విశాల్ హీరోగా దర్శకుడు మిత్రన్ రూపొందించిన తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై’ జూన్ 1వ తేదీన ‘అభిమన్యుడు’ పేరుతో తెలుగునాట విడుదలకానుంది. ఈ సందర్బంగా విశాల్ మీడియాతో కొన్ని విశేషాల్ని పంచుకున్నారు. ఆ సంగతులు మీ కోసం..
విశాల్ గారు మీ సినిమా గురించి చెప్పండి ?
ఈ సినిమా మే 11న తమిళంలో విడుదలై నా కెరీర్లో పెద్ద విజయంగా నిలిచిన ‘ఇరుంబు తిరై’ తెలుగులో జూన్ 1న ‘అభిమన్యునుడు’ పేరుతో వస్తోంది. తెలుగులో కూడ అలాంటి స్పందనే వస్తుందని అనుకుంటున్నాను. ఇదొక మంచి సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమా.
ఇందులో ఎలాంటి అంశాలను చూపిస్తారు ?
ఇందులో ఆధార్ కార్డ్, డిజిటల్ ఇండియా వంటి వాటి వలన ఎలాంటి నష్టాలున్నాయి, వాటి మూలంగా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో మనస్ఫూర్తిగా చెప్పాము. డిజిటల్ ఇండియా తప్పని సినిమాలో చెప్పలేదు. దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనే ప్రశ్న సందించాం. అంతేగాని బీజేపీకి వ్యతిరేకంగా చేసిన సినిమా కాదు.
మీ దర్శకుడు మిత్రన్ గురించి చెప్పండి ?
మూడేళ్ళ క్రితమే ఈ కథ నాకు చెప్పాడు మిత్రన్. చాలా బాగా చేశాడు. కొత్త డైరెక్టర్ అంటే అందరికీ ఒకింత అనుమానం ఉంటుంది. కానీ ఇతనితో పనిచేసేప్పుడు అలా అనిపించలేదు. ప్రజలకు తెలియని చాలా విషయాల్ని ఇందులో ప్రస్తావించాం.
తెలుగులో ఒకేసారి ఎందుకు రిలీజ్ చేయలేదు ?
అంటే.. ఇంత కష్టపడి సినిమా చేసినప్పుడు బాగా రిలీజ్ చేయాలని అనుకున్నాం. మే 11న తెలుగులో చాలా సినిమాలు ఉండటం వలన అప్పుడు విడుదలచేయలేకపోయాం.
తెలుగులో టెస్ట్ ప్రివ్యూస్ ప్లాన్ చేస్తున్నారా ?
ప్లాన్ చేస్తున్నాం. బుధవారం ఫస్టాఫ్ చూపిద్దాం అని అనుకుంటున్నాం. త్వరలో దాని గురించి చెప్తాం.
ఈ కథ వినగానే ఎలా ఫీలయ్యారు ?
వినగానే నాకు షాక్ అనిపించింది. స్మార్ట్ ఫోన్ వాడాలన్నా భయమేసింది. కథ విన్నప్పటి దగ్గర్నుంచి ఫేస్ బుక్ కూడ వాడలేదు. నిజంగా ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా అనిపించింది.
ఇందులో అర్జున్ గారి పాత్ర ఎలా ఉంటుంది ?
నిజంగా అర్జున్ గారు చాలా గొప్పగా చేశారు. ఆయన పాత్ర పేరు వైట్ డెవిల్. ఒక హ్యాకర్. అందరి ఇన్ఫర్మేషన్ దొంగిలించి నేరాలు చేస్తుంటారు.
ఒక సామాజిక భద్యత కలిగిన వ్యక్తిగా సమాజం కోసం ఏం చేయాలనుకుంటున్నారు ?
అవును. నాకు సామజిక బాధ్యత ఉంది. అందుకే నా మాధ్యమం సినిమాల ద్వారా అందరికీ ఉపయోగపడే విషయాల్ని చెప్పాలనుకుంటున్నాను. సినిమా ద్వారా చెప్పే విషయాలు చాలా వేగంగా జనాల్లోకి వెళతాయి. నా తర్వాతి సినిమాల్లో కూడ ఇలాంటి సందేశాలు ఉంటాయి.
‘టెంపర్’ రీమేక్ గురించి చెప్పండి ?
తొందరగా షూట్ మొదలుపెట్టాలని అనుకుంటున్నాను. చిన్న పిల్లలపై జరిగే అరాచకాలకు, దేశంలో జరిగే అత్యాచారాలకు మరణ శిక్ష పడాలనేది అందులో అంశం. తెలుగు వెర్షన్లో ఉండే ఎండింగ్ కాకుండా కొత్త ముగింపు ఇవ్వనున్నాం. మురుగదాస్ దగ్గర కో డైరెక్టర్ గా పనిచేసిన కుర్రాడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.