సమీక్ష : పద్మావత్ – భావోద్వేగపూరితమైన చారిత్రక చిత్రం

సమీక్ష : పద్మావత్ – భావోద్వేగపూరితమైన చారిత్రక చిత్రం

Published on Jan 24, 2018 7:20 PM IST
Padmaavat movie review

విడుదల తేదీ : జనవరి 25, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్

దర్శకత్వం : సంజయ్ లీలా బన్సాలి

నిర్మాత : ఎస్.ఎల్.బి.ఫిలిమ్స్, వియాకామ్ 18 మోషన్ పిక్చర్స్

సంగీతం : సంజయ్ లీలా బన్సాలి, సంచిత్ బల్హార

సినిమాటోగ్రఫర్ : సుదీప్ ఛటర్జీ

ఎడిటర్ : రాజేష్ జి. పాండే

స్టోరీ, స్క్రీన్ ప్లే : సంజయ్ లీలా బన్సాలి

గత కొన్నాళ్లుగా బాలీవుడ్లో రకరకాల వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచి అల్లర్లు, కోర్టు కేసుల వరకు వెళ్లిన సంజయ్ లీలా బన్సాలి చిత్రం ‘పద్మావత్’ తెలుగు వెర్షన్ ఈరోజు పేషల్ షాల్ రూపంలో ప్రదర్శితమైంది. మరి ఈ శుక్రవారమే విడుదలకానున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ:

మేవార్ రాజపుత్ మహారాజు రావల్ రతన్ సింగ్ (షాహిద్ కపూర్), సింహళ యువరాణి అత్యంత సౌందర్యవతి పద్మావతి(దీపికా పదుకొనె)ని మనసుపడి వివాహం చేసుకుంటాడు. ఆమె కూడా అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. అలా వారి జీవితం ప్రేమమయమై ఉండగా ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ఖిల్జీ (రణ్వీర్ సింగ్) దురహంకారంతో పద్మావతిపై మనసుపడతాడు.

ఆమెను దక్కించుకోవాలనే తపనతో రావల్ రతన్ సింగ్ యొక్క చిత్తూర్ కోటపై తన అసంఖ్యాకమైన సైన్యంతో యుద్దానికి బయలుదేరతాడు. అలా బయలుదేరిన అల్లాఉద్దీన్ ఖిల్జీ రావల్ రతన్ సింగ్ తో యుద్ధం చేశాడా, రావల్ రతన్ సింగ్ అతన్ని ఎలా ఎదుర్కున్నాడు, పద్మావతి యుద్ధం చేయకుండానే అతన్ని ఎలా ఓడించింది అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన బలం దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి విజన్. ఆయన సన్నివేశాల్ని షూట్ చేశారు అనడంకన్నా చెక్కారు అనొచ్చు. ప్రతి ఫ్రేమును ఎంతో అందంగా, హుందాగా కళ్ళు మిరుమిట్లు గొలిపేలా తీర్చిదిద్దారాయన. ముఖ్యంగా చిత్తూర్ కోట సెట్ అద్భుతంగా ఉంది. ఆనాటి రాజపుత్ వంశీయుల వైభవాన్ని కళ్ళకు కట్టింది. రాణి పద్మావతిగా దీపికా పదుకొనె వేషధారణ, రావల్ రతన్ సింగ్ గా షాహిద్ కపూర్ ఆహార్యం గొప్పగా ఉన్నాయి.

ప్రతినాయకుడు అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్వీర్ సింగ్ నటన శభాష్ అనేలా ఉంది. క్రూరత్వం, చాకచక్యం, జిత్తులమారితనం వంటి గుణాల్ని అలవోకగా పలికించి పాత్రకు ప్రాణం పోశారాయన. అలాగే రాణి పద్మావతిగా దీపికా ప్రదర్శన కూడా ముచ్చటపడేలా ఉంది. ఆత్మగౌరవం, అందం, తెలివి కలిగిన రాణిగా ఆమె నటన అద్భుతం. వీరిద్దరి నటనతో సినిమా స్థాయి పెరిగి చూడాలనిపించేలా తయారైంది.

ఫస్టాఫ్లో దీపికా, షాహిద్ కపూర్ ల మధ్య నడిచే లవ్ డ్రామా అందంగా ఉంది ఆకట్టుకుంది. ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఊహించని ట్విస్ట్ సెకండాఫ్ పై ఆసక్తిని రేకెత్తించింది. అలాగే ఎమోషనల్ గా నడుస్తూ రాణి పద్మావతి గొప్పతనం ఎటువంటిదో చూపే ఎమోషనల్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మనసుని హత్తుకుంది. దీపికా నటన, విజువల్స్, నైపత్య సంగీతం అన్నీ కలిసి ఆ ఎపిసోడ్ ను గొప్పగా తీర్చిదిద్దాయి.

