సమీక్ష 2 : దమ్ము – ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకునే దమ్ము

సమీక్ష 2 : దమ్ము – ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకునే దమ్ము

Published on Apr 27, 2012 3:27 PM IST
విడుదల తేది : 27 ఏప్రిల్ 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
దర్శకుడు : బోయపాటి  శ్రీను
నిర్మాతలు : అలెగ్జాండర్ వల్లభ
సంగీత దర్శకుడు: కీరవాణి
తారాగణం : ఎన్ టి ఆర్, త్రిష, కార్తిక

సింహ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బోయపాటి శ్రీను మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై అలెగ్జాన్డర్ వల్లభ నిర్మించిన చిత్రం ‘దమ్ము’. ఎన్టీఆర్ సరసన త్రిషా, కార్తీక నటించిన ఈ చిత్రం ఈరోజే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రేక్షకుల తీర్పును కోరుతూ వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:
రామచంద్ర (ఎన్టీఅర్) హైదరాబాదులో తన స్నేహితుడు (అలీ)తో కలిసి ఉంటుంటాడు. డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేస్తుంటాడు. తన కల్ల ముందు ఎవ్వరికి అన్యాయం జరిగినా ఊరుకోడు. సత్య (త్రిషా) అనే అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే తనకు ఒక పెద్ద కుటుంబం ఉండాలని తెలుసుకొని తను గొప్పింటి కుటుంభంలో పుట్టినట్లు అబద్ధం చెబుతాడు. తాను గొప్పింటి కుటుంబానికి చెందిన వాడిని అని చూపించే ప్రయత్నంలో రాజా వారు (కోట శ్రీనివాసరావు) తన కుటుంభ వారసత్వాన్ని మోసేందుకు ఒక యువకుడిని వెతుకుతున్నారని తెలిసి వారి కుటుంబానికి దత్త పుత్రిడిగా వెళతాడు. ఈ దత్తత తీసుకున్న విషయం ఎవరికి చెప్పొద్దు అంటూ మాట తీసుకుని రామచంద్రగా ఉన్న అతని పేరుని ‘విజయధ్వజ శ్రీసింహా’గా మారుస్తారు. అటు నుంచి రాజా వారి స్వస్థలం వెళతారు. ఆ వూరికి వెళ్ళిన విజయధ్వజకి ఎదురైన పరిస్తులేమిటి? అసలు రాజావారి వంశం నిలబెట్టడానికి రామచంద్రనే ఎందుకు ఎంచుకున్నారు? ఇవన్ని తెలుసుకోవాలంటే దమ్ము సినిమా చూడల్సిందే.

ప్లస్ పాయింట్స్:
ఈ చిత్ర హీరో అయిన ఎన్టీఆర్ రామచంద్ర మరియు విజయధ్వజ శ్రీసింహ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో అలరించాడు. రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించాడు. ముఖ్యంగా విజయధ్వజ పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఇంటర్వెల్ ముందు సెంటిమెంట్ సన్నివేశాల్లో మరియు చిత్ర రెండవ భాగంలోని కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు. డాన్సులు గత చిత్రాల స్థాయిలో చేయనప్పటికీ అభిమానులని అలరించే స్థాయిలో ఉన్నాయి. త్రిషా మొదటి భాగంలో అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, కార్తీకకి నీలవేణి పాత్రలో నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది. నీలో ఉంది దమ్ము, వాస్తు బాగుందే పాటల్లో కథానాయికల అందాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఎన్టీఆర్ చెల్లెలిగా నటించిన అభినయ పేరులోనే కాదు నటనలో కూడా అధ్బుతమైన అభినయం పలికించింది. నాజర్, కోట శ్రీనివాసరావు తమ అనుభవాన్నంత రంగరించి అలరించారు. సుమన్, భానుప్రియ తమ పాత్ర పరిధిమేరకు నటించారు. చాలా రోజుల తరువాత నటుడు వేణుకి ఒక ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అలీ కొన్ని సన్నివేశాల్లో బాగానే నవ్వించాడు.

మైనస్ పాయింట్స్:
సినిమా మొదలై మొదటి పది నిమిషాల వరకు ఆసక్తికరంగా సాగుతున్నప్పటికీ ఆ తరువాత ఫైట్స్ మరియు రామచంద్ర, సత్య మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రూలర్, నీలో ఉంది దమ్ము పాటలు సరైన టైమింగ్ లేక కొంత అసహనానికి గురి చేస్తాయి. చిత్ర దర్శకుడు ఎంచుకున్న కథ బావున్నప్పటికీ అది తెరపై ఆకట్టుకొనే స్థాయిలో చూపించడంలో విఫలమయ్యాడు. ఇంటర్వెల్ ముందు సన్నివేశాలు మరియు పక్క ఊరి జమీందారులను చంపే సన్నివేశాలు చాలా బాగా తీసినప్పటికీ ఆ ఎమోషన్ కంటిన్యూ చేయడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. రూలర్ పాట ఆడియోలో విని చాలా ఆశించి వెళ్ళిన వారికి నిరాశని మిగిల్చారు. భోషాణం పాత్రలో బ్రహ్మానందం పాత్ర ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం:
సంభాషణల రచయిత ఎమ్.రత్నం రాసిన కొన్ని సంభాషణలు చాలా బావున్నప్పటికీ కొన్ని చోట్ల ద్వందార్ధాలు దొర్లాయి. అవి మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని మాత్రం ఇబ్బంది కలిగిస్తాయి. అదే విధంగా స్క్రీన్ప్లేలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అవి సరిదిద్దుకుని ఉంటే బావుండేది. ఆర్ధర్ విల్సన్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఫైట్స్ మాస్ ప్రేక్షకులని ఆకట్టుకున్న్నప్పటికీ వైర్ వర్క్ తగ్గిస్తే బావుంటుంది. కీరవాణి సంగీతంలో రాజా వాసిరెడ్డి, ఓ లిల్లీ పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం విషయంలో తనకి తానే సాటి అనిపించుకున్నాడు. నిర్మాణాత్మక విలువల విషయంలో నిర్మాత వల్లభ ఎక్కడ తగ్గకుండా సినిమాని గ్రాండ్ గా చూపించారు.

తీర్పు:
దమ్ము సినిమా ఎవరైతే పక్కా మాస్ సినిమాలు కోరుకుంటారో వారి కోసమే తీసిన సినిమా. ఈ సినిమా పై ఉన్న భారీ అంచనాలు ఒక విధంగా మైనస్ అని చెప్పుకోవాలి. దమ్ము సినిమా పై ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళండి. ఎన్టీఆర్ అభిమానులకు మరియు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా దమ్ము.

123తెలుగు.కాం రేటింగ్ : 3.25/5

అశోక్ రెడ్డి -ఎం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు