విడుదల తేదీ : నవంబర్ 17, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : హెచ్. వినోత్
నిర్మాత : ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు
సంగీతం : ఘిబ్రాన్
నటీనటులు : కార్తి, రకుల్ ప్రీత్
తమిళమొలతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో కార్తి తాజా ద్విభాషా చిత్రం ‘ఖాకి’ ఈరోజే విడుదలైంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కి, టీజర్, ట్రైలర్ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
1995 కాలంలో తమిళనాడు హైవే పరిసరాల్లో వరుసగా దోపిడీ హత్యలు జరుగుతుంటాయి. ఆ కేసుకు సంబందించిన ఫైల్ అప్పుడే డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్న ధీరజ్ (కార్తి) వద్దకు వస్తుంది. ఆ కేసు ఫైల్ చదివి ఆ దోపిడీ హంతకుల్ని పట్టుకోకపోతే ఇంకా ప్రజలు చనిపోతారని నిర్ణయించుకున్న ధీరజ్ ఇన్వెస్టిగేషన్ కు బయలుదేరుతాడు.
అలా విచారణ కోసం కొంతమంది టీమ్ తో కలిసి ప్రాణాలకు తెగించి దేశం మొత్తం తిరిగి కీలక ఆధారాలని సేకరిస్తారు ధీరజ్. వాటి ద్వారా కేసులోకి ఇంకాస్త లోతుగా వెళ్లి అసలు వాస్తవాల్ని కనుక్కుంటారు. ఆ వాస్తవాలు ఏంటి, ఆ దోపిడీ హత్యల వెనకున్న ముఠా ఎవరు, వాళ్ళ నైపథ్యం ఏమిటి , వాళ్ళను ధీరజ్ ఎలా పట్టుకున్నాడు అనేదే సినిమా. ఈ సినిమాను అప్పట్లో ఈ కేసును డీల్ చేసిన పోలీసుల చర్యల ఆధారంగానే రూపొందించారు .
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు హెచ్.వినోత్ 1995 – 2005 ల మధ్య కాలంలో సంచలనం సృష్టించిన ఆసక్తికరమైన కేసును తీసుకుని, చాలా లోతుగా రీసెర్చ్ చేసి, వాస్తవాల్ని కనుక్కుని తయారుచేసుకున్న కథ, కథనాలే ఈ సినిమాకు ప్రధాన బలం. కేసు ఇన్వెస్టిగేషన్ సమయంలో దోపిడీ హంతకుల్ని పట్టుకోవడానికి పోలీసులు పడే శ్రమ, కష్టం కళ్ళకు కట్టినట్టు కనిపించడంతో సినిమాకు ఎమోషనల్ గా కనెక్టైపోతారు ప్రేక్షకులు. ఇక దోపిడీ హంతకుల ముఠా హవేరియాలు ఎలా ఉంటారు, వాళ్ళ క్రూరత్వం ఎటువంటిది, వాళ్ళ గత చరిత్ర ఏంటి, వాళ్ళు దేశంలో ఎక్కడెక్కడ ఎలా దోపిడీలు చేశారు అనే విషయాల్ని చాలా వివరంగా చూపించి ఆకట్టుకున్నారు.
అంతేగాక సన్నివేశాల మేకింగ్ కూడా చాలా సహజంగా ఉండి, నిజంగా కళ్ళ ముందు జరుగుతోందా అనిపించేలా ఉంది. కొన్ని సన్నివేశాలైతే ఊపిరి బిగబట్టేలా ఉంటాయి. ముఖ్యంగా సుమారు 15 నిముషాల పాటు సాగే ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్‌లోని కొన్ని సీన్లు, క్లైమాక్స్ పోలీస్ ఆపరేషన్ అయితే ఎంతో ఉత్కంఠగా సాగాయి. హీరో కార్తి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా కుదిరిపోయి, అప్పట్లో నిజంగా ఆ కేసును డీల్ చేసిన అధికారి కష్టాన్ని, ఇంటెలిజెన్స్, ధైర్య సాహసాల్ని తెరపై ఆవిష్కరించాడు.
