విడుదల తేదీ : జూలై 28, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : సంపత్ నంది
నిర్మాత : జె. భగవాన్, జె. పుల్లారావ్
సంగీతం : థమన్
నటీనటులు : గోపీచంద్, హన్సిక, క్యాథరిన్ థ్రెస
మ్యాచో మ్యాన్ గోపీచంద్, సంపత్ నందిల కలయికలో వచ్చిన ‘గౌతమ్ నంద’ చిత్రం ఈరోజే విడుదలైంది. ఆరంభం నుండి మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
ప్రపంచంలోని టాప్ బిలీనియర్లలో ఒకరైన కృష్ణ మూర్తి కొడుకు గౌతమ్ (గోపీచంద్) అసలు తానెవరు, తనకంటూ ఉండే ఐడెంటిటీ ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నంలో అనుకోకుండా నందు (గోపీచంద్) ను కలుసుకుంటాడు. నందు ఏమో బస్తీలో పుట్టి, పేదరికం అనుభవిస్తూ ఎలాగైనా ధనవంతుడు కావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు.
అలా రెండు విభిన్న నైపథ్యాలు కలిగిన గౌతమ్, నందులు ఒక ఒప్పందం మీద ఒకరి స్థానాల్లోకి మరొకరు వెళతారు. అలా గుర్తింపు మార్చుకున్న ఆ ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ? వాళ్ళ కొత్త పరిస్థితులు వాళ్ళను ఏ విధంగా మార్చాయి ? చివరి వారి జీవితాలు ఎలాంటి గమ్యం చేరాయి ? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమా విజువల్స్ చూడటానికి చాలా బాగున్నాయి. ఉన్నత స్థాయి నిర్మాణ విలువలు తోడవడంతో దర్శకుడు సంపత్ నంది ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ప్రతి విజువల్ ను ఖరీదుగా తెరకెక్కించారు. ధనవంతుడైన గౌతమ్ లైఫ్ స్టైల్ ను పరిచయం చేయడం కోసం సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్, భవంతులు, కార్లు, యాక్ససరీస్ అన్నీ ఒరిజినల్ బ్రాండ్స్ కావడంతో నిజంగా ఒక బిలీనియర్ కొడుకు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు కనబడింది. ఇక రిచ్ కుర్రాడిగా గోపీచంద్ స్టైలిష్ లుక్ బాగుంది. రెండు విభిన్న పాత్రల్లో ఆయన నటన ఆకట్టుకుంది. ఈ సినిమా ఆయనకు ప్రయోగాలకు తగిన హీరో అనే కొత్త ఇమేజ్ ను ఇస్తుందని కూడా చెప్పొచ్చు.
దర్శకుడు సంపత్ నంది ఫస్టాఫ్ మొత్తాన్ని గౌతమ్, నందుల జీవితాలను పరిచయం చేయడం, మధ్యలో మధ్యలో వెన్నెల కిశోర్, బిత్తిరి సత్తిల కామెడీ, హన్సిక లవ్ ట్రాక్ తో కొంచెం పర్వాలేదనే స్థాయిలో లాగించేసి సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో మలుపును, క్లైమాక్స్ ముగింపును ప్రయోగాత్మకమైన రీతిలో ఇచ్చి కొంచెం కొత్తదనం, కథ చివర్లో కాస్తంత బలం కనబడేలా చేశాడు. ఇక సంపత్ నంది స్పెషల్ సాంగ్ ‘బోలె రామ్’ చూడటానికి, వినడానికి బాగుంది.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు సంపత్ నంది సినిమా చివర్లో బలమైన ట్విస్ట్, ముగింపు ఇచ్చినా ఓవరాల్ కథను చూసినట్టైతే పాతదే. ఒకేలా ఉండే ఇద్దరు హీరోలు స్థానాలు మార్చుకోవడం అనేది చాలా సినిమాల్లో చూసినదే. అందుకే సెకండాఫ్ ఆరంభం నుండి ప్రీ క్లైమాక్స్ వరకు కథనం నిరుత్సాహంగా సాగింది. చాలా సన్నివేశాలను కథనంలోకి బలవంతంగా ఇరికించినట్టు తోచింది. ఇద్దరు అందమైన హీరోయిన్లు ఉన్నా కూడా బలమైన రొమాంటిక్ ట్రాక్ నడపలేడపోయాడు దర్శకుడు. ఇక ఫ్యామిలీ ఎమోషన్ బాగున్నా అవసరానికి మించి ఎక్కువైనట్టు తోచాయి.
సాధారణంగా ఒక పాత కథను చెప్పాలనుకున్నప్పుడు ప్రేక్షకుడు అది పాత కథే కదా అనే నిరుత్సాహంలోకి వెళ్లిపోయేలోగా రొమాంటిక్ ట్రాక్ లేదా నవ్వించే కామెడీ లేదా కథనంలో రెండు మూడు బలమైన మలుపుల్ని లేదా ఇంకేదైనా బలమైన ఎలిమెంట్ మీద సినిమాను నడిపి వాళ్ళ దృష్టిని మళ్లించి పాత కథే అయినా కొత్తగా, ఎంటర్టైనింగా చెప్పారు అనుకునేలా చేయాలి. కానీ ఇక్కడ ఆ ప్రయత్నం పూర్తి స్థాయిలో జరగలేదు. అందుకే సినిమా కొన్ని చోట్ల మరీ నిరుత్సాహంగానే సాగింది.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫర్ సౌందర్ రాజన్ కెమెరా పనితనం చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనబడుతూ మంచి అనుభూతిని ఇచ్చింది. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడింది. ఇక థమన్ సంగీతం రెండు పాటల వరకే బాగుంది. ఎడిటింగ్ బాగానే ఉంది. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మాణ విలువలు సినిమా స్థాయిని బాగా పెంచాయి.
ఇక దర్శకుడు సంపత్ నంది పాత కథను కొత్తగా చెప్పే ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు కానీ పర్వాలేదనిపించే ఫస్టాఫ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లను బాగానే హ్యాండిల్ చేసి మొత్తానికి సినిమాను గట్టెక్కించే పనితనం కనబర్చారు.
తీర్పు :
గోపీచంద్, సంపత్ నందిలు కలిసి చేసిన ఈ ప్రయత్నం పర్వాలేదనించే స్థాయిలో ఉంది. మంచి నిర్మాణ విలువలతో కూడిన విజువల్స్, పర్వాలేదనిపించే ఫస్టాఫ్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, బాగుందనిపించే క్లైమాక్స్, గోపీచంద్ నటన ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా పాత కథను కొత్తగా చెప్పే ప్రయత్నంలో సంపత్ నంది కొంతమేర విఫలమవడం, అనవసరమైన, బోరింగ్ సన్నివేశాలు కథనంలో అడ్డుపడుతుండటం నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే కొంచెం రొటీన్ మేకింగ్ ను తట్టుకుంటే ‘గౌతమ్ నంద’ ఈ వారాంతంలో చూడదగిన సినిమాగా నిలుస్తుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team