విడుదల తేదీ : జనవరి 09, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : బాలకృష్ణ , విద్యాబాలన్ , ప్రకాష్ రాజ్ , రానా, సుమంత్
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు : బాలకృష్ణ , సాయి కొర్రపాటి , విష్ణు ఇందూరి
సంగీతం : కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్
ఎడిటర్ : రామకృష్ణ
ఈ ఏడాది మచ్ అవైటెడ్ బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలోని మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ భారీ అంచనాలమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
ఎన్టీఆర్ ( బాలకృష్ణ ) రిజిస్టారర్ గా పనిచేస్తూ వాళ్ళ డిపార్ట్మెంట్ లో వున్న అవినీతి నచ్చక జాబ్ కు రాజీనామా చేసి సినిమాల్లో కి వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి ? ఇండియన్ మొదటి సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారు ? ఆ తరువాత రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో బాలకృష్ణ నటన మేజర్ హైలైట్ అయ్యింది. ఆయనకెరీర్ లో ఈ చిత్రం మైలు రాయిగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయిన తీరు చూస్తే ఈపాత్రను బాలయ్య తప్ప ఎవరు చేయలేరని అనిపిస్తుంది. ఇక బాలకృష్ణ తరువాత నటన పరంగా మెప్పించిన పాత్రలు బసవతారకం, ఏ యన్ ఆర్. ఈ పాత్రల్లో నటించిన విద్యా బాలన్ , సుమంత్ చాలా బాగా నటించారు. ముఖ్యంగా విద్యా బాలన్ బసవ తారకం పాత్రకు కరెక్ట్ గా సరిపోయింది.
ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కృష్ణుడి ఎపిసోడ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రింట్ సన్నివేశాలు సినిమా కు హైలైట్ గా నిలిచాయి. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులను చక్కగా చూపెట్టాడు దర్శకుడు క్రిష్. ముఖ్యంగా సినిమాను ఎండ్ చేసిన తీరు కూడా చాలా బాగుంది. దాంతో సెకండ్ పార్ట్ ఫై ఆసక్తిని తీసుకురాగలిగాడు క్రిష్.
మైనస్ పాయింట్స్ :
సినిమాకి ప్రధాన మైనస్ స్లో నరేషన్. బయోపిక్ సినిమాలంటే ఆసక్తిరమైన మలుపులు గ్రిప్పింగ్ నరేషన్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అవి మిస్ అయ్యాయి. ఇక ఫస్ట్ హాఫ్ ను పాత్రలను పరిచయడం చేయడానికే తీసినట్లుగా అనిపిస్తుంది. అందులో భాగంగా వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక బాలకృష్ణ , విద్యా బాలన్ , ఏ ఎన్ ఆర్ పాత్రలు తప్ప మిగితా పాత్రలు పెద్దగా రిజిస్టర్ అవ్వవు. అలాగే నటన పరంగా మెప్పించిన బాలకృష్ణ లుక్ పరంగా ఎన్టీఆర్ ను మ్యాచ్ చేయలేకపోయాడు. ముఖ్యంగా యంగ్ ఎన్టీఆర్ లుక్ కు బాలయ్య సెట్ కాలేదు.
ఇక సెకండ్ హాఫ్ కూడా నెమ్మదిగా సాగడం కూడా సినిమాకి మైనస్సే అయ్యింది. గ్రిప్పింగ్ నరేషన్ తో మరికొన్ని ఎలివేషన్ సన్నివేశాలతో సినిమాను ఆసక్తికరంగా మార్చి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే.
సాంకేతిక వర్గం :
తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహా నటుడు ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించడం సవాలు తో కూడుకున్న పని. ఈ విషయంలో క్రిష్ చాలా వరకు విజయం సాదించాడనే చెప్పొచ్చు. అయితే స్లో నరేషన్ అలాగే ఎక్కువ నిడివి సినిమాను అనుకున్న రేంజ్ కు తీసుకురాలేకపోయాయి.
ఇక కీరవాణి సంగీతం ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహిస్తే బాగుండేది. సాయి మాధవ్ బుర్ర రాసిన సంభాషణలు కూడా బాగున్నాయి. ఇక ఎన్ బి కె ఫిలిమ్స్. వారాహి, విబ్రి మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు :
మహా నటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు చాలా వరకు మెప్పించింది. బాలకృష్ణ నటన, సినిమాటిక్ ఎలివేషన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవ్వగా, స్లో నరేషన్, నిడివి సినిమాకు మైనస్ అయ్యాయి.ఇక ఈచిత్రం నందమూరి అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. చివరగా ఈచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి ఛాయస్ అవుతుందనే చెప్పవచ్చు.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team