విడుదల తేదీ : జూలై 8, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : నందు మల్లెల
నిర్మాత : ప్రదీప్ చంద్ర, మోహన్ అందే
సంగీతం : విజయ్ బుల్గేనిన్
నటీనటులు : అనిల్, మహిమ
‘వారాహి చలన చిత్రం’ బ్యానర్లో వచ్చే సినిమాలంటే బాగుంటాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఈ బ్యానర్ తమ సొంత సినిమాలనే గాక బాగుంటే వేరే చిన్న సినిమాల్ని కూడా తమ బ్యానర్లో రిలీజ్ చేస్తుంది. ఇప్పుడలా వారాహి బ్యానర్ ద్వారా విడుదలకానున్న చిత్రమే ఈ ‘రెండు రెళ్ళ ఆరు’. దర్శకుడు నందు మల్లెల దర్శకత్వంలో రూపొంది ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
రాజు (నరేష్) యొక్క భార్య, రావు (రవి కాలే) భార్య ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో ఒకే సమయంలో ప్రసవిస్తారు. రాజుకు మగబిడ్డ, రావుకు ఆడ బిడ్డ పుడతారు. కానీ ఒక విపత్కర పరిస్థితిలో ఆ ఇద్దరు కూడా తమ బిడ్డల్ని మార్చేసుకుంటారు. కానీ సొంత పిల్లల మీదున్న ప్రేమతో వాళ్ళు ఒకే కాలనీలో నివసిస్తుంటారు.
అలా మార్చబడ్డ ఆ ఇద్దరు మ్యాడీ (అనిల్), మ్యాగీ (మహిమ) ఎదురెదురు ఇళ్లలో ఉంటూ ఎప్పుడూ గొడవపడుతూ పెరుగుతారు. ఎప్పుడూ బద్ద శత్రువుల్లా ఉండే వారు ఒకరోజు ప్రేమికుల్లా మారిపోతారు. ఒకరంటే ఒకరికి పడని వారు ఎలా ప్రేమలో పడతారు ? అందుకు కారణమైన పరిస్థితులేమిటి ? అసలు వాళ్ళ తండ్రులు వాళ్ళను ఎందుకు మార్చుకున్నారు ? అనేదే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో అమితంగా ఆకట్టుకునే అంశం స్టోరీ లైన్. హీరో హీరోయిన్లు ఒకరి ఇంట్లో వేరొకరు పెరగడం అనేది కాస్త కొత్తగా అనిపించింది. అంతేగాక అందుకు కారణమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో వాళ్ళ తండ్రులు తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగానే కాక వాస్తవానికి చాలా దగ్గరగా కూడా ఉంటుంది. ఈ అంశాలతో తర్వాత నడవబోయే కథ మీద, అందులోని హీరో హీరోయిన్ల పాత్రల మీద క్యూరియాసిటీ ఏర్పడింది. అలాగే తండ్రులుగా నరేష్, రవి కాలెల నటన చాలా బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు.
ఫస్టాఫ్ మంచి ఆరంభంతో, కొన్ని సరదాగా సన్నివేశాలతో అలా అలా సాగిపోగా ఇంటర్వెల్ ట్విస్ట్ రొటీన్ గానే ఉన్నా ఊహించని సమయంలో వచ్చి సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తించింది. అలాగే రెండవ అర్ధభాగంలో తాగుబోతు రమేష్ కామెడీ బాగానే నవ్వించింది. ఇంటర్వెల్ సన్నివేశానికి కనెక్ట్ చేస్తూ సెకండాఫ్లో దర్శకుడు నందు మల్లెల ఫ్లే చేసిన కథనం కొంచెం తెలివిగా అనిపించింది.
మైనస్ పాయింట్స్ :
స్టోరీ లైన్ కొత్తగానే ఉన్నా దర్శకుడు దానికి రాసిన స్క్రీన్ ప్లే, ముగింపు మాత్రం చాలా చాలా రొటీన్ గా ఉన్నాయి. హీరో, హీరోయిన్లు పరిచయంలేని వాళ్ళు కావడంతో ఆ రెండు పాత్రల ద్వారా పండాల్సిన ఎమోషన్ పండలేదు. దర్శకుడు కూడా ఆ పాత్రల్లో ఒక్క సమస్య మినహా పెద్దగా ప్రత్యేక ఏమీ లేకుండా సాదా సీదాగానే వాటిని డిజైన్ చేశారు.
సినిమా మొత్తం చూస్తే దర్శకుడు తన లోపల ఉన్న ఎమోషన్ ను పాత్రల మాటల ద్వారా వ్యక్తపరచగలుగుతున్నాడు తప్ప పాత్రల నటనలో, సన్నివేశాల చిత్రీకరణలో బయటపెట్టలేకపోయాడని స్పష్టంగా అర్థమైంది. హీరో, హీరోయిన్ల మధ్య లవ్, ఎమోషనల్ ట్రాక్స్ చల్లగానే సాగిపోయాయి తప్ప ఎక్కడా రొమాంటిక్ ఫీల్ ను గాని, బాధను కానీ కలిగించలేకపోయాయి. ఇక మధ్యలో వచ్చే పాటలైతే పెద్దగా ఆకట్టుకునేవిగా లేవు.
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకత్వ విభాగానికి వస్తే డైరెక్టర్ నందు మల్లెల కొత్తగా అనిపించే లైన్ తో కథను అల్లడానికి చేసిన ప్రయత్నం ఫస్టాఫ్ వరకే ఫలించగా సెకండాఫ్ లో విఫలమైంది. బలమైన, సందర్భానుసారమైన సన్నివేశాల్ని రాసుకోవడంలో పట్టు చూపకపోవడం, హీరో హీరోయిన్ల నుండి సమర్ధమైన నటనను రాబట్టుకోలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. అమరనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నా కొన్ని చోట్ల మాత్రం షార్ట్ ఫిలిమ్స్ ఛాయలు కనబడ్డాయి. విజయ్ బుల్గేనిన్ సంగీతం ఏమంత ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ విభాగం పని తీరు కొన్ని చోట్ల బాగుంది.
వారాహి చలన చిత్రం బ్యానర్ అధినేత సాయి కొర్రపాటి గతంలో కొన్ని చిన్న సినిమాల్ని కంటెంట్ నమ్మి కొన్నట్లే ఈ సినిమాను తీసుకున్నారు. ఆయన వల్లనే మంచి ప్రయత్నంగా అనిపించే ఈ సినిమాకి గుర్తింపుతో పాటు విడుదలకు అవసరమైన సపోర్ట్ లభించి జనాల్లోకి ఎఫెక్టివ్ గా రాగలిగింది. కాబట్టి ఒక నిర్మాతగా ఆయన నూరు శాతం సక్సెస్ అయ్యారు.
తీర్పు :
వారాహి చలన చిత్రం బ్యానర్ ద్వారా విడుదలైన ఈ ‘రెండు రెళ్ళ ఆరు’ చిత్రం మంచి స్టోరీ లైన్, పర్వాలేదనిపించే ఫస్టాఫ్ కథనం, అలరించిన సెకండాఫ్ కామెడీతో మంచి ప్రయత్నంలానే అనిపించింది. కానీ సెకండాఫ్ కథనం కాస్తంత రొటీన్ కావడం, హీరో హీరోయిన్లు పరిచయంలేని వాళ్లవడం మూలాన ఈ మంచి ప్రయత్నం ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team