విడుదల తేదీ : డిసెంబర్ 28, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్
దర్శకత్వం : విఐ ఆనంద్
నిర్మాత : చక్రి చిగురుపాటి
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫర్ : శ్యామ్ కె. నాయిడు
ఎడిటర్ : ఛోటా కె. ప్రసాద్
అల్లు శిరీష్ హీరోగా, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ విఐ. ఆనంద్ డైరెక్ట్ చేసిన ‘ఒక్క క్షణం’ మంచి పాజిటివ్ బజ్ తో ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
జీవ (శిరీష్), జ్యోత్స్న (సురభి) ని షాపింగ్ మాల్ లో చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంతుంది. వారి ప్రేమ అలా కొనసాగుతూవుండగానే జ్యోత్స్న ఉండే అపార్టుమెంట్లో ఉండే శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) ల జంట యొక్క జీవితంలో జరిగే సంఘటనలే వీరి జీవితంలో కూడా జరుగుతున్నాయని గ్రహిస్తారు.
అన్ని గురించి లోతుగా వెళ్లి ఆరా తీయగా ప్యార్లల్ లైఫ్ అనే అంశమే దీనికి కారణమని, అందువల్లనే శ్రీనివాస్, స్వాతిల గతం వీరికి భవిష్యత్తు అవుతోందని తెలుసుకుంటారు. అంతేగాక దాని వలన వారి ప్రేమకి పెను ప్రమాదం ఉందని కూడా కనుగొంటారు. ఇంతకీ ఆ ప్రమాదం ఏమిటి ? అసలు ఈ రెండు జంటల జీవితాలు ఎలా ఒకేలా నడుస్తుంటాయి ? ఆ ప్రమాదాన్ని జీవ ఎలా ఎదుర్కున్నాడు ? చివరికి ప్రేమ, విధిల మధ్య జరిగే సంఘర్షణలో ఏది గెలిచింది ? అనేదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలోని ప్రధాన్ ప్లస్ పాయింట్ కథ. ఇప్పటివరకు తెలుగులో రాని ప్యార్లల్ లైఫ్స్ అనే కొత్త కాన్సెప్ట్ తో కథను ఆసక్తికరంగా తయారుచేశారు దర్శకుడు విఐ ఆనంద్. ముఖ్యంగా ఆయన కథలోని లింకులను కనెక్ట్ చేసిన విధానం, రెండు జంటల జీవితాలు కొంత టైమ్ గ్యాప్ తో ఒకేలా ఎలా నడుస్తాయో చూపించిన తీరు చాలా బాగుంది. ఈ స్పష్టత వలన ఎక్కడా కన్ఫ్యూజన్ అనేదే చోటుచేసుకోక చూస్తున్నంతసేపు ఒకరకమైన సంతృప్తి కలిగింది.
అంతేగాక క్లిష్టమైన ఈ అంశాన్ని నిజమైన పరిశోధనల్లో పొందుపర్చిన సహజమైన, ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా అందరికీ అర్థమయ్యేలా వివరించడం ఎంతగానో ఆకట్టుకుంది. ఇంటర్వెల్ సమయంలో కథలో వచ్చే ముఖ్యమైన ట్విస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. దాని వలన సెకండాఫ్ మీద అమితమైన క్యూరియాసిటీ క్రియేట్ అయింది.
అంతేగాక సెకండాఫ్ నడుస్తున్నప్పుడు రివీల్ అయ్యే కథలోని కొన్ని కనెక్షన్స్, హీరో వాటిని కనిపెడుతూ ముందుకు వెళ్లడం ఉత్కంఠను కలిగించింది. హీరో శిరీష్ పెర్ఫార్మెన్స్ పరంగా మంచి పరిణితిని కనబర్చగా సీరత్ కపూర్, శ్రీనివాస్ అవసరాల జంట మీద నడిచే కథ, అందులో వారి నటన ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు ఎంచుకున్న కథాంశం, దాన్ని స్పష్టంగా వివరించడానికి తయారుచేసుకున్న కథనం బాగానే ఉన్నా అందులో రాసుకున్న సన్నివేశాలే కొంత బలహీనంగా కనబడ్డాయి. కొన్ని ముఖ్యమైన మలుపుల్లో తప్ప ఎక్కడా కథలో తీవ్రతను బలంగా బయటపెట్టే సన్నివేశాలు లేవు. సినిమా ఆరంభం ఎలాగైతే సాధారణంగా ఉందో ఇంటర్వెల్, సెకండాఫ్ కొన్ని చోట్ల మినహా మిగతా అంతా అలాగే కొనసాగింది.
దీంతో కొన్ని చోట్ల సన్నివేశాలు రిపీట్ అవుతున్నట్టు అనిపించి బోర్ కొట్టిన ఫీల్ కలిగింది. ఇక ముందుగానే ఊహించగలిగే రొటీన్ క్లైమాక్స్ ను కూడా అవసరాన్ని మించి సాగదీశారు. ఇక కమెడియన్లు సత్య, ప్రవీణ్ లు చేసిన ఫన్ అక్కడక్కడా పండినా కొన్ని చోట్ల కథనానికి అడ్డుతగులుతున్నట్టు అనిపించాయి.
సాంకేతిక విభాగం :
దర్శకుడు విని ఆనంద్ ఇంతవరకు తెలుగులో రాని కొత్తదైన ప్యార్లల్ లైఫ్ అనే కాన్సెప్ట్ తో రాసుకున్న కథ, కథనం చాలా బాగున్నాయి. అయితే వాటికి తగిన సపోర్ట్ ఇవ్వగల బలమైన సన్నివేశాలు లేకపోవడం ఫలిత ప్రభావాన్ని కొంత తగ్గించాయి. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది.
మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది కానీ పాటలు సంగీతమే అంతగా ఆకట్టుకోలేదు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సినిమాలో స్పష్టత ఉండేలా చేసింది. నిర్మాతలు చక్రి, ధిరీశ్ లు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
ఇంతవరకు తెలుగు తెరపై చూడని ప్యార్లల్ లైఫ్ అనే కథాంశంతో రూపొందిన ఈ ‘ఒక్క క్షణం’ సినిమా కొత్తదనం పరంగా మంచి మార్కులనే దక్కించుకుంది. దర్శకుడు విఐ ఆనంద్ రాసుకున్న ఆసక్తికరమైన కథ, కథనాలు, కథలోని మలుపులు, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా కథ, కథనాలకు తగిన బలమైన సన్నివేశాలు లేకపోవడం కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. మొత్తం మీద చెప్పాలంటే కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు, ఉత్కంఠభరితమైన సినిమాల్ని ఇష్టపడేవారికి థ్రిల్ చేసే ఈ ప్యార్లల్ లైఫ్ కాన్సెప్ట్ తప్పక నచ్చుతుంది.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team