విడుదల తేదీ : జూన్ 23, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : హరీశ్ శంకర్
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు : అల్లు అర్జున్, పూజ హెగ్డే
‘సరైనోడు’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన తాజా చిత్రమే ‘దువ్వాడ జగన్నాథం’. హరీశ్ శంకర్ డైరెక్షన్లో, దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాపై మొదటి నుండి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇన్ని అంచనాలు మధ్య ఈరోజే థియేటర్లలోకి వచ్చిన జగన్నాథం అలియాజ్ డీజే ఏ మేరకు ఆకట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
కథ :
విజయవాడలోని ఒక అగ్రహారంలో పుట్టిన బ్రాహ్మణ యువకుడే ‘దువ్వాడ జగన్నాథం’. చిన్నప్పటి నుండి సభ్య సమాజంలో జరిగే అన్యాయాలను చూసి తట్టుకోలేని జగన్నాథం వాటిని అణచడానికి ఏదో ఒకటి చెయ్యాలని తపనపడుతూ పెరిగి పెద్దై వంటవాడిగా కొనసాగుతుంటాడు. అలా తను క్యాటరింగ్ చేస్తున్న ఒక పెళ్ళిలో పూజ (పూజ హెగ్డే)ను చూసి ప్రేమలో కూడా పడతాడు. కానీ ఆమె మాత్రం జగన్నాథాన్ని ప్రేమించదు.
అదే సమయంలో హైదరాబాద్లో జరుగుతున్న అన్యాయాలను డీజే అనే ఒక వ్యక్తి ఎదిరిస్తూ వాటికి కారణమైన వాళ్ళను చంపేస్తూ ఒక పెద్ద స్కామ్ కు మూలమైన రొయ్యల నాయుడు (రావు రమేష్) ను టార్గెట్ చేస్తాడు. దాంతో రొయ్యల నాయుడు డీజేను అంతం చెయ్యాలనే ప్రయత్నంలో జగన్నాథాన్ని చంపబోతాడు. అసలు రొయ్యల నాయుడు జగన్నాథాన్ని ఎందుకు చంపాలనుకుంటాడు ? డీజే ఎవరు ? అతనికి జగన్నాథానికి సంబంధం ఏంటి ? ఈ గొడవల మధ్యలో జగన్నాథం ప్రేమ ఏమైంది ? చివరికి రొయ్యల నాయుడి కథ ఎలా ముగిసింది.. ఎవరు ముగించారు ? అనేదే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు హరీశ్ శంకర్ ఎంచుకున్నది రోటీన్ కథే అయినా తెలివిగా అందులో దువ్వాడ జగన్నాథం అనే ప్రత్యేక పాత్రను ఇన్వాల్వ్ చేసి సినిమా మొదటి అర్థ భాగాన్ని చాలా బలంగా, ఎంటర్టైనింగా తయారుచేశారు. ఇక ఆ పాత్ర చేసిన అల్లు అర్జున్ కూడా స్తోత్రాలు, మంత్రాలు చెబుతూ ఒక అచ్చమైన బ్రాహ్మణుడి బాడీ లాంగ్వేజ్, మాట తీరుతో ఎలాంటి లోటు లేకుండా రాణించి పాత్రకు ప్రాణం పోసి ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలనని నిరూపించాడు. అలాగే స్టైలిష్ గా, దూకుడుగా ఉండే డీజేగా కూడా మెప్పించాడు.
అలా హరీశ్ శంకర్ హ్యూమర్, బన్నీ పెర్ఫార్మెన్స్ కలిసి ఫస్టాఫ్ ను నిలబెట్టేశాయి. ఇక హరీశ్ శంకర్ అయితే హీరోను గుడి గోపురం మీద పరిచయం చేసి, హీరోయిన్ ను మొదటి షాట్లోనే గ్లామరస్ గా చూపించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అంతేగాక జగన్నాథం పాత్రలో ద్వారా మంచి కామెడీని జనరేట్ చేసి పలుసార్లు నవ్వుకునేలా చేశాడు. సినిమా ముగింపును కూడా రొటీన్ గా కాకుండా కొంచెం భిన్నంగా ట్రై చేసిన హరీశ్ శంకర్ ప్రయత్నం మెచ్చుకోదగిన అంశం. ఇక ఫస్టాఫ్, సెకాండాఫ్లలో కనిపించే సుబ్బరాజు పాత్ర కూడా కొంచెం భిన్నంగా ఉంటూ, క్లైమాక్స్ లో కీలకంగా ఉండి ఆకట్టుకుంది.
