సమీక్ష : పిల్ల రాక్షసి – బాగా ఇబ్బంది పెట్టింది !

సమీక్ష : పిల్ల రాక్షసి – బాగా ఇబ్బంది పెట్టింది !

Published on Nov 4, 2016 1:53 PM IST
Pilla Rakshasi review

విడుదల తేదీ : నవంబర్ 4, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

దర్శకత్వం : మిథున్ మాన్యూల్ థామ‌స్

నిర్మాత : చదలవాడ పద్మావతి

సంగీతం : షాన్ రహమాన్

నటీనటులు : సారా అర్జున్‌, స‌న్ని వాయ్‌నే


‘బిచ్చగాడు’ సినిమాని తెలుగు ప్రేక్షకులకు సమర్పించి అనూహ్యమైన గొప్ప విజయాన్నందుకున్న చదలవాడ పద్మావతి ఈసారి కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో మలయాళంలో సూపర్ హిట్టైన `ఆన్ మ‌రియ క‌లిప్పిలాను` చిత్రాన్ని ‘పిల్ల రాక్షసి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు సమర్పిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

అనన్య(సారా అర్జున్) అనే 4 వ తరగతి అమ్మాయికి ఆటలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వాళ్ళ నాన్నకు ఇష్టమైన లాంగ్ జంప్ అంటే ఆ పాపకు మరీ ఇష్టం. స్కూల్ లో జరిగే లాంగ్ జంప్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తుంటుంది. కానీ సెలక్షన్స్ లో ఆ స్కూల్ పి.డి అనన్యను కావాలనే డిస్క్వాలిఫై చేస్తాడు.

దాంతో నొచ్చుకున్న అనన్య ఆ పి. డి మీద కోపం తీర్చుకోవడానికి ఒక కిరాయి రౌడీ గిరీష్ ( స‌న్ని వాయ్‌నే) ని పి. డి ని కొట్టమని చెప్పి పురమాయిస్తుంది. అసలు పి.డి అనన్యను ఎందుకు డిస్క్వాలిఫై చేస్తాడు ? అతనికి అనన్యకు మధ్య గొడవేమిటి ? అనన్య మాట్లాడిన రౌడీ గిరీష్ పి.డి ని ఏం చేశాడు ? ఈ ప్రాసెస్ లో గిరీష్, అనన్య ల జర్నీ ఎలా సాగింది ? అన్నదే ఈ చిత్రం.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది అనన్యగా నటించిన బేబీ సారా అర్జున్ గురించి. సినిమా మొత్తం మీద సారా నటనే పెద్ద హైలెట్. ప్రతి సన్నివేశంలోనూ చాలా సహజంగా నటించి ఆకట్టుకుంది సారా. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే అద్భుతమైన నటన కనబరిచింది. అలాగే సారాకు, ఆమె తల్లిదండ్రులకు మధ్య నడిచే ఫ్యామిలీ ట్రాక్ ను దర్శకుడు,రచయిత మిథున్ మాన్యూల్ థామ‌స్ బాగానే రాసుకున్నారు.

అలాగే పిల్లలతో, వాటి భావోద్వేగాలతో కథ నడపాలన్న దర్శకుడి ప్రాధమిక ఉద్దేశ్యం ఇంప్రెసివ్ గా ఉంది. ఇక సినిమా చివర్లో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ అతిధి పాత్ర అప్పటి ఉన్న బోరింగ్ ఫీల్ ను కాస్త పోగొట్టడంలో ఉపయోగపడింది. అలాగే సినిమా రన్ టైమ్ కూడా తక్కువ కావడం ప్రేక్షకుడికి కాస్త కలిసొచ్చే అంశం. సినిమాకి విష్ణు శర్మ అందించిన సినిమాటోగ్రఫి ఆకట్టుకునేలా ఉంది.

