విడుదల తేదీ : నవంబర్ 23, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5
నటీనటులు : ఆదిత్ అరుణ్ , హెబ్బా పటేల్ , నరేష్ , రావు రమేష్
దర్శకత్వం : అయోధ్య కుమార్
నిర్మాత : సంజయ్ రెడ్డి
సంగీతం : జాయ్ బరువ
సినిమాటోగ్రఫర్ : ఉదయ్ గుర్రాల
అదిత్ అరుణ్ , హెబ్బా పటేల్ జంటగా ‘మిణుగురులు’ ఫేమ్ అయోధ్య కుమార్ తెరకెక్కించిన చిత్రం 24 కిస్సెస్. ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
ఆనంద్ కుమార్ ( ఆదిత్ అరుణ్ ) చిల్డ్రన్ ఫిలిం మేకర్. చిన్నపిల్లల సమస్యల ఫై చిత్రం కోసం క్రౌడ్ ఫండింగ్ చేయాలంనుకుంటాడు. శ్రీ లక్ష్మి (హెబ్బా పటేల్ ) ఆనంద్ దగ్గర ఫిలిం మేకింగ్ లో శిక్షణ తీసుకుంటుంది. ఈ క్రమంలో ఒకరి ఒకరు బాగా దగ్గర అవుతారు. దాన్ని శ్రీ లక్ష్మి ప్రేమ అనుకుంటుంది. కానీ మానవ సంబంధాల మీద నమ్మకం లేని ఆనంద్ కేవలం అది ఇష్టమే అనుకోని శ్రీలక్ష్మి తో పెళ్ళికి నో చెబుతాడు. దీనికి తోడు శ్రీ లక్ష్మి కి ఆనంద్ కు వేరే అమ్మాయిలతో సంబంధం వుందని తెలిసుకొని అతనికి దూరం కావాలనుకుంటుంది. ఆతరువాత ఆనంద్ ,శ్రీ లక్ష్మి మళ్ళీ కలిసారా? వారిద్దరూ పెళ్లిచేసుకున్నారా ? అనేదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఆనంద్ పాత్రలో నటించిన ఆదిత్అరుణ్ ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. నటనాపరంగా అలాగే లుక్స్ పరంగా కూడా మెప్పించాడు. శ్రీ లక్ష్మి పాత్రలో నటించిన హెబ్బా గత సినిమాల్లో కంటే గ్లామర్ గా కనిపించి తన పాత్రకు న్యాయం చేసింది.
ఇక మూర్తి పాత్రలో నటించిన రావు రమేష్ , హెబ్బా తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నరేష్ తమ పాత్రలను ఈజీ గా చేసుకుంటూవెళ్లిపోయారు. ఈచిత్రంలో మానసిక వైద్యుడిగా కనిపించిన రావు రమేష్ కు అలాగే ఆనంద్ కు మధ్య వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా నవ్వు తెప్పించాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు యూత్ కు బాగా నచ్చుతాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు అయోధ్య కుమార్ ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడం ఒక మైనస్ అయితే దాన్ని తెర మీద చూపించిన విధానం మరి తీసికట్టుగా వుంది. ఒక ప్రేమ కథ కు చిన్న పిల్లల సమ్యసలు అనే అంశాన్ని ఎందుకు జోడించారో అర్ధం కాదు. ఇలాంటి ఒక కథను రాసుకున్నప్పుడు ఆ రెండు విషయాలను బ్యాలెన్స్ చేయాలి కానీ ఈ చిత్రంలో ఆలా జరుగలేదు.
సినిమాలో ఒక రొమాన్స్ తప్ప , ఎమోషన్స్ , కామెడీ లేకపోవడం మరో బలహీనత అలాగే క్లైమాక్స్ లో హీరోలో మార్పు వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా అనిపించవు.
ఇక వీటికి తోడు స్లో నరేషన్ , పాటలు సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ‘మిణుగురులు’ లాంటి అవార్డు విన్నింగ్ సినిమాను తీసిన దర్శకుడి నుండి ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేం.
సాంకేతిక విభాగం :
సినిమా ను తెరకెక్కించడం లో అయోధ్య కుమార్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. రొమాన్స్ మీద కాన్సంట్రేషన్ పెట్టి తను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకేపోయాడు.
ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫిని అందించిన ఉదయ్ గుర్రాల సినిమాకు రిచ్ లుక్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. జాయ్ బారువా సంగీతం అక్కటుకునేలా లేదు. లో బడ్జెట్ లో సినిమాను నిర్మించిన సంజయ్ రెడ్డి సినిమాకు ఎంత అవసరమో అంత మేరకే ఖర్చు పెట్టారు .
తీర్పు :
అయోధ్య కుమార్ తెరకెక్కించిన ఈ’ 24కిస్సెస్’ ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. అనవసరమైన రోమాన్స్ , బలమైన ఎమోషన్స్ కామెడీ లేకపోవడం సినిమా ను చాలా బోరింగ్ గా మార్చేశాయి. చివరగా ఈచిత్రానికి ప్రేమికులు ఏమైనా కనెక్ట్ అవుతారేమో కానీ ఫ్యామిలీ , యూత్ ప్రేక్షకులను మెప్పించడం మాత్రం కష్టమే.
123telugu.com Rating :1.75/5
Reviewed by 123telugu Team