- విడుదల తేదీ : జులై 20, 2018
- 123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
- నటీనటులు : దొడ్డన్న,ఉదయ్
- దర్శకత్వం : చంద్ర సిద్దార్ద్
- నిర్మాత : రాక్ లైన్ వెంకటేష్
- సంగీతం : వాసుకి వైభవ్
- సినిమాటోగ్రఫర్ : లవిత్
- ఎడిటర్ : నవీన్ నూలి
‘ఆ నలుగురు, అందరి బంధువయా’ వంటి మంచి సినిమాల్ని తీసిన దర్శకుడు చంద్ర సిద్దార్ద్ ‘ఆటగదరా శివ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
ఉరి శిక్ష పడ్డ ఖైదీ బాబ్జి (ఉదయ్) జైలు నుంచి తప్పించుకుంటాడు. బాబ్జిని ఉరితీయడానికి తలారి జంగయ్య ( దొడ్డన్న) జీపులో బయలుదేరుతాడు. వెంటపడుతున్న పోలీసుల నుండి పారిపోతున్న ఖైదీ బాబ్జికి తెలియకుండా తలారి జంగయ్యనే లిప్ట్ ఇస్తాడు. అలా అనుకోకుండా తనను ఉరితీయాల్సిన తలారినే కలుస్తాడు బాబ్జి. వాళ్లెవరన్న విషయం పరస్పరం తెలియకపోవడంతో కలిసి ప్రయాణం చేస్తారు. చచ్చేవాడు చంపేవాడు కలిసి చేస్తున్న ఆ ప్రయాణంలో ఓ ప్రేమ జంట(హైపర్ ఆది, దీప్తి) లేచి పోతూ వీరితో కలవడం, మొత్తం మీద ఆ ప్రయాణంలో బాబ్జి, జంగయ్యకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి? వాళ్లు ఎవరెవరిని కలిశారు ? చివరకి బాబ్జిని ఊరి తీశారా ? జంగయ్య ఏమై పోయాడు లాంటి విషయాలు తెలియాలంటే ‘ఆటగదరా శివ చిత్రం చూడాలసిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు చంద్ర సిద్దార్ద్ ఎంచుకున్న కథ, ఆ కథా నేపధ్యం, బతుకు చావుల మధ్య సంఘర్షణతో సాగే కథాంశం. ఇలాంటి ప్లాట్ తో సినిమాలు చాలా అరుదుగా తెరకెక్కుతాయి. పైగా చచ్చేవాడు (ఖైదీ) చంపేవాడు(తలారీ) కలిసి చేసే ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది.
సినిమాలో ముఖ్యంగా అపారమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న మాములు మనుషుల మనస్తత్వం, వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయో, నిజ జీవిత అనుభవాల్లోని సంఘటనలు ఎంత నాటకీయంగా ఉంటాయో దర్శకుడు చంద్ర సిద్దార్ద్ సాధ్యమైనంత వాస్తవికత దృక్పధంతో చూపించారు.
అలాగే దొడ్డన్న, ఉదయ్ పాత్రల ద్వారా మనుషుల మధ్య ఎలాంటి రిలేషన్ ఉండాలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇక హైపర్ ఆది తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ ఆకట్టుకోగా, దొడ్డన్న, ఉదయ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.
మైనస్ పాయింట్స్ :
కథాంశం మంచిది తీసుకున్నప్పటికీ దర్శకుడు చంద్ర సిద్దార్ద్, కథ కథనాన్ని మాత్రం చాలా నెమ్మదిగా నడిపించారు. సినిమాలో ఎక్కువ భాగం రోడ్లోనే సాగడం, పాత్రల మధ్య ఎలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడంతో ఈ సినిమా ఒక సగటు సినిమాలానే అనిపిస్తుంది. దర్శకుడు కథనం మీద ఇంకొంచం కేర్ తీసుకోని, సినిమాని ఇంకాస్త ఉత్కంఠ భరితంగా మలిచి ఉంటే బాగుండేది.
ఇక ప్రధాన పాత్ర బాబ్జి సినిమా ఆరంభం నుండి ప్రీ క్లైమాక్స్ వరకు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు తప్ప, అతను సినిమాలో చేసింది ఏమి లేదు. పైగా లోలోపలే బాధ పడుతున్నట్లు కనిపిస్తున్నా, అసలు అతను ఎందుకు బాధపడుతున్నాడో తెలియకపోయేసరికి కొంత గందరగోళంగా అనిపిస్తోంది. ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియన్స్ కు ఈ ప్రధాన పాత్ర గతం గురించి రివీల్ చేయకపోవడంతో బాబ్జి పాత్రలో ప్రేక్షకులు సరిగ్గా ఇన్ వాల్వ్ అవలేరు.
సినిమాకే మరో కీలకమైన పాత్ర జంగయ్య పాత్ర బాగున్నప్పటికీ, ఆ పాత్ర తాలూకు సంఘర్షణ ఎలివేట్ చేసే సంఘనటలు సరిగ్గా లేవు. బాబ్జికి ఊరిశిక్ష పడటానికి కారణమైన కీలకమైన సన్నివేశాలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. రొటీన్ సినిమాలకి బిన్నంగా ఉన్నప్పటికీ ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేలా లేదు.
సాంకేతిక విభాగం :
సినిమాలో మంచి భావోద్వేగ సన్నివేశాలు, మంచి కంటెంట్ ఉన్నా, దర్శకుడు చంద్ర సిద్దార్ద్ ఆకట్టుకునే కథ కథనాలతో ఆసక్తికరంగా చిత్రాన్ని మలచలేకపోయారు. ముని సురేష్ పిళ్ళై రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా జంగయ్య పాత్ర ద్వారా చేపించిన డైలాగ్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి.
సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు బాగున్నాయి ముఖ్యంగా ఆటగదరా శివ పాట బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటర్ నవీన్ నూలి సినిమా మధ్యలో వచ్చే కథకు అవసరంలేని కామెడీ సన్నివేశాల లెన్త్ ను కొంచెం తగ్గించాల్సింది. రాక్ లైన్ వెంకటేష్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
సినిమాలు తీయడంలో దర్శకుడు చంద్ర సిద్దార్థాది ప్రత్యేకమైన శైలి. ‘ఆ నలుగురు, అందరి బంధువయా’ వంటి మంచి సినిమాల్ని తీసిన ఆయన ‘ఆటగదరా శివ’ చిత్రాన్ని మాత్రం ఆ సినిమాల సరసన నిలబెట్టలేకపోయారు. ముందు చెప్పుకున్నట్లు అక్కడక్కడ కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, అపారమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న మాములు మనుషుల మనస్తత్వాలు, వారి భావోద్వేగాలు బాగున్నప్పటికీ, సినిమా ఆసక్తికరంగా లేకపోవడం, పైగా ఎక్కువ భాగం రోడ్లోనే జరుగుతూ బోర్ కొట్టడం సినిమా స్థాయిని తగ్గించేస్తుంది. కానీ ఓ మంచి కంటెంట్ తో రొటీన్ కి భిన్నమైన చిత్రాలను చూడాలనుకున్నే వారు, ఈ చిత్రం మీద ఆసక్తి చూపించొచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team