విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : మహేష్ సూరపనేని
నిర్మాత : సుధాకర్ రెడ్డి, సౌందర్య, ప్రశాంతి, కృష్ణ విజయ్
సంగీతం : ఇళయరాజా, విశాల్ చంద్ర శేఖర్
నటీనటులు : నారా రోహిత్, నమిత ప్రమోద్
నారా రోహిత్ హీరోగా నూతన దర్శకుడు మహేష్ సూరపనేని డైరెక్ట్ చేసిన సినిమా ‘కథలో రాజకుమారి’. ట్రైలర్ తో బాగా ఆకట్టుకున్న ఈ సినిమా పాజిటివ్ హైప్ నడుమ ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఫలితమేమిటో ఒకసారి చూద్దాం..
కథ :
కేవలం విలన్ పాత్రలు మాత్రమే చేస్తూ ఉత్తమ ప్రతినాయకుడిగా వరుసగా అవార్డులందుకుని, స్టార్ స్టేటస్ తో వెలిగిపోయే అర్జున్ (నారా రోహిత్) నిజ జీవితంలో కూడా అదే ఇగోతో, నెగెటివ్ ఆలోచనలతో ఎవ్వర్నీ లెక్కచేయకుండా బ్రతుకుతుంటాడు. ఆ నెగెటివ్ నేచరే అతనికి వరుస అవకాశాలు వచ్చేలా చేస్తుంది కూడా.
అలా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్న అర్జున్ కు జీవితంలో ఒక బలీయమైన సంఘటన ఎదురై అతనిలోని విలనిజం, మూర్ఖత్వం మరుగునపడిపోతాయి. దాంతో అతనికి సినిమా ఛాన్సులు కూడా తగ్గుతాయి. అలా అవకాశాలు కోల్పోతున్న అర్జున్ ఒకరి సలహా మేరకు తన జీవితంలోనే ఇష్టంలేని వ్యక్తి సీత (నమిత ప్రమోద్) కు దగ్గరై ఆమె కష్టాలు పడుతుంటే చూసి తనలోని మూర్ఖత్వాన్ని తిరిగి బయటకు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో ఆతను సక్సెస్ అయ్యాడా లేదా ? చివరికి అతను ఎలా మారాడు ? ఆ మార్పుకు సీత ఎలా కారణమైంది ? అనేదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమా ఫస్టాఫ్ ఆరంభం ఆసక్తికరంగా బాగుంటుంది. ప్రధాన పాత్రధారి నార్ రోహిత్ ను సినిమాల్లో నటించే విలన్ గా పరిచయం చేసే ఓపెనింగ్ షాట్ చాలా బాగుంటుంది. ఒకానొకదశలో అదే సినిమా బ్యాక్ డ్రాప్ అయ్యుంటే, రోహిత్ అదే గెటప్‌లో సినిమా మొత్తం కనిపిస్తే బాగుంటుందనే ఆశ కూడా కలుగుతుంది. ఒక రీల్ విల విలన్ రియల్ లైఫ్‌లో కూడా అలానే ఉంటే ఎలా ఉంటాడో రోహిత్ తన పెర్ఫార్మెన్స్ తో చూపించాడు. ఒక వృత్తి రీత్యా, వ్యక్తిత్వం రీత్యా ప్రతినాయకుడి లక్షణాలున్న వ్యక్తి ఒక సంఘటనతో తనలోని విలనిజాన్ని కోల్పోవడం, తిరిగి దాన్ని పొందాలనుకోవడం అనే పాయింట్ చాలా బాగుంది.