మైనస్ పాయింట్స్ :

చారిత్రక నైపథయంలో వచ్చే చిత్రం అందులోనే రాజులు రాజ్యాలు అంటే ఖచ్చితంగా యుద్ధ సన్నివేశాలని, గొప్ప హీరోయిజాన్ని ఆశిస్తాడు సగటు తెలుగు ప్రేక్షకుడు. కానీ అలాంటివేమీ ఇందులో పెద్దగా దొరకవు. బన్సాలీ చిత్రాల్లో మేజర్ గా ఉండే డ్రామానే ఇందులో కూడా ఎక్కువ శాతం ఉంటుంది. అది ప్రేక్షకులకు కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.

ఫస్టాఫ్లో అల్లాఉద్దీన్ ఖిల్జీకి సంబందించి అతను సుల్తాన్ గా అవతరించడం, సెకండాఫ్ ఆరంభంలో ఖిల్జీ కోట నైపథ్యంలో జరిగే కీలకమైన సన్నివేశం వంటి కొన్ని సన్నివేశాలు లాజిక్స్ అందకుండా ఉంటాయి. పైగా కీలకమనిపించే కొన్ని సీన్లలో పెద్దగా లోతు ఉండదు. అన్నీ చాలా సింపుల్ గా జరిగిపోతుంటాయి. ఇక ఆఖరున వచ్చే యుద్ధ సన్నివేశంలో ఆశ్చర్యపోయే, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు ఉండవు. ఇది కూడా యాక్షన్ ప్రియులకు నిరాశను కలిగించే విషయమే.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి చరిత్రను వక్రీకరించకుండా, ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండేలా కథ, కథనాల్ని తయారుచేసుకున్నాడు. గొప్ప విజన్ తో సన్నివేశాలని అత్యున్నత సాంకేతికతతో విజువల్ వండర్ అనేలా తీశారు. మంచి ఎమోషనల్ డ్రామాకి తోడు యాక్షన్ శాతాన్ని కూడా ఇంకొంచెం ఎక్కువ మొత్తంలో అందించి ఉంటే బాగుండేది. అన్ని అంశాల దృష్ట్యా దర్శకుడిగా, గొప్ప కథకుడిగా ఆయన విజయాన్ని సాధించారనే చెప్పాలి.

ప్రధాన తారాగణం డిజైనర్ మాక్సిమా బసు రూపొందించిన కాస్ట్యూమ్స్ బాగున్నాయి. సంచిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ప్రైమ్ ఫోకస్ వారి విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. సంజయ్ లీల బన్సాలి సంగీతం బాగుంది. రాజేష్ జి. పాండే ఎడిటింగ్ బాగానే ఉంది. అమిత్ రే వేసిన సెట్స్ చాలా గొప్పగా ఉన్నాయి. సుదీప్ ఛటర్జీ ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అందంగా, గొప్పగా, హుందాగా తయారుచేశారు. ఎస్.ఎల్.బి.ఫిలిమ్స్, వియాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పాటించిన నిర్మాణ విలువలు ప్రపంచ స్థాయిలో ఉన్నాయి.

తీర్పు :

మొత్తం మీద చారిత్రక నేపథ్యం నుండి పుట్టిన చిత్రం ‘పద్మావత్’ గొప్ప విజువల్స్ కలిగిన ఎమోషనల్ డ్రామా. సంజయ్ లీలా బన్సాలి కథను వివరించిన తీరు, ఆయన టేకింగ్, కథలో నడిపిన భావోద్వేగపూరితమైన డ్రామా, దీపిక పదుకొనె, రణ్వీర్ సింగ్ ల అసామాన్య నటన, ఇంటర్వెల్ ట్విస్ట్, రాణి పద్మావతి గొప్పతనాన్ని తెలిపే ఎమోషనల్ క్లైమాక్స్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా లాజిక్స్ లేని కీలక సన్నివేశాలు, యాక్షన్ కంటెంట్ పెద్దగా లేకపోవడం నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద మంచి ఎమోషనల్ డ్రామా, అత్యున్నత సాంకేతికత కలిగిన ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను గొప్పగాను మన తెలుగు మాస్ ఆడియన్సుని ఒక మోస్తారుగాను, క్లాస్ ఆడియన్సుని ఎక్కువగాను అలరిస్తుంది.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు