విడుదల తేదీ : ఆగష్టు 04, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : రవివర్మ వరదరాజు
నిర్మాత : ఎస్. సరిత
సంగీతం : బాలు స్వామి
నటీనటులు : శ్రీనాథ్, రచ్చ రవి, కిర్రాక్ ఆర్పీ, సాక్షి కక్కర్
ప్రస్తుతం తెలుగులో హర్రర్ కామెడీ అంటే చాలా మంచి క్రేజ్ ఉంది. ఆ జోనర్ లో చాలా సినిమాలు వచ్చిన కొత్త సినిమాలు మరల ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. దెయ్యంతో నడిపించే కామెడీకి తెలుగు జనాలు ఫిదా కావడం, ఆపై తక్కువ బడ్జెట్ తో పూర్తి కావడం వంటి కారణాల వలన చాలా మంది హర్రర్ కామెడీ కథలని ఎంచుకుంటున్నారు. అలా హర్రర్ జోనర్ లో వచ్చిన మరో చిత్రం ఇదేం దెయ్యం. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందామా.
కథ :
ముగ్గురు మిత్రులు రాజేష్(శ్రీనాథ్), ఆది(కిర్రాక్ ఆర్పీ), గిటార్ గిరి(రచ్చ రవి) ఎలాగైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి బయటకి వచ్చేస్తారు. వాళ్లకి అనుకోకుండా దిగంబర బాబా(జీవా) కలుస్తాడు. అతను ఊరి చివర ఉన్న బంగ్లాలో నెల రోజుల పాటు నిద్ర చేస్తే ప్రేమించిన అమ్మాయిలతో పెళ్లి అవుతుందని చెబుతాడు. వీళ్లలాగే మరో ముగ్గురు అమ్మాయిలు బాబా మాటలు నమ్మి అదే బంగ్లాకి వస్తారు. ఆ అమ్మాయిలతో ఈ ముగ్గురు మిత్రులు ప్రేమలో పడతారు. అయితే వాళ్లకి లవ్ ప్రపోజ్ చేయాలనుకునే టైం లో ఒక అనుకోని ప్రమాదంలో ఇరుక్కుంటారు. ఇంతకి వాళ్లకి ఎదురైనా ప్రమాదం ఏంటి? ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం నుంచి వాళ్ళు ఎలా బయట పడ్డారు? అనేది సినిమా కథ
ప్లస్ పాయింట్స్:
సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే దర్శకుడు హర్రర్ పాయింట్స్ అఫ్ వ్యూలో కథని చెప్పడం. దాంతో పాటు ముగ్గురు హీరోయిన్స్ అందాలు ఆరబోస్తూ కాస్తా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే కిర్రాక్ ఆర్పీ, రచ్చ రవి జబర్దస్త్ లో చేసిన విధంగానే నటిస్తూ టైమింగ్ పంచ్ లతో, బాడీ లాంగ్వేజ్ తో నవ్వించే ప్రయత్నం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకి మైనస్ పాయింట్స్ అంటే చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. ముందుగా దర్శకుడు ఏం చెప్పాలకున్నాడో ఆ విషయం అతనికే క్లారిటి లేకపోవడం వలన సినిమాలో స్క్రీన్ ప్లే ఎలా నడుస్తుందో, ఎందుకు నడుస్తుందో అర్ధం కాదు. అసలు సినిమాలో బేస్ లైన్ కూడా లేకుండా కేవలం సన్నివేశాలు రాసుకొని, దానికి ఏదో ఒక ముగింపు ఇవ్వాలి కాబట్టి ఇలా ఇద్దాం అన్నట్లు ఉంటుందే తప్ప సినిమా చూస్తున్న ఫీలింగ్ కలదు. షార్ట్ ఫిల్మ్ చూస్తున్నామా, ఫీచర్ ఫిల్మ్ చూస్తున్నామా అనేది ప్రేక్షకుడి తెలివికి అందని విషయం. సినిమా మొత్తం కామెడీ పరంగానే వెళ్తుంది. కాని దానిని కామెడీ అనాలో ఇంకేం అనాలో అస్సలు అర్థం కాదు.
ఇక నటుల పరంగా జబర్దస్త్ తో ఫేమస్ అయిన రచ్చ రవి, కిర్రాక్ ఆర్పీ షోలో చేసిన విధంగానే సినిమాలో చేసి కామెడీ పండించాలని ట్రై చేశారు. ఇక హీరోగా చేసిన కొత్త కుర్రాడు గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక హీరోయిన్స్ ముగ్గురు అందాల ప్రదర్శన చేయడంలో చూపించిన శ్రద్ధ యాక్టింగ్ లో చూపించలేదని అర్ధమవుతుంది. ఇక సీనియర్ నటులు జీవా, గౌతమ్ రాజు, జబర్దస్త్ అప్పారావు పెద్దగా చేయడానికి సినిమాలో ఏమీ లేదు.
సాంకేతిక విభాగం:
ఈ సినిమా ప్రొడక్షన్స్ వేల్యూస్ చాలా నాసిరకంగా ఉన్నాయి. సినిమాలో ఉన్న సాంగ్స్ లో చాలా వరకు ఒక గదిలో తీసేశారంటే ఏ మేరకు ఖర్చు పెట్టి ఉంటారో అర్ధమవుతుంది. ఇక దర్శకుడు రవి వర్మ వరదరాజులు సినిమాలో ఏ యాంగిల్లో కూడా మెప్పించాలేకపోయాడు. అతను చెప్పాలనుకున్న పాయింట్ మీద అతనికే క్లారిటి లేనప్పుడు ఇంక ప్రేక్షకులకి చెప్పడానికి ఏముంటుంది. సంగీత దర్శకుడు బాలు స్వామి మ్యూజిక్ అటు పాటల్లో గాని, ఇటు బ్యాగ్రౌండ్ లో గాని ఎక్కడా మెప్పించలేదు. ఇక సినిమాలో కెమెరా వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. అసలు చిత్రీకరణలో కెమెరా యాంగిల్స్ గాని, ఫ్రేమ్స్ గాని లైటింగ్ అరేంజిమెంట్స్ అన్ని విషయాల్లో తప్పులే కనిపిస్తాయి. ఇక సినిమాలో విషయం లేనపుడు ఎడిటర్ అయినా చేయడానికి ఏమీ ఉండదు.
తీర్పు:
ఇక ‘ఇదేం దెయ్యం’ పేరుతో వచ్చిన ఈ సినిమాలో దెయ్యం ఎవరో తెలీదు. దర్శకుడు ఏంఎం చెప్పాడో అర్ధం కాదు. ఆర్టిస్ట్ లు ఏం చేశారో తెలీదు. ఫైనల్ గా ఇది సినిమానో, షార్ట్ ఫిల్మో బోధపడదు. సినిమా చూసే ప్రేక్షకులకి ఏం చూస్తున్నామో అర్ధం కాదు. ఓవరాల్ గా ఎవరికీ అర్ధం కాని ఓ వింత ప్రయత్నమే ‘ఇదేం దెయ్యం’. కాబట్టి ఈ సినిమాకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team