విడుదల తేదీ : డిసెంబర్ 9, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత : అల్లు అరవింద్, ఎన్.వీ.ప్రసాద్
సంగీతం : హిపాప్ తమిజా
నటీనటులు : రామ్ చరణ్, అరవింద్ స్వామి, రకుల్ ప్రీత్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమే ఈ ‘ధృవ’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా దీన్ని రూపొందించారు. వరుసగా రెండు పరాజయాల తరువాత చరణ్ చాలా జాగ్రత్తగా చేసిన సినిమా కావడంతో మెగా అభిమానులంతా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి సినిమా వారి ఆశలను నిజం చేసేలానే ఉందా? చూద్దాం..
కథ :
ధృవ (రామ్ చరణ్), అతని స్నేహితులు ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉండగానే ఎవరికీ తెలీకుండా సిటీలో జరిగే చిన్నపాటి క్రైమ్స్ ని అరికడుతూ నేరస్థుల్ని పోలీసులకు పట్టుబడేలా చేస్తుంటారు. అలా వాళ్ళు పోలీసులకు అప్పగించిన నేరస్తుల్లో ఒకడు సులభంగా తప్పించుకుని బయట తిరగడం గమనించిన ధృవ, అతని స్నేహితులు అదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తుండగానే ధృవ ఎన్నాళ్లగానో తను రీసెర్చ్ చేస్తున్న ఒక అంశం గురించి చెప్పి, దాన్ని సాల్వ్ చేసి ఈ చిన్న చిన్న నేరాలన్నింటికీ కారణమైన పెద్ద క్రిమినల్ ని పట్టుకోవాలన్నదే తన లక్ష్యమని చెప్పి ఆ క్రిమినల్ కోసం వెతుకుతుంటాడు.
అలా వెతుకుతున్న ధృవకు అనుకోకుండా సిద్దార్థ అభిమన్యు (అరవింద స్వామి) అనే సైంటిస్ట్ తో గొడవ మొదలవుతుంది. అసలు సిద్దార్థ అభిమన్యు ఎవరు ? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ? అతనికి, ధృవకి మధ్య ఫైట్ ఎందుకు మొదలైంది ? అది ఎలా సాగింది ? ఆ ఫైట్ లో చివరికి ఎవరు, ఎలా గెలిచారు ? అన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కథాంశం, దాని చుట్టూ బలంగా అల్లిన స్రీన్‌ప్లే అనే చెప్పాలి. ఒక పెద్ద క్రిమినల్‌ను పడితే, చిన్న చిన్న క్రిమినల్స్ అంతమవుతారంటూ, ఆ పెద్ద క్రిమినల్తోనే హీరో పోరాడడం ఇంటరెస్టింగ్ పాయింట్. హీరో-విలన్ల మధ్యన ఇలా జరిగే మైండ్‌గేమ్ మంచి ఎంటర్టైన్మెంట్నిచ్చింది. రామ్ చరణ్ ధృవ అనే పోలీసాఫీసర్ పాత్రలో చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఆ పాత్ర కోసం ఎంతోకష్టపడి బిల్డప్ చేసిన ఫిజిక్‌తో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నటనపరంగానూ ఈ సినిమాతో చరణ్ మరో స్థాయికి వెళ్ళాడనే చెప్పాలి. చాన్నాళ్లకు తనకు సూటయ్యే సీరియస్ తరహా కథను చరణ్ ఎంచుకున్నాడు.
సిద్ధార్థ్ అభిమన్యుగా నటించిన అరవింద్ స్వామి పాత్రలో వేరొకరిని ఊహించుకోలేం అన్నట్టుగా నటించాడాయన. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా చాలా జాగ్రత్తగా, తెలివిగా పలికించడంలో అరవింద్ స్వామి చూపిన ప్రతిభ ఈ సినిమాకే మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నాటితరం క్రేజీ హీరోల్లో ఒకరైన ఆయన, ఇలా ఒక ఇంటరెస్టింగ్ రోల్‌తో మళ్ళీ తెలుగు తెరకు పరిచయమవ్వడం అన్నది ఈ సినిమాకు ఫ్రెష్ ఫీల్ తెచ్చిపెట్టింది. రకుల్ ప్రీత్ ఎప్పట్లానే తన పాత్ర పరిధిమేర చాలా బాగా నటించింది. పరేషానురా అన్న పాటలో చేసిన గ్లామర్ షో కనులవిందు అనే చెప్పాలి. చివరి నీతోనే డ్యాన్స్.. ‘ పాటలో చరణ్ స్టెప్పులు అదిరాయి.
