విడుదల తేదీ : మార్చి 17, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : పి.సునీల్ కుమార్ రెడ్డి
నిర్మాతలు : కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్ర బాబు
సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి
నటీనటులు : పవన్, కారుణ్య చౌదరి, రాకేష్, మహేంద్ర
ఈ మధ్య కాలంలో భారత దేశాన్ని ఒక కుదుపు కుదిపేసి డీమానిటైజేషన్ అనే హాట్ టాపిక్ ను ఆధారంగా చేసుకుని ‘గంగపుత్రులు’ చిత్ర దర్శకుడు పి. సునీల్ రెడ్డి తెరకెక్కించిన చిత్రమే ఈ ‘ఏటిఎం వర్కింగ్’. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం..
కథ :
దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి కరెన్సీ బ్యాన్ అనే అంశాన్ని తీసుకుని ఆ విధానంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను, కలిగే ప్రయోజనాలను, ఎదురయ్యే ఇబ్బందులను, ప్రభుత్వం వారు ఆ ఇబ్బందులకు చూపిన పరిష్కారాలను ఎలివేట్ చేస్తూ ఈ చిత్ర కథను రూపొందించారు.
ఇందులో ఏటిఎం క్యూ లైన్లలో నిల్చుని ప్రేమించుకునే ఇద్దరు ప్రేమికుల జీవితం ఎలా సాగింది ? లైఫ్లో సెటిలవ్వడానికి ముగ్గురు కుర్రాళ్ళు ఏయే దారుల్ని ఎంచుకున్నారు ? వారికి జీవితం ఏయే పాఠాలు నేర్పింది అనేది ఈ సినిమాలో అంతర్గతంగా నడిచే అంశాలు.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలోని ప్రధాన బలం అంటే దర్శకుడు సునీల్ రెడ్డి ఎంచుకున్న అంశమే అని చెప్పాలి. దేశంలోని ప్రతి పౌరుడికి తెలిసిన, ప్రతి మనిషి ప్రభావితుడైన ఈ పాయింట్ నే సినిమాగా రూపొందించడం ఆకర్షించే అంశం. డీమానిటైజేషన్ విధానంలో వరుసగా చోటు చేసుకున్న అంశాలను ఒక్కొక్కటిగా చూపుతూ వాటి పర్యవసానాలకు సామాన్యులు ఎలా బాధపడ్డారు, ఈ విధానం వలన వారిలో వచ్చిన మార్పులేంటి, ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రభుత్వోద్యోగులే తమ స్వప్రయోజనాల కోసం ఎలా దుర్వినియోగం చేశారు అనే అంశాలను వివరించే ప్రయత్నం బాగుంది.
ఈ కరెన్సీ బ్యాన్ వలన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు అవసరం, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం యొక్క భవిష్యత్ లక్ష్యం నెరవేరాలంటే యువత ఏం చేయాలి. నిరుద్యోగ సమస్య వలన యువత ఎలాంటి తప్పుదోవలు తొక్కుతోంది అనే విషయాలను టచ్ చేయడం ఆకట్టుకుంది. హీరోయిన్ కారుణ్య చౌదరి పెర్ఫార్మెన్స్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి కరెన్సీ బ్యాన్ అంశాన్ని తీసుకుని దాని ప్రయోజనాలు, నష్టాలు, ప్రజల ఇబ్బందులు, దాని లక్ష్యం ఏంటి అనే విషయాలను వివరించాలనుకోవడం బాగానే ఉన్నా వాటిని స్క్రీన్ పై ఆవిష్కరించిన విధానం మాత్రం పూర్తిగా విఫలమైంది. దర్శకుడు జనాలకు బాగా పరిచయమున్న డీమానిటైజేషన్ అనే అంశాన్ని హాస్యాస్పదంగా చెప్పాలనుకున్నప్పుడు దానికి ఆసక్తికరమైన కథనాన్ని, మంచి కామెడీ కంటెంట్ ను జోడించి వాటిని నడపగల సమర్థులైన నటీనటులతో రంగంలోకి దిగాల్సింది. కానీ సరైన కామెడీ కంటెంట్ లేకపోవడం, నటనలో ప్రావీణ్యం లేని వ్యక్తులు నటించడం వలన సినిమా పూర్తిగా దెబ్బతింది.
ఒక్క హీరోయిన్ తప్ప మిగిలిన నటీనటులు, హీరో, అతని స్నేహితులు, మిగతా అందరూ నటన పరంగా ఏమాత్రం మెప్పించలేకపోయారు. వారి పెర్ఫార్మెన్స్ చాలా అసహజంగా ఉంటూ సినిమాకు ఉపయోగపడకపోగా నష్టాన్ని చేకూర్చింది. ముఖ్యంగా ముగ్గురు కుర్రాళ్లకు క్రిమినల్ సలహాలిచ్చే ఒక పాత్ర పై నడిపిన కామెడీ ట్రాక్ అయితే నవ్వించకపోగా పరమ చిరాకు పెట్టింది. ఏ అంశానికీ సరైన ఎండింగ్ ఇవ్వకపోవడం కూడా నిరుత్సాహానికి గురిచేసింది. మధ్యలో వచ్చే పాటలు అడ్డుతగులుతున్నట్టే ఉన్నాయి. ఫ్రేమ్ క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉండి సినిమా చూస్తున్న ఫీల్ అస్సలు కలగలేదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు మంచి టాపిక్ తీసుకున్నా కూడా దాన్ని ప్రభావవంతంగా స్క్రీన్ పై ఆవిష్కరించడంలో విఫలమయ్యారు. శివరామ్ కెమెరా పనితనం అస్సలు బాగోలేదు. శామ్యుల్ కల్యాణ్ ఎడిటింగ్ కూడా సినిమాకి అస్సలు ఉపయోగపడలేదు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం ఏమంత వినదగ్గదిగా లేదు. నిర్మాతలు పాటించిన చిత్ర నిర్మాణ విలువలు ఏ కోశానా మెప్పించలేదు.
తీర్పు :
మొత్తం మీద ఈ ‘ఏటీఎం వర్కింగ్’ అనే చిత్రం కోసం దర్శకుడు ఎంచుకున్న ప్రధానాశం బాగున్నా దాన్ని తెరపై వినోదభరితంగా చూపడంలో అయన పూర్తిగా విఫలమవడం, హీరోయిన్ మినహా పరిపక్వత లేని మిగతా నటీనటుల నటన, చిరాకు పెట్టే కామెడీ ట్రాక్ లతో సినిమా ఏమాత్రం ఆకట్టుకోని విధంగా తయారైంది. డీమానిటైజేషన్ సమయంలో మనం ప్రత్యక్షంగా అనుభవించిన, చూసిన, విన్న విషయాలను తెరపై గుర్తు చేసుకోటం తప్ప ఈ చిత్రంలో ఇంకేం దొరకదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team