెవి ప్రయోగాత్మకంగా, వైవిధ్యంగా రాసుకున్న హర్రర్ థ్రిల్లర్ స్టోరీ. మొదటి భాగం అన్ని హర్రర్ సినిమా కథల్లాగే రొటీన్ గా మొదలైనప్పటికీ పోను పోను కథనం కాస్త ఆసక్తిగా సాగడం బాగుంది. దెయ్యాన్ని ఎలివేట్ చేసే కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు అనుకున్న థ్రిల్ కలిగింది.
అలాగే రెండవ భాగంలో కొత్త కథ మొదలవడం అసలు ఏం జరుగుతోంది అన్న ఆసక్తిని పెంచింది. థ్రిల్లింగ్ సన్నివేశాల్లో సాయి కార్తిక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సన్నివేశాల్లో ఇంటెన్సిటీని పెంచింది. అందరు నటీనటులు కొత్తవారే అయినప్పటికీ నటనలో వారు చూపించిన పరిణితి బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ ముగిసే వరకూ కథనం ఆసక్తిగానే సాగినప్పటికీ రెండవ భాగంలోకి మొదలైన కొత్త కథకు సంబందించిన కథనం ఏమంత ఆసక్తిగా లేక బోర్ కొట్టించింది. అలాగే టైటిల్ ప్రకారం సినిమాకి ముఖ్యమైన ‘ఏ అబద్దం ఎవరు ఎవరితో ఏ విధంగా ఆడారు’ అన్న అంశం ప్రేక్షకుడికి థియేటర్లోనే అర్థం కావాల్సి ఉండగా అక్కడ అలా జరగలేదు.
హర్రర్ సినిమాలో ఉండవలసిన ముఖ్యమైన భయపెట్టే సన్నివేశాలు పెద్దగా ఎక్కడా కనిపించలేదు. దర్శకుడు సురేష్ కెవి థ్రిల్ చేద్దామనుకున్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని పరిపూర్ణంగా ఎగ్జిక్యూట్ చేయడంలో అతను పూర్తిగా సక్సెస్ కాలేదు. పైగా ప్రీ క్లైమాక్స్ మొత్తం కన్ఫ్యూజన్ గా తయారై అసలు ఏం జరుగుతోంది అన్న సందేహాన్ని కలిగించింది.
సాంకేతిక విభాగం :
ముందుగా హర్రర్ కథకు కొత్తదనాన్ని చేర్చుతూ కథను రాసుకోవడంలో సురేష్ కెవి సక్సెస్ అయ్యాడు. అలాగే మొదటి హాఫ్ లో కొంతమేర ఆసక్తికర కథనం, సెకెండ్ హాఫ్ లో కొన్ని థ్రిల్లింగ్ అంశాల్ని రాసిన తీరు బాగుంది. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నటీ నటులు పాత్రల మేరకు మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు. వెంకటరమణ సినిమాటోగ్రఫీ పరవాలేదనిపించింది. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఏమంత గొప్పగా లేదు. నిర్మాతల నిర్మాణ విలువలు పరవాలేదనిపించాయి.
తీర్పు :
హర్రర్, థ్రిల్లర్ జానర్లో కొత్తదనం చూపడానికి దర్శకుడు సురేష్ కెవి చేసిన ఈ ప్రయత్నంలో మంచి కథ, కొంతమేర ఆసక్తికరమైన కథనం, మంచి థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు కాగా సెకండ్ హాఫ్ లో బోరింగ్ కథనం, కన్ఫ్యూజింగ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, హర్రర్ జానర్ కు ముఖ్యమైన భయపెట్టే సన్నివేశాల మిస్సింగ్ ఈ సినిమాలో మైనస్ పాయింట్స్. మొత్తంగా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడుతూ కొత్త తరహా ప్రయోగాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగుంటుంది తప్ప సాధారణంగా హర్రర్ సినిమాలు నుండి భయపెట్టే సన్నివేశాలను ఖచ్చితంగా కోరుకునే కామన్ ఆడియన్ కు ఈ చిత్రం పెద్దగా సంతృప్తినివ్వదు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team
Click here for English Review