ఇక హిపాప్ తమిజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని మరింతగా పెంచేదిగా ఉండి సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమా పరంగా చూసుకుంటే పోలీస్ ట్రైనింగ్, విలన్ పరిచయం, ఇంటర్వెల్ ట్విస్ట్, కథలోని అసలైన ఎలిమెంట్‌ను చివరివరకూ థ్రిల్లింగ్‌గా నడపడం, తెలుగు సినిమా స్టైల్‌కు భిన్నంగా ఉండే క్లైమాక్స్, సిట్యుయేషనల్ సాంగ్స్, సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ ఇలా చాలా ప్లస్లే ఉన్నాయి ఈ సినిమాలో.
మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ కొన్నిచోట్ల కథనం నెమ్మదిగా సాగినట్లనిపించింది. ఇక్కడ కూడా సస్పెన్స్‌ను బాగానే అందుకున్నా చాలా చోట్ల సినిమా నెమ్మదిగానే ఉంది. ఇక అదే విధంగా రెండున్నర గంటలకు పైనే ఉన్న రన్‌టైమ్ కూడా కాస్త ఎక్కువనే అనిపించింది. సెకండాఫ్ ను కాస్త తగ్గించి మన నేటివిటీకి తగ్గట్టు స్పీడ్ కాస్త పెంచి ఉంటే బాగుండేది. ఇక కథలో అక్కడక్కడా వచ్చే కొన్ని లాజిక్స్ సరైనవే అయినా సామాన్య ప్రేక్షకులకి అంత త్వరగా అర్థంకావు.
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు సురేందర్ రెడ్డి విషయానికి వస్తే, తమిళంలో ఘన విజయం సాధించిన కథను, పెద్దగా మార్పులేవీ చేయకుండా, ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్టుగా సన్నివేశాలను మార్చుకొని రాసిన స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. తమిళ వర్షన్ చూసిన వారికి కూడా ఈ సినిమా నచ్చేలా చేయడంలో సురేందర్ ప్రతిభ గమనించొచ్చు. ఇక మేకింగ్ పరంగా సురేందర్ రెడ్డి ఎప్పట్లానే తన బ్రాండ్‌ను మరొకసారి చాటుకున్నారు. అందరూ సురేందర్‌ను స్టైలిష్ ఫిల్మ్‌మేకర్ అని ఎందుకంటారో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు.
పీ.ఎస్.వినోద్‌కు ఇప్పుడున్న సినిమాటోగ్రాఫర్స్‌లో తనదైన మార్క్ సృష్టించుకున్నవారిగా పేరుంది. ఆయన తనదైన ఫ్రేమింగ్, లైటింగ్ వాడుతూ తెలుగు సినిమా స్థాయి పెంచే విజువల్స్ అందించాడనే చెప్పాలి. హిపాప్ థమిజా అందించిన పాటలు ఫర్వాలేదనేలానే ఉన్నా ఉన్నా విజువల్ గా మాత్రం అదిరిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్లో ఉంది. ఎడిటింగ్ బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీని అభినందించకుండా ఉండలేం. ఇక గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కు వంక పెట్టడానికి లేదు.
తీర్పు :
‘తనీ ఒరువన్’ కి రీమేక్ గా రామ్ చరణ్ చేసిన ఈ ‘ధృవ’ చిత్రం అతని కెరీర్లో ఒక మంచి చిత్రంగా నిలుస్తుంది. సినిమా కథ, తెలివిగా సాగే ఫస్టాఫ్, సెకండాఫ్ కథనాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అరవింద స్వామి, రామ్ చరణ్ ల నటన, సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ కాగా, నెమ్మదించిన సెకండాఫ్ కథనం, సరైనవే అయినా సామాన్య ప్రేక్షకులకు అంత త్వరగా అందని కథలోని కొన్ని లాజిక్స్ సినిమాలోని మైనస్ పాయింట్స్. మొత్తం మీద చూస్తే రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరో కెరీర్‌లోని కీలక సమయంలో ఎంచుకోవలసిన సరైన కథనే ఎంచుకుని జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను తప్పక మెప్పిస్తుంది.
123telugu.com Rating : 3.5/5
Reviewed by 123telugu Team