దర్శకుడు వినోత్ సినిమాను ఏ కోణంతో మొదలుపెట్టాడో అదే కోణంలో నడుపుతూ కథనాన్ని వేగంగా తీవ్రతరం చేస్తూ సినిమాను అదే కోణంతో ముగిస్తూ తమిళనాడు పోలీసుల గొప్పతనాన్ని, వాళ్ళ సాహసానికి తగిన గుర్తింపు దక్కకపోవడాన్ని చాలా బాగా చూపించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో పెద్దగా నిరుత్సాపరిచే మైనస్ పాయింట్స్ అంటూ లేవు. కమర్షియల్ టచ్ కోసం సినిమా ఆరంభంలో హీరో కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ ల లవ్ ట్రాక్ కొంచెం ఎక్కువైనట్టు తోస్తుంది. హీరో పాత్రకి ఇంకాస్త ఎక్కువ ఎలివేషన్, హీరోయిక్ టచ్ ఇచ్చి ఉంటే కథనంలోని తీవ్రత ఇంకాస్త పెరిగుండేది.
సినిమా మొత్తం ఇంటెన్సిటీతో నడిచే పోలీస్ స్టోరీ కావడంతో సినిమాలో ఎక్కడా కామెడీ, ఊపునిచ్చే పాటలు వంటి కమర్షియల్ అంశాలకు తావుండదు. కాబట్టి కమర్షియల్ అంశాలని ఖచ్చితంగా కోరుకునే వారికి కొంత నిరుత్సాహం ఎదురవుతుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు వినోత్ ఈ సినిమా విషయంలో అన్ని అంశాల్లోనూ చాలా వరకు సక్సెస్ సాధించారు. ఒక వాస్తవ కేసును తీసుకుని దాన్ని ఏదో చేశాం అంటే చేశాం అన్నట్టు కాకుండా చాలా లోతుగా పరిశోధించి సినిమాకు కావాల్సిన కథను, ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఉత్కంఠభరితమైన సన్నివేశాలను రాసుకుని మంచి సినిమాను అందించారు. సినిమా విజయంలో ఎక్కువ శాతం ఆయనకే దక్కుతుంది.
సత్య సూరయన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రాజస్థాన్ వంటి ఎడారి, కొండ ప్రాంతాల్లోని సహజమైన లొకేషన్లలో సన్నివేశాలని తీసి ఆకట్టుకున్నాడు. ఘిబ్రన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సన్నివేశాల్లోని తీవ్రతను బాగా క్యారీ చేసింది. ఎడిటింగ్ బాగానే ఉంది. యాక్షన్ సన్నివేశాలని బాగా డిజైన్ చేశారు. నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి.
తీర్పు :
కార్తి, దర్శకుడు వినోత్ చేసిన ఈ ‘ఖాకి’ చిత్రం పోలీస్‌ది పవర్ ఎలాంటిదో కళ్ళకు కట్టినట్టు చూపించింది. సినిమాలో ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఇంటర్వెల్, సెకండాఫ్, క్లైమాక్స్ సీన్లు, కార్తి పెర్ఫార్మెన్స్, వినోత్ సినిమాను తీసిన విధానం అమితంగా ఆకట్టుకునే అంశాలు కాగా కొద్దిగా ఎక్కువైనట్టు అనిపించే లవ్ ట్రాక్ కొంత ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మొత్తం మీద ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధరంణగా తెరకెక్కే సినిమాల్ని, ఉత్కంఠభరితమైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ చిత్రాల్ని ఇష్టపడే వాళ్లకు చాలా బాగా నచ్చుతుంది.
123telugu.com Rating : 3.5/5
Reviewed by 123telugu Team