మైనస్ పాయింట్స్ :

మైన్స్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు, రచయిత అయిన మిథున్ మాన్యూల్ థామ‌స్ గురించి. కేవలం పిల్లల భావోద్వేగాలను ఆధారంగా చేసుకుని ఎమోషనల్ డ్రామా నడపాలన్న ఆయన ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ ఆయన ప్రయత్నం మాత్రం పూర్తిగా బెడిసికొట్టేసింది. ఏదో ఒక ఎమోషన్ ను మాత్రమే తీసుకుని దాన్నే పూర్తి స్థాయిలో చూపాల్సింది పోయి ఒక చిన్న పాపలోని సెంటిమెంట్, భయం, మంచితనం, చిలిపి కోపం, అమాయకత్వం, తెలివి తేటలు వంటి అన్ని అంశాలను తీసుకుని ఏ ఒక్కదాన్ని కూడా బలంగా చూపలేకపోయాడు దర్శకుడు.

సినిమా మొదలైన దగ్గర నుండి కథనం బోరింగ్ గా సాగుతూ పోయిందే తప్ప ఎక్కడా కూడా కాస్తలో కాస్తైనా మెరుగుపడ్డ దాఖలాలు కనిపించలేదు. ముఖ్యంగా హీరో పాత్రలో ఏమాత్రం ఏమోషన్ లేదు. పాపతో అతని బంధం బలపడుతున్న కొద్దీ అతనిలో ఆ భావోద్వేగాలు బయటపడి ప్రేక్షకుడిని కదిలించాలి. కానీ అలా జరగలేదు. కనీసం అలాంటి బలమైన సన్నివేశాలను కూడా క్రియేట్ చేయలేదు దర్శకుడు. సినిమా మొత్తంలో పాప ఫ్యామిలీ ట్రాక్ తప్ప మిగతా అంతా బోరింగ్ గానే ఉంది. పైగా సినిమాలో హీరో ఫ్రెండ్ తో కామెడీ పండించే ప్రయత్నం చేసినప్పటికీ అది కొంచెం కూడా వర్కవుట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగానికొస్తే రచయిత, దర్శకుడు అయిన మిథున్ మాన్యూల్ థామ‌స్ ప్రేక్షకులను ఆకట్టుకునే కథా కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యారు. ఒక్క పాప ఫ్యామిలీ ట్రాక్ తప్ప మిగతా అంతా వృధా ప్రయత్నమే అయింది. ఇక షాన్ రహమాన్ అందించిన సంగీతం అక్కడక్కడా పరవాలేదనిపించింది. లిజో పాల్ ఎడిటింగ్ బాగానే ఉంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ఉపయోగపడింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

తీర్పు :

ఒక నాలుగవ తరగతి పాప తన పి.డి తనను ఇబ్బంది పెట్టిన కారణంగా కోపం తెచ్చుకుని అతనికి బుద్ది చెప్పాలని చేసే ప్రయత్నంలో ఒక కిరాయి రౌడీకి ఫ్రెండ్ అవుతుంది. ఇక అక్కడి నుండి ఆ రౌడీతో పాప జర్నీ ఎలా సాగింది, చివరికి ఏమైంది అన్నదే ఈ సినిమా కథ. ఇందులో పాపగా నటించిన సారా అర్జున్ నటన, కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలు ప్లస్ పాయింట్స్ కాగా క్లారిటీ, బలం లేని కథ, ఆధ్యంతం బోరింగ్ గా సాగే కథనం, ఎక్కడా టచ్ చేయలేని చాలా పేలవమైన ఎమోషన్స్ ఇందులో మైనస్ పాయింట్స్. మొత్తగా చెప్పాలంటే ‘బిచ్చగాడు’ సినిమాని డబ్ చేసిన నిర్మాతలే దీన్ని కూడా డబ్ చేశారని.. కాబట్టి ఇందులో ఏదో విషయం ఉండే ఉంటుందని థియేటర్ కు వెళితే మాత్రం దెబ్బైపోవడం ఖాయం.

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు