సమీక్ష : రాజుగాడు – ఆలోచన బాగుంది కానీ ఆచరణ సరిగా లేదు

సమీక్ష : రాజుగాడు – ఆలోచన బాగుంది కానీ ఆచరణ సరిగా లేదు

Published on Jun 2, 2018 9:45 AM IST
Raju Gadu movie review

విడుదల తేదీ : జూన్ 01, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రాజ్ తరుణ్, అమైరా దస్తూర్

దర్శకత్వం : సంజన రెడ్డి

నిర్మాత : సుంకర రాంబ్రహ్మం

సంగీతం : గోపి సుందర్

సినిమాటోగ్రఫర్ : రాజాశేఖర్

ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ

స్క్రీన్ ప్లే : సంజన రెడ్డి

యువ హీరో రాజ్ తరుణ్, అమీరా దస్తూర్ జంటగా నూతన దర్శకురాలు సంజన రెడ్డి రూపొందించిన చిత్రం ‘రాజుగాడు’. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పించిందో చూద్దాం..

కథ:
పుట్టినప్పటి నుండి తనకు తెలీకుండా తానే దొంగతనం చేసే అలావాటు క్లెప్టోమేనియా ఉన్న రాజు (రాజ్ తరుణ్) వరుస దొంగతనాలు చేస్తూ ఎప్పుడూ ఇబ్బందుల్లో పడుతూ ఇంట్లో వాళ్లకు కూడ తలనొప్పులు తెస్తాడు. ఆ జబ్బు మూలాన ఒకసారి తన ప్రేమను కూడ కోల్పోతాడు రాజు.

అలా క్లెప్టోమేనియా మూలాన కష్టాలు పడే రాజు తన్వి(అమైరా దస్తూర్)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కూడా మెల్లగా అతన్ని ప్రేమిస్తుంది. కానీ రాజు మాత్రం తనకు దొంగతనాలు చేసే అలవాటుందని ఆమెకు చెప్పడు. అలా నిజం దాచడం మూలాన రాజు తన్వి, ఆమె కుటుంబం ముందు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, చివరికి తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

హీరో పాత్రకు క్లెప్టోమేనియా అనే జబ్బును ఆపాదించి ఎంటర్టైన్మెంట్ పండిద్దామనుకున్న దర్శకురాలు సంజన రెడ్డి ఆలోచన బాగానే ఉంది. ఆ పాత్ర ద్వారా కొన్ని చోట్ల ఎంటర్టైన్మెంట్ దొరికింది కూడ. రాజ్ తరుణ్ కూడ దొంగతనాలు చేసే అలవాటున్న వెరైటీ పాత్రలో బాగానే నటించాడు. కమెడియన్ పృథ్వి చేసిన కామెడీ అక్కడక్కడా కొన్ని నవ్వుల్నీ పూయించగలిగింది.

హీరో తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ పెర్ఫార్మెన్స్ సినిమా మొత్తానికి హైలెట్ అనొచ్చు. ఎప్పటికప్పుడు కొడుకు వలన కష్టాల పాలయ్యే తండ్రిగా ఆయన నటన, బాడీ లాంగ్వేజ్ ఫన్ ను అందించాయి. ద్వితీయార్థంలో హీరోయిన్ ఇంటికి వెళ్లిన రాజు తన దొంగతనం అలవాటు వలన ఇబ్బందుల్లో పడటం వంటి కొన్ని సీన్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అమైరా దస్తూర్ స్క్రీన్ ప్రెజెన్స్ కొంత అలరించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధాన లోపం సరైన కథనం లేకపోవడమే. దొంతనం అలవాటును చేర్చి హీరో పాత్రను ఆసక్తికరంగా తయారుచేసిన సంజన రెడ్డిగారు దాని చుట్టూ ఆసక్తికరమైన కథనాన్ని అల్లుకోవడంలో సఫలం కాలేకపోయారు. ఎక్కడిక్కడ సన్నివేశాలని కథనంలోకి బలవంతంగా ఇరికించడం మూలాన సినిమా ఫ్లో దెబ్బతింది. చిత్రం ఏ ఒక్క సందర్భంలో కూడ గట్టిగా ఒక 15 నిముషాలు చాలా బాగా నడిచిందని చెప్పే ఆస్కారం లేదు.

హీరో పాత్రలోని లోపం ఆధారంగా గతంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, రాజా ది గ్రేట్’ లాంటి సినిమాల్లో హీరో పాత్ర ప్రతి సందర్భంలోను ఎంటర్టైన్మెంట్ ను అందివ్వగలిగింది. కానీ ఈ సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశలలోనే హీరో పాత్ర నవ్వించింది కానీ పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. సాధారణంగానే మొదలైన చిత్రం పోను పోను బోర్ కొట్టే విధంగా మారిపోయి నిరుత్సాహాన్ని కలిగించింది.

సినిమా చివర్లో కొన్ని పాత సినిమాల్ని ఇమిటేట్ చేస్తూ వచ్చిన కామెడీ నటుల ట్రాక్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా మారింది. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలైతే అస్సలు ఆకట్టుకోలేకపోయాయి.

సాంకేతిక విభాగం :

పైన చెప్పినట్టే దర్శకురాలు సంజన మంచి ఎంటర్టైనర్ ను తీద్దామనే ఉద్దేశ్యంతో ఆసక్తికరమైన హీరో పాత్రతో స్టోరీ లైన్ ను రాసుకున్నారు కానీ దానికి అతి ముఖ్యమైన కథనాన్ని మాత్రం పేలవంగా తయారుచేసుకున్నారు. దీంతో అక్కడక్కడా మినహా చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. గోపి సుందర్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎం.ఆర్.వర్మ తన ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసరమైన పాత్రల్ని తొలగించి ముగింపును ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. రాజాశేఖర్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది.

తీర్పు :

‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, రాజా ది గ్రేట్’ వంటి సినిమాల తరహాలో వచ్చిన ఈ ‘రాజుగాడు’ చిత్రం ఆ చిత్రాల్లా పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. రాజేంద్ర ప్రసాద్ నటన, అక్కడక్కడా పేలిన కొన్ని కామెడీ సీన్స్, హీరో పాత్ర ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా బలమైన సన్నివేశాలు లోపించిన కథనం, ఎక్కువ మోతాదులో కామెడీ లేకపోవడం, విసిగించిన క్లైమాక్స్ ప్రధాన బలహీనతలుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆలోచన బాగున్నా ఆచరణ సరిగాలేని ఈ చిత్రం నుండి పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ను ఆశిస్తే మాత్రం నిరుత్సాహం తప్పదు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు