విడుదల తేదీ : అక్టోబర్ 28, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : గోకుల్
నిర్మాత : ఎస్ ఆర్ ప్రకాష్ బాబు
సంగీతం : సంతోష్ నారాయణన్
నటీనటులు : కార్తి, నయనతార, శ్రీదివ్య
‘ఆవారా, ఊపిరి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ స్టార్ హీరో కార్తి నటించిన చిత్రం ‘కాష్మోరా’. హర్రర్, కామెడీ, మాస్ ఎంటర్టైనర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి నుండి పోస్టర్లతో, టీజర్లతో, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇన్ని అంచనాల మధ్య ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
కాష్మోరా (కార్తి) అనే వ్యక్తి దెయ్యాల పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకుని దెయ్యాలను వదిలిస్తానంటూ వాళ్ళను మోసం చేస్తూ డబ్బు, పేరు సంపాదిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక వ్యక్తి తన కోటలో ఉన్న దెయ్యాల్ని బయటికి పంపమని, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని అంటాడు. దాంతో కాష్మోరా ఆ కోటలోకి వెళ్లి తన కుటుంబంతో సహా ఇరుక్కుపోతాడు.
అలా అందులో ఇరుక్కుపోయిన కాష్మోరాను అక్కడికి రప్పించింది ఎవరు ? అందులో ఎవరున్నారు ? వాళ్ళకి కాష్మోరాతో ఏ అవసరం ఉంది ? వాళ్ళు కాష్మోరాను ఎలాంటి ఇబ్బందులు పెట్టారు ? కాష్మోరా వాళ్ళ నుండి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు ? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది ఫస్టాఫ్ ఓపెనింగ్ మరియు ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి. దర్శకుడు, రచయిత అయిన గోకుల్ ఈ రెండు సందర్భాలనీ బాగా రాసుకుని అంతకన్నా బాగా తెరపై ఆవిష్కరించాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో పండిన కామెడీ అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. సెకండాఫ్ లో వచ్చే ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ లో రాజ్ నాయక్ (కార్తి) పాత్ర విజువల్ గా బాగుంది, అలాగే అందులో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.
ఇక సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ కార్తి నటన. కథలోని మూడు పాత్రల్లో కార్తి చాలా బాగా నటించాడు. ముఖ్యంగా కాష్మోరా క్యారెక్టర్లో అతను చేసిన కామెడీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. రాజ్ నాయక్ పాత్రలో అతని భిన్నమైన నటన మెప్పించింది.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ లో ప్రధానమైనది సెకండాఫ్ లో వచ్చే ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్. ఇందులో పెద్దగా బలమైన కథాంశం లేకపోవడం, రన్ టైమ్ ఎక్కువవడం బోర్ కొట్టించాయి. సెకండాఫ్ ముందుకు వెళుతున్న కొద్ది నిరుత్సాహం తప్ప సినిమాపై పెద్దగా ఆసక్తి కలగలేదు. అలాగే రాజ్ నాయక్ గా కార్తి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పటికీ ఆ పాత్ర చిత్రీకరణ అంత ప్రభావంతంగా లేదు.
అలాగే ఫస్టాఫ్, సెకండాఫ్ లలో ఒకే ఉద్ద్యేశ్యంతో ఉన్న సీన్లు పదే పదే రిపీట్ అవ్వడం బోర్ కొట్టించింది. ఇక మధ్యలో వచ్చే పాటలు కూడా నీరసంగా ఉన్నాయి. ఇక సెకండాఫ్ క్లైమాక్స్ ఎపిసోడ్ కొత్తగా, ఆసక్తికరంగా ఏమీ లేదు. హర్రర్ కామెడీ మాస్ జానర్ గా వచ్చిన ఈ సినిమాలో కామెడీ, మాస్ ఎలిమెంట్స్ అయితే బాగానే కనబడ్డాయి కానీ హర్రర్ మాత్రం పూర్తిగా మిస్సయింది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక విభాగంలో దర్శకుడు గోకుల్ హీరో కార్తిలోని నటుడిని చాలా బాగా వాడుకున్నాడు. హీరో పాత్రలోనే కామెడీ చేయించి మంచి ఎనర్టైన్మెంట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సెకండాఫ్ ఫాంటసీ ఎపిసోడ్ లో విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ అందించిన ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాబు జోసెఫ్ ఎడిటింగ్ కథను కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఉండేలా సహాయపడింది. రాజ్ నాయక్ పాత్ర డిజైన్ లో ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతిభ స్పష్టంగా కనబడింది. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఈ కాష్మోరా చిత్రం రోటీన్ జానర్లో సాగే సినిమాలకు భిన్నంగా హర్రర్ కామెడీ మాస్ ఎంటర్టైన్మెంట్ జానర్లో ఉండే సినిమా. ఇందులో ఫస్టాఫ్ ఓపెనింగ్, ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్, సెంకడాఫ్ ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ లో సాగే కొన్ని సన్నివేశాలు, హీరో కార్తి నటన ప్రధాన ప్లస్ పాయింట్స్ కాగా సెకండాఫ్ లో ఎక్కువైన రన్ టైమ్, సెకండాఫ్ ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ లో నడిచే కథ బలంగా లేకపోవడం, పదే పదే రిపీట్ అయ్యే సన్నివేశాలు, మధ్యలో వచ్చే పాటలు, హర్రర్ పూర్తిగా మిస్సవడం ఇందులోని మైనస్ పాయింట్స్. మొత్తం మీద కాష్మోరా చిత్రం ఈ దీపావళికి అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి చాయిస్ గా నిలిచే చిత్రం.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team