తమిళనాట రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, మ్యాగజైన్ ఎడిటర్‌గా.. ఇలా చేపట్టిన అన్ని బాధ్యతల్లో తనదైన ముద్ర వేసిన చో రామస్వామి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈ ఉదయం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. చనిపోయే రోజుకి ఆయన వయస్సు 82 సంవత్సరాలు. తుగ్లక్ పేరుతో ఆయన నడిపిన రాజకీయ వ్యంగ్య పత్రికకు దేశవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు.
ఇక రామస్వామి మృతిపట్ల సినీ, రాజకీయ లోకమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రామస్వామికి పెద్ద అభిమానిని అని ప్రకటించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. ఇక తమిళ సినీ పరిశ్రమ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందని అక్కడి సినీ ప్రముఖులు ఆయన ఘనతను కొనియాడారు. దివంగత నేత జయలలితకు రామస్వామి మంచి మిత్రుడు. ఆయన సలహాలతోనే ఆమె సినీ, రాజకీయ రంగంలో నిలదొక్కుకున్నారన్న పేరుంది.