విడుదల తేదీ : సెప్టెంబర్ 28, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : అశిశ్ గాంధీ, అషిమా నర్వల్ తదితరులు
దర్శకత్వం : కల్యాణజీ గొనగ
నిర్మాతలు : శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్
సంగీతం : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫర్ : గరుడ వేగ అంజి
స్క్రీన్ ప్లే : కల్యాణ్ జి గొనగ
కల్యాణ్ జి గొనగ దర్శకత్వంలో అశిశ్ గాంధీ, అశిమా నర్వల జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాటకం’. ఈ చిత్రాన్ని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. కాగా సాయి కీర్తిక్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
ఓ దోపిడీ ముఠా ఓ గ్రామం మీద దాడి చేసి, అందర్నీ చంపి… బంగారం, డబ్బు దోచుకుంటుండగా సినిమా మొదలవుతుంది. కథలోకి వెళ్తే.. కోటి (అశిశ్ గాంధీ) తన ఊరు చింతలపూడిలో సరదాగా తిరిగే ఓ కుర్రాడు. త్వరగా పెళ్లి చేసుకోవాలని చేసే ప్రయత్నాలు విఫలమవుతున్న క్రమంలో.. అనుకోకుండా పార్వతి (అషిమా నర్వల్)ని చూసి ప్రేమలో పడతాడు. పార్వతి కూడా కోటిని ప్రేమిస్తోంది. ఇద్దరు ఫిజికల్ గా దగ్గరవుతారు. కానీ ప్రేమలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల కారణంగా కోటి, పార్వతిని వివాహం చేసుకుంటాడు. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న క్రమంలో పార్వతి గతం రివీల్ అవుతుంది.
ఎవరూ ఉహించని ఆ గతం కారణంగా కథ మొత్తం మారుతుంది. అసలు పార్వతి ఎవరు ? ఆమె చింతలపూడికే ఎందుకొచ్చింది ? అసలు ఆమె గతం ఏమిటి ? ఆ గతం కారణంగా కోటి జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఏమిటి ? ఆమెకు దోపిడీ ముఠాకు సంబంధం ఏమిటి ?చివరకి కోటి ఆ దోపిడీ ముఠాని ఏం చేశాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో హీరోగా నటించిన అశిశ్ గాంధి తన పాత్రకు తగ్గట్లు… తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ గురించి అసలు నిజం తెలిసే సన్నివేశంలో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని అశిశ్ గాంధి ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు.
ఇక హీరోయిన్ గా నటించిన అషిమా నర్వల్ కొన్ని బోల్డ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. హీరోకి తండ్రిగా కనిపించిన తోటపల్లి మధు తన పాత్రలో ఒదిగిపోయారు. తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగానే నవ్వించారు. హీరోకి ఆయనకు మధ్య సాగే సన్నివేశాలు ఎంటర్ టైన్ చేస్తాయి. హీరోకి పినతల్లిగా నటించిన ఆమె కూడా తన నటనతో ఆకట్టుకుటుంది.
దర్శకుడు కల్యాణజీ గొనగ తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. ఆయన రాసుకున్న కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. మెయిన్ గా.. హీరో ఇంట్రడక్షన్ సీన్ హీరో తన తండ్రితో కలిసి పెళ్లి చూపులకు వెళ్లే సీన్స్ లాంటి కొన్ని సీన్స్ మెప్పిస్తాయి. అలాగే సెకెండాఫ్ లో కొత్తగా రివీల్ అయ్యే కొన్ని అంశాలు బాగానే ఉన్నాయి. అశిశ్ గాంధి, అషిమా నర్వల్ తమ మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలతో మరియు తమ మధ్య కెమిస్ట్రీతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసారు.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు కల్యాణజీ గొనగ రాసుకున్న కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ..కథలో ప్లో మిస్ అయింది. ముఖ్యంగా ఆయన రాసుకున్న కథనం ఆకట్టుకొన్నే విధంగా లేదు. ఏ సీన్ కి ఆ సీన్ బాగుంది అనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. దీనికి తోడు కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ట్విస్ట్ లు బాగానే పెట్టారు గాని అవి థ్రిల్ చెయ్యవు.
దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారనిపిస్తోంది. అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. ఈ రిపీట్ డ్ సీన్స్ మరీ ఎక్కువడంతో సినిమా ఫలితమే దెబ్బ తింది.
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే హీరో ఏం అయిపోతాడో అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ ఉన్నా… దర్శకుడు కల్యాణజి గొనగ మాత్రం ఆ కంటెంట్ ను పూర్తిగా వాడుకోలేదు. కథనాన్ని ఆసక్తికరంగా మలచకపోగా.. ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. ఆయన సెకండాఫ్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. మొదటి పాట ఆకట్టుకుంటుంది. అదే విధంగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది.
మణికాంత్ ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది.పెల్లెటూరి విజువల్స్ ను ఆయన చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాతలు శ్రీ సాయి దీప్ చట్ల రాధిక శ్రీనివాస్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.
తీర్పు :
కల్యాణజి గొనగ దర్శకత్వంలో అశిశ్ గాంధీ, అశిమా నర్వల జంటగా వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆకట్టుకునే విధంగా లేదు. కానీ అశిశ్ గాంధి హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయనకు మాత్రం మంచి ఫలితాన్నే ఇస్తుంది. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో.. అశిశ్ గాంధీ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడు కల్యాణజి గొనగ రాసిన కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కథలో ముఖ్యమైన కొన్ని కీలక సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమాని మాత్రం ఆయన ఆసక్తికరంగా మలచలేకపోయారు. సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలతో విసుగు తెప్పిస్తారు. మొత్తం మీద ఈ ‘నాటకం ‘ చిత్రం నిరాశ పరిచింది. కానీ సినిమాలోని కొన్ని అంశాలు మాత్రం, బి.సి ఆడియన్స్ కి కనెక్ట్ కావొచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team