విడుదల తేదీ : నవంబర్ 10, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : సుశీంథిరన్
నిర్మాత : చక్రి చిగురుపాటి
సంగీతం : డి.ఇమ్మాన్
నటీనటులు : సందీప్ కిషన్, విక్రాంత్, మెహ్రీన్ ప్రిజాద
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ద్విభాషా చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ‘నా పేరు శివ’ లాంటి క్రైమ్ థ్రిల్లర్ ను రూపొందించిన సుశీంథిరన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
సూర్య (సందీప్ కిషన్) కుటుంబం, స్నేహితులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అలాంటి సమయంలోనే సాంబశివుడు అనే రౌడీ మూలాన అతని జీవితంలో కష్టలు మొదలవుతాయి. అతని ప్రాణ స్నేహితుడు మహేష్ (విక్రాంత్) ప్రాణాలకు కూడా అపాయం ఏర్పడుతుంది.
అసలు సాంబశివుడు ఎవరు? అతను సూర్య జీవితంలోకి ఎందుకు ప్రవేశించాడు ? మహేష్ ను ఎందుకు చంపాలనుకున్నాడు ? సాంబ శివుడి నుండి సూర్య తాను స్నేహితుడ్ని ఎలా కాపాడుకున్నాడు ? అనేదే కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు ప్లస్ పాయింట్ కథ స్నేహం నైపథ్యంలో నడవడమే. సినిమా మొత్తం హీరో, అతని స్నేహితుడి చుట్టూనే తిరుగుతుంటుంది. దూకుడు స్వభావం కలిగిన స్నేహితుడ్ని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం కొంత బాగుంటుంది. ఇంటర్వెల్ సమయానికి కథలో వచ్చే కీలక మలుపు ద్వితియార్థంపై ఆసక్తిని రేపుతుంది. ఇక ప్రధాన విలన్ చేసే సీక్రెట్ క్రైమ్స్ బాగుంటాయి.
అలాగే సెకండాఫ్లో ప్రతినాయకుడు హీరో స్నేహితుడ్ని ఎందుకు చంపాలనుకుంటాడు, అసలు హీరో సన్నిహితుల్ని ఎందుకు టార్గెట్ చేస్తాడు అనే ముఖ్యమైన అంశం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ విషయం రివీల్ అయ్యే సన్నివేశం కూడా బాగుంటుంది. హీరో చెల్లెలు ప్రాణాపాయంలో చిక్కుకోవడం, క్లైమాక్స్ లో హీరో తన వారిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. ఇక ప్రధాన పాత్రల్లో చేసిన సందీప్ కిషన్, విక్రాంత్ లు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు సుశీంథిరన్ కథకు స్నేహమనే నైపథ్యం ఎంచుకోవడం బాగానే ఉన్నా సరైన కథ, కథనాల్ని రాసుకోలేకపోయాడు. దీంతో సినిమా మొత్తం మీద మూడు సన్నివేశాలు తప్ప మిగతా అంతా రొటీన్ గానో లేకపోతే అనాసక్తిగానో సాగిపోయింది. మొదటి భాగం ఇంటర్వెల్ ముందు వరకు సినిమా అసలు కథలోకి ప్రవేశించకపోవడంతో సుశీంథిరన్ లాంటి దర్శకుడు ఎలాంటి పాయింట్ చెబుతాడో అనే ఆసక్తి నిరుత్సాహంగా మారిపోయింది.
ఇక కథ కొద్దిగా రివీలైన తర్వాత అయినా సినిమా ఆసక్తిగా, ఉత్కంఠగా సాగుతుందా అంటే లేదు. పైన చెప్పినట్టు కేవలం మూడు సన్నివేశాల్లో తప్ప ఎక్కడా ఎగ్జైట్మెంట్ కలుగలేదు. సుశీంథిరన్ చేసిన ‘నా పేరు శివ’ లాంటి సినిమాను చూసి ఈ చిత్రాన్ని చూస్తే కేవలం ఆ స్థాయి గ్రిప్పింగ్ నరేషన్ లేకపోవడం వలనే విఫలమయ్యారనే సంగతి స్పష్టమవుతోంది.
ఇక సినిమాలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ ఎక్కడా రొమాంటిక్ ఫీల్ ను కలిగించలేదు. హీరోయిన్ మెహ్రీన్ ప్రిజాద కేవలం మూడు నాలుగు సన్నివేశాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. మధ్యలో వచ్చే రెండు పాటలు కూడా మెప్పించలేకపోయాయి.
సాంకేతిక విభాగం :
దర్శకుడు సుశీంథిరన్ స్నేహం నైపథ్యంలో ఎంచుకున్న చిన్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని పూర్తిస్థాయి కథగా డెవెలప్ చేయడంలో, దానికి కట్టిపడేసే కథనాన్ని రాసుకోవడంలో చాలా వరకు విఫలమయ్యారు. అక్కడక్కడా ఆకట్టుకునే మూడు బ్లాక్స్ తప్ప మరెక్కడా మెప్పించలేకపోయారాయన.
డి.ఇమ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా బాగానే ఉన్నా పాటల సంగీతం ఏమంత ఆకట్టుకోలేదు. సినిమాలో చెప్పుకోదగిన సంభాషణలు, పాటలు లేవు. ఎడిటింగ్ బాగానే ఉంది. లక్ష్మణ్ కుమార్ సినిమాటోగ్రఫీ సహజత్వానికి దగ్గరగా ఉంది. చక్రి చిగురుపాటి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
దర్శకుడు సుశీంథిరన్ చేసిన ఈ ‘కేరాఫ్ సూర్య’ అనే ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కథ యొక్క నైపథ్యం, అందులోని చిన్న పాయింట్, ఒక మూడు సన్నివేశాలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ మినహా ఏమాత్రం పట్టులేని కథనం, ఉత్కంఠకు గురిచేయలేకపోయిన సన్నివేశాలు, ఉన్న కాస్త కథను కూడా పూర్తిస్థాయిలో చెప్పలేకపోవడం వంటివి నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కాస్త మెప్పించి ఎక్కువగా నిరుత్సాపరిచే చిత్రమనే అనాలి.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team