విడుదల తేదీ : జూన్ 22, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : జయం రవి, నివేత పేతురాజ్, రమేష్ తిలక్, ఆరోజ్ అజిజ్
దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్
నిర్మాత : పద్మావతి చదలవాడ
సంగీతం : డి.ఇమ్మాన్
సినిమాటోగ్రఫర్ : ఎస్.వెంకటేష్
ఎడిటర్ : ప్రదీప్ ఈ రాఘవ్
స్క్రీన్ ప్లే : శక్తి సౌందర్ రాజన్
తమిళ హీరో జయం రవి నటించిన చిత్రం ‘టిక్ టిక్ టిక్’ తెలుగులో కూడ అదే పేరుతో ఈరోజే విడుదలైంది. మొట్ట మొదటి ఇండియన్ స్పేస్ చిత్రంగా పేరొందిన ఈ సినిమా ఎలాంటి అనుభూతినిచ్చిందో ఇప్పుడు చూద్దాం…
కథ:
అంతరిక్షంలో తిరిగే ఒక భారీ ఉల్క వలన ఇండియాకు భయంకరమైన ప్రమాదం ఏర్పడనుందని భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు కనుగొంటారు. ఆ ప్రమాదం నుండి ఇండియాను కాపాడేందుకు అంతరిక్ష నౌక ద్వారా కొందరు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపాలని డిఫెన్స్ అధికారులు నిర్ణయించుకుంటారు.
ఆ ఉల్కను బద్దలు చేసి దాని గమనం మళ్లించే సామర్థ్యం గల న్యూక్లియర్ వెపన్ అంతరిక్షంలోని వేరే దేశం యొక్క స్పేస్ స్టేషన్లో ఉందని కనిపెట్టి అక్కడే దాన్ని దొంగిలించాలని ప్లాన్ చేసి అందుకు తగినవాడైన ఎస్కేప్ ఆర్టిస్ట్ వాసు (జయం రవి)ని, అతని టీమ్ ను కూడ అంతరిక్షంలోకి తీసుకెళతారు. అలా వెళ్లిన వాసు అండ్ టీమ్ న్యూక్లియర్ వెపన్ ను దొంగిలించి ఇండియాను పెను ముప్పును కాపాడరా.. లేదా.. ? అనేదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు ప్రధాన బలం దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ స్పేస్ నేపథ్యంలో రాసుకున్న కథ. కథ చాలా కన్విన్సింగా ఉంది. ఇండియాకు ఉల్క మూలన ప్రమాదం పొంచి ఉండటం, దాన్ని తప్పించగల ఆయుధం అంతరిక్షంలోని వేరొక దేశం యొక్క స్పేస్ స్టేషన్లో ఉండటం, దాన్ని దొంగిలించడానికి అధికారులు హీరోను చూజ్ చేసుకోవడం వంటి అన్ని అంశాలు సరిగ్గా కుదిరాయి. పైగా ఇంతవరకు ఇండియన్ సినిమాలేవీ అంతరిక్షం బ్యాక్ డ్రాప్లో రూపొందనందు వలన ఈ ‘టిక్ టిక్ టిక్’ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినిస్తుంది.
ఇక సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ మరొక ప్రధాన ఆకర్షణ. సుమారు గంటకు పైగా సాగే ఈ గ్రాఫిక్స్ చూసేందుకు బాగానే ఉన్నాయి. కథ అంతరిక్షంలోనే జరుగుతోందనే నమ్మకాన్ని దాదాపుగా కలిగించాయి. అంతరిక్ష నౌకలో జరిగే సన్నివేశాల చిత్రీకరణ కోసం వేసిన సెట్ వర్క్ బాగుంది. సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే రెండు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
దర్శకుడు సౌందర్ రాజన్ స్పేస్ తాలూకు సన్నివేశాలను బాగానే చిత్రీకరించారు. ఇక డి.ఇమ్మని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. అంతరిక్షంలో నడిచే ఎపిసోడ్స్ కోసం ఆయన రూపొందించిన స్కోర్ సినిమాలోని తీవ్రతను పెంచింది.