కొత్త దర్శకుడు సూరపనేని మహేష్ ఫస్టాఫ్ సగం వరకు ఈ అంశాన్ని బాగానే ఎలివేట్ చేశాడు. అలాగే ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ కూడా సెకండాఫ్ మీద ఆశలు పెంచుతుంది. ఇక కథలో హీరో స్నేహితుడిగా నటించిన ప్రభాస్ శ్రీను తన టైమింగ్ తో మంచి కామెడీ చేశాడు. ఇళయరాజాగారు రెండు పాటలకు అందించిన సంగీతం చాలా బాగుంది. ఆ రెండు పాటలు వినడానికి కూడా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు తీసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా దానికి బలమైన కథ, కథనాలు రాయలేకపోవడంతో రిజల్ట్ తారుమారైంది. ఫస్టాఫ్ ఏదోలా పర్వాలేదనిపించినా సెకండాఫ్ ఆరంభం నుండే నిరుత్సాహపర్చడం మొదలుపెట్టేస్తుంది. దీనివలన ఫస్టాఫ్ పైకలిగిన కాస్త ఇంప్రెషన్ కూడా గాల్లో కలిసిపోయింది. ఇంటర్వెల్ సమయంలో ఇచ్చిన ట్విస్ట్ బాగుందనుకునేలోపు అది కాస్త మన భ్రమని దర్శకుడు తేల్చేయడంతో తర్వాత ఏం జరగబోతోందో అర్దమైపోయి అక్కడే సగం నీరసం ఆవహించేసింది. దర్శకుడు కథనంలో కొన్ని మంచి పరిణామాల్ని రాసుకున్నా అందుకు తగిన పరిస్థితుల్ని క్రియేట్ చేయడంలో తేలిపోయాడు.
ఇక సెకండాఫ్ ఆరంభం ఎలాగైతే నిరుత్సాహంగా మొదలైయిందో చివరి వరకు అలాగే కొనసాగింది. ఏదైనా ఒక ట్రాక్‌లో నడపాల్సిన కథనాన్ని కాసేపు అటు ఇంకాసేపు ఇటు చేసి మొత్తానికి పరమ రొటీన్ ఎండింగ్ ఇచ్చాడు మహేష్. హీరో మంచివాడిగా మారడం, చిన్నతనంలో హీరోయిన్ తో అతనికి శత్రుత్వం ఏర్పడటం వంటి కీలక సంఘటనల వెనుక బలమైన కారణాలేవీ కనిపించవు. ఒకానొక దశలో హీరో లక్ష్యం ఒకటైతే దర్శకుడు సినిమాను తీసుకెళుతున్న గమ్యం మరొకటిగా ఉండి తలపట్టుకోవడం ప్రేక్షకుడి వంతైంది.
వీటికి తోడు హీరో స్నేహితులు, హీరోయిన్ కుటుంబ సభ్యులపై అనవసరమైన సన్నివేశాల్ని పెట్టి చిరాకు కలిగించారు. ఇక సినిమా క్లైమాక్స్ ను 30 నిముషాల ముందే ఊహించేయవచ్చు. దీంతో చివరి అరగంట పరీక్షగా అనిపించింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు మహేష్ సూరపనేని సినిమా కోసం కొత్త పాయింట్ నే ఎంచుకున్న దాన్ని సమర్థవంతంగా తెరపై ఆవిష్కరించడంలో విఫలమయ్యాడు. ఫస్టాఫ్ వరకు పర్వాలేదనిపించే కథనమే నడిపినప్పటికీ కథలో సెకండాఫ్ ను మరీ దారుణంగా తయారుచేసి ఫలితాన్ని తలకిందులు చేసుకున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా రెండు పాటలకు అందించిన సంగీతం చాలా బాగుంది.
ఇక మిగతా పాటలకు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం పర్వాలేదనిపించింది. నరేష్ కంచరన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అరకు లొకేషన్లను బాగానే చూపించాడు. కార్తీక్ శ్రీనివాస్ సెకండాఫ్‌లో కొన్ని అనవసర సన్నివేశాల్ని కత్తిరించి ఉండాల్సింది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
నారా రోహిత్ ఈసారి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. దర్శకుడు మహేష్ సూరపనేని రాసుకున్న పాయింట్ బాగున్నా దాని చుట్టూ మంచి చిత్రానికి కావాల్సిన బలమైన కథను, కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలమవడం వలన సినిమా రెండవ అర్థ భాగం భరించలేని విధంగా తయారైంది. దీంతో కొంత ఫస్టాఫ్, కొంచెం కామెడీ మినహా ఇందులో సంతృప్తినిచ్చే వేరే అంశాలేవీ దొరకవు. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రంలో రాజకుమారి ఉన్నా అతి ముఖ్యమైన కథ కథనాలు మాత్రం లేవు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team