బన్నీ, పూజ హెగ్డేల మధ్య నడిచే లవ్ ట్రాక్ రొమాంటిక్ గా ఉంది. పూజ హెగ్డేకు నటన కనబర్చే ఛాన్స్ పెద్దగా లేకపోయినా అందంతో గిలిగింతలు పెడుతూ మళ్ళీ ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అనుకునేలా చేసింది. విలన్ గా నటించిన రావు రమేష్ రొయ్యల నాయుడిగా కనిపిస్తూ వేషంలోనూ, భాషలోనూ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో తన తండ్రి రావు గోపాల్ రావ్ చేసిన రొయ్యల నాయుడి పాత్రను గుర్తు చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాకి ప్రధాన బలహీనత సెకండాఫ్. ఫస్టాఫ్ ఇంటర్వెల్ సమయానికి సినిమాలోని ట్విస్ట్ రివీల్ అయిపోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది సులభంగా ఊహించేయవచ్చు. దాంతో సన్నివేశాల్లో పెద్దగా ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. దాంతో సినిమా కొన్ని సన్నివేశాలలో మినహా చాలా వరకు సినిమా చప్పగా సాగింది. అలాగే మొదటి అర్థ భాగంలో మంచి ఫన్ ఇస్తూ ఆసక్తికరంగా కనిపించిన జగన్నాథం పాత్ర సెకండాఫ్లో పెద్దగా కనిపించకపోవడంతో అప్పటిదాకా అలరించిన ఎంటర్టైన్మెంట్ కాస్త మిస్సైయింది.
ఇక మరో ప్రధాన నిరుత్సాహం ఆశించిన రీతిలో బన్నీ డ్యాన్సులు లేకపోవడం. బన్నీ సినిమా అంటేనే అభిమానులు నృత్యాల మీద భారీ ఆశలు పెట్టుకుంటారు. మాస్ ఆడియన్స్ అయితే ఆయన వేసే సరికొత్త స్టెప్పులను చూడాలని తహతహలాడుతారు. కానీ ఈ సినిమాలోని పాటల్లో చెప్పుకోదగిన మూమెంట్స్ లేవు. ఇక సినిమాలో బలమైన కథ ఎలాగు లేదు కాబట్టి హరీశ్ శంకర్ సినిమాను రొటీన్ గానే ముగించారు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు హరీశ్ శంకర్ రచయితగా, దర్శకుడిగా తన ప్రతిభను ఫస్టాఫ్ వరకే పరిమితం చేశాడు. ఒక రొటీన్ కథకు జగన్నాథం అనే ఎంటర్టైనింగ్ పాత్రను జోడించి ఫస్టాఫ్ వరకే అలరించగలిగిన ఆయన సెకండాఫ్లో మాత్రం నిరుత్సాహం కలిగించారు. కానీ జగన్నాథం పాత్రకు ఆయన రాసిన డైలాగులు, కామెడీ ట్రాక్, అలాగే హైపర్ గా ఉండే డీజే పాత్ర స్వభావం బాగా ఆకట్టుకున్నాయి.
ఇక ఆయాంక బోస్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంది. దేవిశ్రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల సంగీతం ఎక్కడా బోర్ అనిపించకుండా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ విభాగం బాగానే ఉన్నా రెండవ అర్థ భాగంలోని రొటీన్ సన్నివేశాల్ని కొన్నింటినైనా తొలగించాల్సింది. దిల్ రాజు పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.
తీర్పు :
అల్లు అర్జున్ చేసిన ‘దువ్వాడ జగన్నాథం’ అనే ఈ భిన్నమైన ప్రయత్నం బాగానే వర్కవుటైంది. అగ్రహారం యువకుడిగా అలరించే జగన్నాథం పాత్ర, అందులోని కామెడీ, పూజ హెగ్డే అందం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేవిగా ఉండగా మరొక షేడ్ డీజే మాస్ ఆడియన్సుకు బాగా కనెక్టవుతుంది. కానీ బలమైన కథ లేకపోవడంతో సెకండాఫ్ సినిమా రొటీన్ గా ఉండటం, బన్నీ ఆశించిన స్థాయిలో డ్యాన్సులు చేయకపోవడం మాత్రం నిరుత్సాహపరుస్తాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ సినిమా నటుడిగా అల్లు అర్జున్ కు మంచి పేరు తేవడమే కాకుండా ఆయన కెరీర్లోని మంచి సినిమాల్లో ఒకటిగా కూడా నిలుస్తుంది.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team