మైనస్ పాయింట్స్ :
కథను బాగానే తయారుచేసుకున్న దర్శకుడు కథనాన్ని మాత్రం గొప్పగా రాయలేదు. కీలకమైన సన్నివేశాలను పేలవంగా రూపొందించారు. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, హీరో అండ్ టీమ్ ఎలాంటి కష్టాల్లో పడతారో, దేశాన్ని ఎలా కాపాడాతారు అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలగలేదు. మరీ ముఖ్యంగా హీరో వేరొక దేశానికి చెందిన స్పేస్ స్టేషన్ లోకి వెళ్లి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న న్యూక్లియర్ ఆయుధాన్ని దొంగిలించడం అనే అంశాన్ని చాలా బలహీనంగా చూపించారు.
దర్శకుడు ఎక్కువ స్వేచ్ఛను వాడేసుకుని కథానాయకుడికి కష్టం కలగకుండా, శత్రువుల్ని ఎక్కడికక్కడ బలహీనపరిచేసి టాస్క్ పూర్తయ్యేలా కథనాన్ని రూపొందించడంతో కొంత నిరుత్సాహం ఎదురైంది. ఇక స్పేస్ సినిమాల్లో ఉండాల్సిన సీరియస్ నెస్ కుడ ఈ చిత్రంలో కొంత కరువైందనే చెప్పాలి. కథనంలో ఉత్కంఠను రేకెత్తించే హడావుడి పెద్దగా కనిపించలేదు.
ఇక సినిమా ఫస్టాఫ్ కథనం కూడ సాదా సీదాగానే గడిచిపోయింది. హీరో మిషన్ లోకి రావడం వరకు బాగానే ఉన్నా ప్రీ ఇంటర్వెల్ ముందు వరకు కథనం నెమ్మదిగానే సాగుతూ కొంత నీరసాన్ని కలిగించింది.
సాంకేతిక విభాగం :
మంచి కథను రాసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ ఉత్కంఠభరితమైన కథనాన్ని రూపొందించడంలో మాత్రం పూర్తిగా మెప్పించలేదు. కానీ స్పేస్ నేపథ్యంలో ఆయన రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి. అన్నిటికన్నాముఖ్యంగా ఇంతవరకు ఏ భారతీయ దర్శకుడు టచ్ చేయని స్పేస్ జానర్ ను తీసుకున్న ఆయన సాహసానికి ఆయన్ను మెచ్చుకొని తీరాల్సిందే.
సినిమాకు పనిచేసిన విఎఫ్ఎక్స్ టీమ్ పనితనం బాగుంది. వాళ్ళు క్రియేట్ చేసిన అంతరిక్షం తాలూకు గ్రాఫిక్స్ ఆకట్టుకున్నాయి. ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ కూడ ఓకే. ఇక దర్శకుడు సౌందర్ రాజన్ ఆలోచనను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలను అభినందించాలి.
తీర్పు :
ఇప్పటి వరకు ఏ భారతీయ దర్శకుడు ప్రయత్నించని అంతరిక్ష నేపథ్యాన్ని తీసుకుని శక్తి సౌందర్ రాజన్ చేసిన ఈ ‘టిక్ : టిక్ : టిక్’ అనే ప్రయత్నం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడంలో చాలా వరకు సఫలమైంది. ఆయన రాసిన కథ, విఎఫ్ఎక్స్ వర్క్, పూర్తిగా అంతరిక్షంలోని సాగే సెకండాఫ్ ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా సాగిన ఫస్టాఫ్, లాజిక్ లేని కొన్ని కీలక సన్నివేశాలు, కథనంలో సీరియస్ నెస్ కొంత లోపించడం బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే భిన్నమైన, కొత్త తరహా సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం మంచి చాయిస్ అని, చిత్ర టీమ్ చేసింది మెచ్చుకోదగిన ప్రయత్నమని చెప్పొచ్చు.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team